17, నవంబర్ 2021, బుధవారం

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవం 2021

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా నవంబరు నెలలో నిర్వహించటం జరిగింది. 2021 నవంబరు 15, 16 తేదీల్లో నిర్వహించాము. ఈసారి పరిషత్ నిర్వహణ కొంత ఆర్థిక భారంగానే అనిపించింది. గతంలో పోగైనంత ఫండ్ కూడా ఈ సంవత్సరం పోగవ్వలేదు. ఎలానా అని బాగా ఆలోచించాను. అయినా సరే మిత్రులు కొంతమంది సహకారంతో పరిషత్ నిర్వహణకు పూనుకున్నాను. 

ముఖ్యంగా డేట్స్ అడ్జస్ట్ మెంట్ విషయంలోనే కొంత సందిగ్ధత నెలకొంది. మిత్రుడు చెరుకూరి సాంబశివరావు ద్వారా నేను శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, బృందావన్ గార్డెన్స్, గుంటూరు పాలక మండలి అధ్యక్షులు శ్రీ చిటిపోతు మస్తానయ్య గారిని కలవటానికి వెళ్ళాను. చెరుకూరి సాంబశివరావు చొరవతోనే నాకు నవంబరు నెలలో 15,16 రెండు రోజులు మాత్రమే పరిషత్ నిర్వహించుకోటానికి తారీఖులు దొరికాయి. అందులో ఎలాంటి సందేహంలేదు. 

డేట్స్ దొరికాయి. నాటికలు రెండు మాత్రమే ఫైనల్ అయ్యాయి. వాటిలో ఒకటి నేను రాసిన ‘‘ కమనీయం’’ నాటిక అయితే.. రెండోది చెరుకూరి సాంబశివరావు రాసుకున్న ‘‘వసంతం’’ నాటిక. ఈ రెండు నాటికలు అజోవిభోకందాళం వారికి ప్రాధమిక పరిశీలన నిమిత్తం ప్రదర్శనలాగా ఇద్దామని అనుకున్నాం. అయితే మరికొంత మంది మిత్రుల్ని నేను అడిగి చూశాను. మీరు కూడా నా పరిషత్ లో ప్రదర్శనలాగా స్క్రూటినీ ఇస్తారా అని. వారిలో ఒకరిద్దరు ముందు ఇస్తామన్నారు. తర్వాత ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పారు. నేను సరేలెమ్మనుకున్నాను. ఇలాంటి సమయంలో నాకు నా మిత్రుడు ఎం.మధు తన నాటిక ‘‘ తిరుగుప్రయాణం’’ ఆడతానన్నాడు. నాకు ఇక్కడికి మూడు నాటికలు వచ్చేశాయి. ఇంకొక్క నాటిక అయితే బాగుంటుంది అనుకున్నాను. అయితే ఏదీ.. ఏదీ అని ఆలోచిస్తుండగా.. ఈసారి పౌరాణిక నాటకం పెడితే బాగుంటుందని నాకు అనిపించింది. 

గతంలో నా మిత్రుడు చిలకలూరిపేటకు చెందిన సాంబశివ నాయక్ తను హరిశ్చంద్ర నేర్చుకుంటు న్నానని నాకు చెప్పి వున్నాడు. అతన్ని కన్సల్ట్ అయ్యాను. అతను ప్రదర్శించటానికి ఒప్పుకున్నాడు. కాటి సీన్ వద్దు.. వారణాసి ఆడతావా అని అడిగాను. దానిక్కూడా సరే అన్నాడు. అలా నా పరిషత్ లో నాటికలు సెట్ అయిపోయాయి. 

నాటకరంగానికి సేవలు అందించిన కొంతమందిని గుర్తించి వారికి సన్మానాలు.. ఏర్పాటు చేయాలనుకున్నాను. అలా మొదటిసారిగా నా దృష్ఠిలోకి వచ్చిన వ్యక్తి ‘‘ శ్రీ మానాపురం సత్యనారాయణ గారు’’ .  వీరికి ‘‘రంగస్థల నట సామ్రాట్ పురస్కారం’’ ఇవ్వటం జరిగింది. రెండవ వ్యక్తిగా మిత్రుడు ‘‘ చెరుకూరి సాంబశివరావుని’’ ఎంచుకున్నాను. అతనికి పీపుల్ స్టార్ అనే పురస్కారాన్ని అందించాను. రెండవ రోజు పురస్కారాలు నా నాటక రచనకి తొలిగురువు అయిన ‘‘నెమలికంటి వెంకటరమణ’’కి ‘‘ది గురు’’ పురస్కారం.. నాకు అన్ని సందర్భాల్లో వెన్నంటి వుండి ఆదుకున్న నా మిత్రుడు ‘‘ఎం.మధు’’ కి ‘‘పీపుల్ వాయిస్’’ అనే పురస్కారం అందజేయాలని నిర్ణయించాను. 

