రంగస్థలనగ్నచిత్రం 2.2

అయితే నాదో చిన్న రిక్వెస్ట్ అన్నాడతను
ఏంటన్నట్లుగా చూశాను.
దయచేసి వ్యక్తుల పేర్లు మార్చండి... ఎందుకంటే సమాజంలో ఆ కొడుకు పరిస్థితి గౌరవనీయమైన స్థానంలో వుండొచ్చు. మరోలా అనుకోకండి... అన్నాడు.
నేను మౌనంగా తలూపాను.
కానీ నా మనసులో కథకి గాయత్రి అని పేరు పెడదామని అనుకుంటున్నాను. 
ఇంతలో ఒంగోలు వచ్చింది.. 
టీ కూడా వచ్చింది.. తాగమంటూ అతనికి ఆఫర్ చేశాను.. 
నాయర్ ఈకథకి గాయత్రి అని పేరు పెడితే బాగుంటుందనిపిస్తోంది అన్నాను.
వద్దన్నాడు.. అందులో ఏ ఒక్కపేరూ వాడద్దన్నాడు. 
సరే అన్నట్లుగా తలూపాను.. 
మళ్ళీ నా మనసులో ఇతను చెప్పిన కథని నాటకీకరణ చేయటం గురించి ఆలోచిస్తున్నాను. 
గాయత్రి చనిపోవటం, మాష్టారికి పెరాల్సిస్ రావటంతో నాటికను ముగిస్తే .. నాకెందుకో తృప్తిలేదు.
ఆలోచిస్తూ చాలా క్యాజువల్ గా అతన్ని చూశాను.
ఎదురు సీట్లో పడుకున్న పెద్దాయనతో నాయర్ ఏదో మాట్లాడుతున్నాడు. నాకు అర్థంకాలేదు..
బహుశ అది మళయాళం కావచ్చు.
ఆ పెద్దాయనకి నాయర్ నన్ను చూపిస్తూ ఏదో చెబుతున్నాడు. 
నారాయణాద్రి రైలు తెనాలి చేరుకుంది. 
గుంటూరు చేరుకోటానికి ఇంకా కేవలం 40 నిమిషాలుంది.
నాయర్ ఎవరీ పెద్దాయన? ఏమంటున్నారు? అనడిగాను.
మన కథలో మాష్టారు.. ప్రస్తుతం హైదరాబాద్ లో నాతోనే వుంటారు..
నేను మామూలుగానే ఆయన్ని చూశాను.. ఆయన నావైపు చూస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు.
నేను బాధపడొద్దన్నట్లుగా నాకొచ్చిన సైగలతో, అభినయంతో చెప్పే ప్రయత్నం చేశాను..
ఆయనకి అర్థమైందన్నట్లుగా నాయర్ కి ఏదో చెప్పాడు.. 
మళ్ళీ ఏంటి? అన్నాను..
ఏం లేదు.. మీ అడ్రసు, ఫోన్ నెంబరు అడగమంటున్నారు.
ఇస్తాను.. తీసుకోండి.. అంటూ నా అడ్రసు ఫోన్ నెంబరు ఇచ్చాను. కొంచెం సేపటికి గుంటూరుకు దగ్గరగా వచ్చామని అర్థమైంది. ఈలోగా నేను నా లగేజీ, అవన్నీ మెల్లిగా తీసుకుంటూ, మా ఫ్యామిలీని ఒక్కొక్కరినీ నిద్రలేపుతూ రెడీ చేస్తున్నాను. ఇంతలో గుంటూరు వచ్చేసింది. నేను నాయర్ తో ...
‘‘థ్యాంక్స్ నాయర్... మంచి కథ చెప్పావు. తప్పకుండా మంచి నాటికగా మలుస్తాను’’ అన్నాను.
‘‘సార్.. ఇప్పుడు మీకో ట్విస్ట్ ఇస్తాను.. ఏమీ అనుకోరుగా’’ అన్నాడు..
స్టోరీ అంతా క్లియర్ గా వున్నాక ట్విస్ట్ ఏంటి ? అన్నాను.
‘‘ఏంలేదు.. ట్రైన్ గుంటూరు వచ్చింది.. దిగండి ’’ అన్నాడు. మా లగేజీ ట్రైన్ లోంచి కిందకి అందించాడు.. తిరిగి అతను అతని సీట్ లోకి వెళ్ళి కూర్చుని ఏడుస్తూ... ‘‘కథలో కొడుకిని నేనే సార్... నన్ను క్షమించండి. అమ్మ విలువ తెలుసుకోకుండా బాధించే నాలాంటి యదవలందరికీ కనువిప్పు కలిగేలా డ్రామా ప్రిపేర్ చెయ్యండి.. ’’ అన్నాడు.
నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ కాన్ఫిడెన్ట్ గా చెప్పాను.. తప్పకుండా నాటిక రాస్తానని, ప్రెజెంట్ చేయిస్తానని.. ఎప్పుడు? ఎక్కడ? ఎవరితో లాంటివి మాత్రం నేను చెప్పలేను.. డ్రామా ప్రజెంట్ చేసే రోజు మీకు ఇంటిమేట్ చేస్తాను. వస్తారా? అన్నాను..
బదులుగా నైరాశ్యంతో కూడిన ఒక నవ్వు.. కూతేస్తూ రైలు కదిలింది..
మీ సెల్ నెంబర్ ఇవ్వండి.. అన్నాను.. నేనూ రైలుతో పాటు కదిలాను..
అతను కిటికీ మూసేశాడు..
నేను నా ఫ్యామిలీని తీసుకొని ఇంటికొచ్చాను. దారిపొడుగుతా ఆటోలో అతని గురించే నా ఆలోచన.. అతని కథ నాకు చెప్పాడు.. నిజంగా అతని కథేనా..? లేక అతను ఊహించి చెప్పాడా.. అని..
లేదు.. అతను ఊహించలేదు.. నిజంగానే అతను చెప్పింది.. అతని కథే..
కథ చెప్పే కాసేపు అతని కళ్ళల్లో ఏదో తెలీని ఆవేదన..
దేవత లాంటి తల్లిని దూరం చేసుకున్నాననే వేదన..
తనపాత్ర చెబుతున్నప్పుడు ఆ పాత్రమీద అసహ్యం..
మాష్టారి పాత్ర చెబుతున్నప్పుడు మధ్య మధ్యలో మాష్టారి వైపు చూస్తున్న చూపులు..
ఇవన్నీ నాకు ఒక్కటొక్కటే గుర్తుకొస్తున్నాయి...
కథ చెప్పే టప్పుడు నేను పెద్దగా గమనించని ఒక్కొక్క విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ లోతుగా ఆలోచిస్తే.. యస్. ఇది మొమ్మాటికీ అతని కథే..
ఆటో ఇంటికొచ్చింది...
యాంత్రికంగా డబ్బులిచ్చి ఇంట్లోకి కదిలాను.. పడుకున్నాను.. కానీ నా మనసంతా నాయర్ చెప్పిన కథే నా మనసులో తిరుగుతోంది.. గాయత్రి రూపం ఎలా వుంటుందో తెలీదు కానీ, ఆమె పాత్ర చిత్రణ మాత్రం అద్భుతంగా మలచాలని నిర్ణయించుకున్నాను. అమూల్యమైన అమ్మ విలువ తెలుసుకోని ప్రతి ఒక్కరూ వారి వారి అమ్మల్ని గౌరవించేలా నాటికను మలచాలనుకున్నాను..
నాటికకి కథ అయితే వుంది.. అయితే దానికి ఏ పేరు పెట్టాలా అని దాదాపు 4నెలలపాటు నేను ఆలోచించాను.  (సశేషం)

కామెంట్‌లు లేవు:

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవం 2021

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా నవంబరు నెలలో నిర్వహించటం జరిగింది. 2021 నవం...

ప్రఖ్యాతిగాంచిన పోస్టులు