రంగస్థల నగ్నచిత్రం 2.6
(కొనసాగింపు)
నా ఆలోచనలు కూడా ఆ దిశగానే కదిలించాను.. ఇంతలో నేను గతంలో
(సుమారు 2015-16) సంవత్సరంలో అనుకుంటా ‘‘సంకీర్తన’’ అనే నాటిక రాయటం జరిగింది. దానిని కాకినాడకు
చెందిన సి.ఎస్.ప్రసాద్ కి ఇవ్వాలని అనుకున్నాను. నాటిక రాశాను. నగర సంకీర్తన అనే
ప్రత్యేకమైన జానపద కళారూపం పై రాసిన నాటిక అది. దానిని ప్రసాద్ కి ఈ మెయిల్
చేశాను. నాటిక చదివాక ప్రసాద్ అన్నయ్య నాకు ఫోన్ చేశారు.
తమ్ముడూ నాటిక చాలా బాగా రాశావు.. మనం తప్పకుండా చేద్దాం
అన్నారు.
అయితే చిన్న చిన్న మార్పులు చేయాలన్నారు.
నేను ఆయన అడిగిన మార్పులు చేయటానికి సిద్ధమయ్యాను.
అయితే మధ్యలో ఏమైదో... ఎందుకొచ్చిందో గ్యాప్ అర్థంకాలేదు.
నాటిక ఆగిపోయింది.
కాలగమనంలో నాటిక రాసిన విషయం కూడా నేను మర్చిపోయాను.
బహుశ అన్నయ్య కూడా మర్చిపోయారనే అనుకున్నాను.
ఇటీవల కాలంలో (2018)లో నవరస కాకినాడ వారి 55వ వార్షికోత్సవం
సందర్భంగా నిర్వహిస్తున్న నాటికల పోటీలలో సంకీర్తన నాటిక ప్రదర్శించాలని అందుకు
తమకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ కాకినాడకు చెందిన ‘‘దండు కృష్ణంరాజు’’ కోరారు.
సంకీర్తన నాటిక గురించి నన్ను పర్మిషన్ అడగగానే ముందు నేను ఆలోచనలో పడ్డాను.
నేను ఎప్పుడు రాశాను.. నన్ను పర్మిషన్ అడుగుతున్నారేంటి? అని నేను ఆలోచించాను.
కాసేపటికి నాకు గుర్తు వచ్చింది. నేను దానిని సిఎస్ ప్రసాద్ కి కదా
ఇచ్చింది... అది కూడా ఇచ్చి చాలా కాలం అయింది.. ఇదే సందేహాన్ని నేను వెలిబుచ్చాను.
దానికి కృష్ణంరాజు గారు
‘‘నేను ప్రసాద్ ఇద్దరం మంచి
ఫ్రండ్సనీ, ఏదైనా మంచి నాటిక
అడిగితే ఈ నాటికను తనకు ఇచ్చారని, నాటిక చాలా బాగుంది.. మీరు పర్మిషన్ ఇస్తే నేను నాటిక ప్రదర్శిస్తాను.. ’’ అన్నారు.
‘‘థ్యాంక్స్’’ అన్నారు
సిఎస్ ప్రసాద్ కూడా నాకు ఫోన్ చేసి నాటిక ప్రదర్శనకు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వమని, తను దగ్గరుండి చూసుకుంటానని
చెప్పారు.
‘‘సరే అన్నయ్యా.. మీ ఇష్టం...
మీరు దగ్గరుండి చూసుకుంటే నాకే ఇబ్బందీ లేదు.. అది కేవలం నేను మీరు ప్రదర్శించాలని
రాసిన నాటిక. మీద్వారా అది బయటకు రావాలని కోరుతున్నాను. మీ నేతృత్వంలో
ప్రదర్శిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను’’ అన్నాను.
ప్రసాద్ నాకు హామీ ఇచ్చారు.
ఏవో కొన్ని కారణాల వల్ల కాకినాడ గురుప్రసాద్ గారు నాటికలు స్క్రూటినీ చూసి
సెలక్ట్ చేస్తున్నారని.. స్క్రూటినీ కోసం రమ్మని నన్ను కృష్ణంరాజు గారు
ఆహ్వానించారు.. కానీ నాకు వ్యాపారపని ఒత్తిళ్ళలో వెళ్ళటానికి కుదరలేదు. కానీ నాటిక
స్క్రూటినీ గురించి ఆరా తీశాను.. చాలామంది బాగా వచ్చిందన్నారు.. మరికొంతమంది
ఫర్వాలేదన్నారు.. ఇంకొంతమంది నాటిక కృష్ణంరాజు బాగా చేయలేదన్నారు.