ఇప్పుడు వచ్చి డబ్బులు సమస్య.. నా దగ్గర మొత్తం ఎంతున్నాయో చూసుకుందామని అనుకున్నాను. పదిహేనువేల రూపాయలు మాత్రమే వున్నాయి. ఇవి ఎందుకూ చాలవు. అలాంటి సమయంలోనే నా స్నేహితుల్ని నేను డబ్బు సాయం కోరాను. వాళ్ళుకూడా వాళ్ళకున్నంత మేర డబ్బులు పంపించారు. ఫేస్ బుక్... వాట్సప్ లాంటి సోషల్ మీడియాల్లో కూడా అభ్యర్థనలు పంపాను. ఒకరిద్ధరు స్పందించారు. వారి శక్తి కొలది వాళ్ళు కూడా డబ్బులు అందించారు. అలా ఒక పాతిక వేలరూపాయలు పోగయ్యాయి. నాదగ్గరున్న పదిహేను వేలకి పాతికవేలు. టోటల్ 45,000 రూపాయలు వచ్చాయి. సరిపెట్టచ్చులే అనుకున్నాను. కానీ ఎక్కడో చిన్న అనుమానం. సరిపోకపోతే అని.. అయినా సరే అన్న మొండి ధైర్యం. మరోచోట కూడా ప్రయత్నించి చూద్దాం అని నా పెద్దమ్మ కొడుకు కిరణ్ ని అడిగాను. నేను అడిగీ అడగ్గానే వాడు పదివేల రూపాయలు పంపించాడు. ఇప్పుడు నాదగ్గరున్న అమౌంట్ 55,000 రూపాయలు. చాల్రా బాబూ అనుకున్నాను.


నామీదున్న అభిమానంతో నేను ప్రదర్శనా పారితోషికం తక్కువ ఇచ్చినా కూడా వచ్చి నాటిక ప్రదర్శనలిస్తున్న ఈ నాటక సమాజాల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఆడపడచు లాంఛనాలు చీర,జాకెట్, గాజులు, బొట్టు, కాటుక వంటివి నా సోదరి ‘‘ లహరి ’’ అందించింది. మొత్తానికి నేను అనుకున్నదానికంటే పరిషత్ విజయవంతంగా పూర్తిచేయటానికి ముందుండి మార్గదర్శనం చేశారు మిత్రుడు చెరుకూరి సాం
బశివరావు. వ్యాఖ్యాతగా బసవరాజు జయశంకర్ వహించారు. స్టేజీ మీద సంధాన కర్తగా ప్రముఖ నాటక రచయిత,దర్శకుడు, నటుడు కావూరి సత్యనారాయణ వహించారు. నేను పిలవగానే అభిమానంతో , వాత్సల్యంతో ప్రముఖ నాటక రచయిత, న్యాయనిర్ణేత నుసుము నాగభూషణం, ప్రముఖ న్యాయనిర్ణేత దేవిరెడ్డి రామకోటేశ్వరరావు, కళాసౌధ బిరుదాంకితులు బి.వేదయ్య, ప్రముఖ నటుడు,దర్శకుడు మానాపురం సత్యనారాయణ, రంగస్థల సినీనటుడు,దర్శకుడు,రచయిత చెరుకూరి సాంబశివరావు, ప్రముఖ రంగస్థల సినీ నటుడు,దర్శకుడు, వరికూటి శివప్రసాద్ లు పాల్గొని తొలిరోజు కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. తొలిరోజు శ్రీ మానాపురం సత్యనారాయణగారికి, శ్రీ చెరుకూరి సాంబశివరావు గారికి పురస్కార ప్రదానం చేయటం జరిగింది.

మొదటి ప్రదర్శనగా శ్రీ సద్గురు కళానిలయం, గుంటూరు వారి ‘‘ కమనీయం ’’ నాటికను ప్రదర్శించారు. ఈ నాటికకు రచన: విద్యాధర్ మునిపల్లె, దర్శకత్వం : బసవరాజు వహించారు.

రెండవ ప్రదర్శనగా  అంజనారాథోడ్ థియేట్, చిలకలూరిపేట వారి ‘‘ సత్యహరిశ్చం ద్రీయం - వారణాసి సీన్’’ ప్రదర్శించారు. 



అలానే రెండవ రోజు కార్యక్రమాల్లో... డెక్ మెన్ కళాపరిషత్ నిర్వాహకులు శ్రీ రాజారావు, ప్రముఖ నటుడు, దర్శకుడు చిల్లర సుబ్బారావు, కాసరనేని సదాశివరావు పరిషత్ నిర్వాహకుడు కాట్రగడ్డ రామకృష్ణ, వరికూటి శివప్రసాద్, శ్రీ కావూరి సత్యనారాయణ, ప్రముఖ పాత్రికేయుడు, రచయిత, నటుడు, దర్శకుడు శ్రీ ఎం.మధు, ప్రముఖ నటుడు, దర్శకుడు, న్యాయనిర్ణేత, రచయిత శ్రీ నెమలికంటి వెంకటరమణ లు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎం.మధుకి పీపుల్ వాయిస్, నెమలికంటి వెంకటరమణకి ‘‘ ది గురు’’ అనే పురస్కారాలు అందించటం జరిగింది. 



మొదటి ప్రదర్శనగా మధుథియేటర్ ఆర్ట్స్, తుళ్ళూరు వారి ‘‘ తిరుగు ప్రయాణం’’ నాటికను ప్రదర్శించారు. ఈ నాటికకు రచన,దర్శకత్వం : ఎం.మధు.

రెండవ ప్రదర్శనగా ఉషోదయ కళానికేతన్, కట్రపాడు వారి ‘‘ వసంతం’’ నాటికను ప్రదర్శించారు. ఈ నాటికకు మూలకధ : గంగారపు రాణి, నాటకీకరణ : దర్శకత్వం : చెరుకూరి సాంబశివరావు వహించారు. 

ఈ కార్యక్రమంలో వెనకవుండి నన్ను ముందుకు ప్రోత్సహించిన నా మిత్రుడు షేక్.డి.హసన్, సోదరి లహరి, అమృతవర్షిణిలు ఎంతగానో సహాయ సహకారాలు అందించటం జరిగింది. 

పరిషత్ నిర్వహణ దిగ్విజయంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. 

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవం 2021

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా నవంబరు నెలలో నిర్వహించటం జరిగింది. 2021 నవం...

ప్రఖ్యాతిగాంచిన పోస్టులు