మనకి కావాల్సింది బాగా చెయ్యలేదు, ఫర్వాలేదు... వీళ్ళు మనకి ఇంపార్టెంట్..
నాటిక ఎందుకు బాగాలేదు? ఎందుకు ఫర్వాలేదు...? అనే వారిని అడిగాను.
నా తప్పులు నేను దిద్దుకోవాలంటే నాకు వీళ్ళతోనే పని...
వాళ్ళంతా ముక్తకంఠంతో చెప్పిన మాట ఒక్కటే.. రచనపరంగా నాటికకు వంకలు
పెట్టటానికి ఏమీలేదు.. కానీ, పెర్ఫార్మెన్స్ పరంగానే నాటిక కొంచెం ఇబ్బంది కరంగా వుంది అని..
సరే.. మీకు ఎక్కడ ఇబ్బందికరంగా అనిపించింది..? ఎవరి పాత్రలో ఇబ్బంది కరంగా అనిపించింది అని అడిగాను.. చాలా మంది కృష్ణంరాజు
పాత్రమీద వంకపెట్టారు.
మరికొంతమంది అంత బరువైన సబ్జక్టు వీళ్ళు చెయ్యలేరు సార్.. వాళ్ళేదో చిన్న
చిన్న నాటికలు చేసుకునే వాళ్ళు. ఒకేసారి అంత బరువు తీసుకొచ్చి వాళ్ళమీద పెట్టారు
మీరు.. రచన పరంగా వేలు పెట్టటానికేం లేదండీ.. అన్నారు.
ఇవన్నీ కాదని నేను గురుప్రసాద్ గారితో మాట్లాడాను.
గురుప్రసాద్ గారూ.. ‘‘ మీరు నాటిక చూశారు.
సెలక్ట్ చేస్తారా లేదా అన్న అంశం గురించి నేను మాట్లాడను. నాకు మీరు చెప్పాల్సిన
అవసరం కూడాలేదు. కానీ మిమ్మల్ని అడుగుతున్నాను.. సంకీర్తన నాటిక ఎలా వుంది?’’ అని అడిగాను.
‘‘ నాటిక రచనపరంగా చాలా
బాగుంది.. ఎక్కువగా పల్లెటూరి శ్లాంగ్ వాడావు.. అది మనవైపు కొంచెం కష్టంగా వుంది.
కృష్ణంరాజు ప్రాక్టీస్ చేయగలిగితే నాటిక బాగుంటుంది. మంచి సబ్జక్టు.. ’’ అన్నారు.
‘‘ థ్యాంక్యూసార్’’ అన్నాను.
ఆతర్వాత నేను నాటిక విషయం వదిలేసి ఆయన పర్సనల్ అంశాలు అంటే .. ఆరోగ్యపరమైన
అంశాలు తదితర అంశాలపై కాసేపు మాట్లాడాను.
ఆ తర్వాత నేను మరికొంత మందితో మాట్లాడాను.. వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే
కృష్ణంరాజు మీద కొంతమందికి సరైన అభిప్రాయం లేదని.. అయినా సరే కృష్ణంరాజుగారితో
నేను నాటిక ప్రదర్శన, ఇతరత్రా అంశాలపై
చర్చించాను. నాటికలో ఏది ఎక్కడ కట్ చేయాలి... ఎక్కడ లింక్ చేయాలనే అంశాలపై
చర్చించాను. ఆ తర్వాత సి.ఎస్. ప్రసాద్ తో కూడా నాటిక విషయమై మాట్లాడాను.
ప్రసాద్ నాకు భరోసా ఇచ్చారు.. నాటిక బాగా వస్తుంది
తమ్ముడూ.. నువ్వేం కంగారు పడకు.. అని
నేను ఒకటే చెప్పాను.. అన్నయ్యా.. వాళ్ళు ఒక్క ప్రదర్శనన్నా
వేయగలిగితే చాలు.. అన్నాను.
ఆరోజు నేనా మాట ఎందుకన్నానంటే... (ఇంకా వుంది.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి