24, నవంబర్ 2019, ఆదివారం

నాటక ప్రదర్శన - విమర్శ 4

(4వ భాగం కొనసాగింపు)
మన అలంకార శాస్త్రం సహృదయుడ్ని ఇలా పేర్కొంది.

‘‘ఏషాం కావ్యానుశీలనాం అభ్యానవశాత్
విశ్వభూతే మనోముకులే వర్ణనీయ
తన్మయీ భావనా యోగ్యతాతే
సహృదయ సంవాద భాజాః సహృదయాః’’ అని

అంటే విమర్శకుడు అంటే సహృదయుడు పరిణితుడై వుండాలీ అన్నది దీనర్థం. రచనద్వారా లేదా ప్రదర్శన ద్వారా తాను అనుభవించిన అనుభూతులన్నింటినీ విపులంగా, సమగ్రంగా, విశదీకరించి చెప్పగలగాలి. నిష్కలంకంగా, నిర్భయంగా, పారదర్శకంగా వ్యక్తీకరించే ‘దర్పణం’లా ఉండాలి. రచయిత హృదయాన్ని అర్థం చేసుకొని, ఆ హృదయావిష్కరణకు పూనుకోవాలి. 

ఊరికే అనవసర, అప్రస్తుత, అకారణ వ్యాఖ్యల, వర్ణన చేయటం విమర్శకాదు. తాను పొందిన అనుభూతికీ, ప్రయోజనానికీ ‘విలువ’ కట్టగలగాలి. అప్పుడే ా విమర్శ ఒక ప్రయోజనాన్ని కలిగి ‘సహేతుక విమర్శ ’ అనిపించు కుంటుంది. అయితే విమర్శకుడిగా తాను నిర్వహిస్తోన్న ఈ బాధ్యతా క్రమంలో ఎన్నో విమర్శకులకు గురౌతాడు. వాటిని లెక్కచేయక ముందుకు వెళ్ళేవాడే విమర్శకుడు (సహృదయుడు). మారుతున్న పరిణామాలు, విలువల్ని ఆయా రచయితలకు సూచించే బాధ్యత కూడా విమర్శకుడిదే. రచన లేదా ప్రదర్శన విలువల్ని విశ్లేషించి, విలువ కట్టి పాఠకుల, ప్రేక్షకుల అభిరుచిని బేరీజు వేయటం లేదా సరిచేయట లేదా పెంపొందించే బాధ్యత కూడా విమర్శకుడిదే...

అప్పుడే ఆ రచన లేదా ప్రదర్శన మెరుగులు దిద్దుకుని ప్రజాదరణ పొందుతుంది. అంటే నాటక ప్రదర్శన విజయవంతం గావటానికి విమర్శ ఎంత అవసరమో విమర్శకుడూ అంతే అవసరం. అంతేకాదు.. సహేతుకమైన విమర్శ ఆ నాటక ప్రదర్శన ప్రోత్సాహానికి కూడా దారి తీస్తుంది.

ఇదంతా నేను కేవలం నాకు తెలిసిన పెద్దలను, ఆయా పుస్తకాల్లోనూ చదివి తెలుసుకున్నది కొంతైతే.. నా అనుభవంలో.. నాగమనంలో నేను సేకరించిన అంశాలు మరికొన్ని... దయచేసి వీటిపై మీ కామెంట్లు తెలియజేయగలరు.

మీ 
విద్యాధర్ మునిపల్లె.

నాటక ప్రదర్శన-విమర్శ 3

(కొనసాగింపు)
గత సంచికలో చెప్పిన దానికి భిన్నంగా వుండేదే ఉత్తమ విమర్శకు దారితీస్తుంది. అలా చేయగలినవాడే ఉత్తమ విమర్శకుడుిగా గుర్తించబడతాడు. ఇక సమాజం సాహిత్యాన్ని ప్రభావితం చేస్తే, సాహిత్యం విమర్శను ప్రేరేపిస్తుంది. అంటే సాహితీ విమర్శచేత ప్రభావితమైన సాహిత్యం - సమాజాన్నీ, సమాజంలోని ఆలోచనాత్మక భావజాలాన్నీ ప్రభావితం చేస్తుంది. అందుచేత సాహితీ విమర్శ అవసరమైంది.. అనివార్యమైంది.. పాఠకులు, సామాజికులు సాహితీ జీవనగమనంలో నిత్యకృత్యమైంది.. ఈ విషయంలో నాటక సాహిత్యానికి ఎక్సెప్షన్ లేదు. సాహితీ ప్రక్రియైనా విశ్లేషణ, ప్రశంస, విమర్శలకు స్థానం కల్పించినప్పుడు మాత్రమే సమాజం ప్రభావితం అవుతుంది. అలా కానట్లయితే, అది ఉత్తమరచనగా కాకుండా ఉత్తరచనగానే మిగిలిపోతుంది. మరి ఇంతగా ప్రభావితం చేసే రచన మౌలికంగా ఏ లక్షణాలను కలిగి వుండాలి?

ప్రఖ్యాత హంగేరియన్ విమర్శకుడు జార్జ్ లూకాచ్ సమాజాన్ని ప్రభావితం చేసే రచనకు ఈ క్రింది లక్షణాలుండి తీరాలన్నారు. 

  1. సంపూర్ణత : రచన విస్తృతంగా ఉండి, జీవన గమనాన్నీ, అనుభవాలనూ పంచుకోవాలి.
  2. సమకాలీనత : రచనలో చోటు చేసుకున్న ప్రాంతకాలాలను ఆ జీవన గమనం ప్రతిబింబించాలి. దేశ కాలాలకు సంబంధించిన సాధరణ, ప్రత్యేక లక్షణాలు ఆ రచనలో గోచరించాలి.
  3. ప్రపంచ చారిత్రక దృశ్యం రచనలోని జీవిత దృశ్యాలకూ, ప్రాపంచిక స్థితిగతులకూ మధ్య వుండే సంబంధం ప్రస్ఫుటం కావాలి లేదా కనీసం సూచించబడాలి.
ఇక నాటక సాహిత్యం అనే మహాసాధనానికి సమాజం, రచయిత, రచన పాఠకుడు అనే నాలుగు స్థంభాలు పరస్పర సంబంధం కలిగి దేనికదే భిన్నంగా కన్పిస్తూ, ఆ భిన్నత్వంలో ఏకత్వానికి దారితీసే అంశాలుగా పరిణమిస్తాయి. వీటి ఆధారంగా నాటక విమర్శను నాలుగు విధాలుగా విభజించవచ్చు.


  1. సమాజ పరమైన విమర్శ : అంటే సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ సమాజాన్ని రచనతో పోలుస్తూ చేసేది.
  2. రచయిత పరమైన విమర్శ : కేవలం రచయితను దృష్టిలో పెట్టుకొని, అతని ధృక్పథంతో చేసేది.
  3. రచనా పరమైనది : రచయిత , సమాజాన్ని వదలి, కేవలం రచనా ధృష్టితో చేసేది.
  4. పాఠక పరమైనది : పై మూడింటినీ కాదని, కేవలం తన దృష్టితో చూసి చేసేది.

మరి నాటక ప్రదర్శన విషయానికొస్తే, పైన చెప్పినంత సులువుకాదు. కారణం ఏమిటంటే పై విషయమంతా వ్యక్తిగతం. ఇక్కడ ఎందరో ప్రేక్షకుల స్పందన, మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. నాటక ప్రదర్శనకు సంబంధించిన విమర్శ, ప్రశంస విశ్లేషణ బాధ్యతాయుతం.. తీక్షణం.. సునిశితం ఎందుకని నాటకం జీవితానికి దర్పణం కాబట్టి, ఇక్కడ నాటక ప్రదర్శన విమర్శ సామాజిక బాధ్యతై కూచుంది. మింగుడు పడని విషయాలను సైతం నిష్కర్షగా, నిష్పాక్షికంగా, నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా కరకుబడని సత్యాలను సైతం విమర్శకుడు వెల్లడించాల్సిన బాధ్యత అతడిపై ఉంది. అసందర్భ వాదనలూ, అర్థం పర్థంలేని సిద్ధాంతాలు, మొండి వాదాల జోలికి పోకుండా విమర్శకు పూనుకొంటే తనను తాను సంస్కరించుకుంటూ ఎదగటమే కాకుండా సమాజాన్ని కూడా సంస్కరించిన వాడౌతాడు. ఇవన్నీ లేకుండా విమర్శకులం అంటూ తమకు తాముగా ఓ పనికిమాలిన ముద్ర వేసుకుంటూ, ఏదో విధంగా పబ్బం గడుపుకుంటూ, ఏకపక్ష పక్షపాత ధోరణులతో ఏవేవో పిచ్చిరాతలు రాసేవారు నా దృష్టిలో సాంస్కృతిక రంగ నిరుద్యోగులు మరియు సాంస్కృతిక వ్యభిచారులు.

అసలు విమర్శకుడంటే ఎవరు? అతనికి ఎలాంటి లక్షణాలుండాలి? ఇప్పుడీ అంశాల్ని పరిశీలిద్దాం
‘నభావ హీనోస్తిరసః’ అన్నాడు నాట్యశాస్త్రంలో భరతుడు. రచనపై ఎటువంటి స్పందనలు లేనివాడు ‘అరసికుడు’ అని దీనర్థం. అంటే అభిరుచి, అభినివేశం, భావోద్రేకాలు ఇటువంటి వేవీ అతనికుండవు. ప్రముఖ ఆంగ్ల విమర్శకుడు ఇటువంటి వాడ్ని ‘ఫిలిస్టర్’అన్నాడు. ఇటువంటి వాడ్ని ఉద్దేశించే ఇంకో విధంగా ‘‘ అరసి కేషు కవిత్వం నివేదనం శిరశి మాలి మాలి మాలిఖ’’

‘‘ రసికత్వం ఆస్వాదించి అనుభవించే గుణం లేని వాడికోసం రచనలు చేసే దురదృష్టాలన్నీ నాకివ్వకు దేవా ’’ అని బ్రహ్మను ప్రార్థించాడు కాళిదాసు.

ఇక రెండవ వర్గాన్ని చూద్దాం.. మీరు.. కొంతమేరకు ఆ సాహితీ ప్రక్రియ చదివేటప్పుడు ఏదో ఒక అనుభవానికి లోను కావచ్చు లేదా అసంతృప్తి చెందవచ్చు. లేదా ఆనందిచచ్చు. కానీ తన స్పందన, ప్రతిస్పందనలకు కారణాలు మాత్రం చెప్పలేడు.

ఇక మూడవ వర్గాన్ని చూస్తే ఆ రచనను చదివి బాగా ఆకళింపు చేసుకొని, స్పందించటమే కాక, ఆ స్పందనకు కారణాలను కూడా శోధించి, తను అనుభవాలను ఇతరులకు పంచుతాడు. ఆ రచనకు మూలాలేంటి? ప్రేరణేంటి? కథను మలచిన తీరు, వర్ణన అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? చివరికి ఏం చెప్పాడు.? ఇత్యాది ప్రశ్నలన్నీ తనకు తానుగా వేసుకుంటూ, సమాధానాలు రాబట్టుకునే ప్రయత్నంలో భాగంగా సంఘర్షణను అనుభవిస్తూ, తన అనుభవాలన్నింటినీ బహిర్గతం చేసి, ఆ రచనకు ఓ రకమైన ్రపజాదరణ కల్పించే ప్రయత్నం చేస్తాడు. ఇటువంటి వాడ్ని ‘విమర్శకుడు’ అనవచ్చు. అయితే విమర్శకుడు సహృదయుడుగా వుండాలి. మన అలంకార శాస్త్రం సహృదయుడు లక్షణాలను ఈ క్రింది విధంగా పేర్కొంది.
(కొనసాగింపు)

నాటక ప్రదర్శన - విమర్శ 2

(కొనసాగింపు)

విమర్శ అనేది అర్థవంతంగాను, సహేతుకంగా ప్రయోజనవంతంగాను ుండాలి. అడ్డదిడ్డంగా మాట్లాడేసమయంలో తాను చెప్పిందే సరైనదని నొక్కి వక్కాణించటం కాదు. విమర్శించబడిన, విశ్లేషించబడిన ప్రదర్శన మున్ముందు ప్రజాదరణకు దూరమయ్యే అవకాశం వుందని ప్రొఫెసర్ గ్రెగరీ ఎం.కోనీయా అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రొఫెసర్ జి.యస్.ప్రసాదరెడ్డి మాట్లాడుతూ... నాటక ప్రదర్శన విమర్శకు సంబంధించిన ప్రామాణికత విషయాల్లో ఏఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో అన్న ప్రస్తావనకు వస్తే ముందుగా రచనను పరిశీలించి, విశ్లేషించాలి. అంటే ఆ రచనలోని కథాంశం, సన్నివేశాలు, పాత్ర చిత్రణ, సంభాషణలను, కథనాన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చర్చించాలి. అంతేగాక ఆ రచన ప్రయోజనం ఏంటి అనే అంశాన్ని గమనంలోకి తీసుకోవాలి. తదుపరి అంశం అభినయం.. నటులు రచన ఉద్దేశ్యం, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అభినయిస్తున్నారా? పాత్రల్లా ప్రవర్తిస్తున్నారా? ఆయా పాత్రల ప్రయోజనం సాధించటంలో సఫలీకృతులవుతున్నారా? పాత్రల మధ్య సమన్వయాన్ని సాధిస్తున్నారా? లేదా.. అనే అంశాలను పరిగణించాలి. తదుపరి అంశం.. దర్శకత్వం.. నాటక ప్రదర్శనకు సంబంధించిన అన్ని అంశాలను సమస్థాయిలో సమ తూకంలో ఉండేలా శ్రద్ధ వహించాడా లేదా..? పాత్రలతాలూకు స్వరూప, స్వభావాలను వెలికి తీయటంలో సఫలీకృతుడయ్యాడా లేదా..? రంగస్థల ప్రదర్శనకు సంబంధించిన అన్ని సాంకేతికాంశాలను సరియైన రీతిలో వినియోగించి ప్రదర్శన విజయానికి దోహదం చేశాడా లేదా? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొంటూ, సాహితీ ప్రక్రియ అయిన రచనకు ప్రదర్శనా విలువల్ని సంతరించటంలో దోహదపడ్డాయా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించాలి. ఇక సాంకేతిక విలువలు ప్రదర్శన విజయవంతం కావటానికి ఏమేరకు దోహదపడ్డాయో లేదో అనే అంశాన్ని వివరంగా సమీక్షించాలి.

వీటన్నింటినీ విడివిడిగా పరిశీలించి, సమీక్షించుకుంటూ ఒక అంశానికి మరొకటి ఏవిధంగా దోహదపడిందీ, లేనిదీ పరిశీలిచబడాలి. ఇంతటి వివరాల ద్వారా సమీక్ష జరిపితే అది సద్విమర్శక దోహదపడుతుంది. అంతేకానీ, బావుందీ అని చెప్పటం లేదా బాగాలేదు అని అనటం విమర్శ కిందకు రాదు.. కేవలం అభిప్రాంగానే పరిగణింపబడుతుంది.

నిజానికి ఇటీవలి కాలంలో చాలామంది నాటక న్యాయనిర్ణేతలు ప్రైజులు ఇచ్చే క్రమంలో ఆయా సమాజాలవారు ప్రశ్నిస్తే వారు చెప్పే సమాధానం నాకు నచ్చలేదు అందుకే ప్రైజు ఇవ్వలేదు.. అని.. అదేంమాటయ్యా అని అడిగితే.. మీరు నాటకం జనంకోసం ఆడుతున్నారా? ప్రైజులకోసం ఆడుతున్నారా..? అంటూ బోడి ప్రశ్న వేస్తారు. నిజానికి పోటీల్లో పాల్గొనే నాటికలు, లేదా నాటకాలు ప్రైజులకోసం కాక జనంకోసం ఆడతారా.? ప్రైజులు ఇవ్వటానికి కాకపోతే గాడిదలు కాయటానికి న్యాయనిర్ణేతలుగా కూర్చోబెడతారా? ప్రదర్శకులు పోటీ ప్రదర్శనల్లో పాల్గొంటారా..? అతి తెలివి తేటలు ఎక్కువైతేనే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి.. నిజానికి జనంకోసం నాటకం ఆడే వేదికలు వేరే వుంటాయి. పోటీ వేదికలపై పోటీలే జరుగుతాయి. అప్పుడే ప్రశ్నిస్తారు. ఈమాత్రం కూడా తెలియకుండా చచ్చుప్రశ్నలేస్తారు ఎందుకో...
(కొనసాగింపు)

16, నవంబర్ 2019, శనివారం

నాటక ప్రదర్శన - విమర్శ 1

నాటకం ప్రదర్శన

సాహిత్య ప్రక్రియలన్నింటిలో ‘నాటక’ ప్రక్రియకు ప్రత్యేకమైన స్థానం వుంది. అందుకే కాళిదాస మహాకవి ‘‘కావ్యేషు నాటకం రమ్యం’’ అన్నారు. అక్షరసత్యములైన ఆ మాటలు అందరికీ అనుభవ పూర్వకములే. ఎన్నో సాహిత్య ప్రక్రియలు కేవలం చదవటానికి మాత్రమే ఉపయోగపడుతుంటే నాటకం మాత్రం అలాకాదు. ఇటు చదవటానికీ, అటు చూడటానికీ, వినటానికీ, ప్రదర్శించటానికీ నోచుకున్న ఏకైక ప్రక్రియ. ఇక్కడ మనం ఒక విషయాన్ని ప్రస్థావించాలి. సాహిత్య ప్రక్రియలన్నింటిలో నాటకానికి ప్రత్యేకమైన స్థానమున్నా.. చదివిటప్పుడు ఎంతో అద్భుతంగా అనిపించినా, ప్రదర్శనకు నోచుకున్న సమయంలో మాత్రమే ప్రత్యేక స్థానం సంతరించుకుంటుంది, తద్వారానే ప్రజాదరణ పొందుతుంది. ఆ విధంగా సాహిత్య ప్రక్రియకు ప్రత్యేక స్థానం లభిస్తుంది. అలా ప్రదర్శనకు నోచుకోకుండా, ప్రజాదరణ పొందకుండా ఉంటే మిగిలిన సాహిత్య ప్రక్రియల మాదిరిగానే, కేవలం పాఠకుల చేతిలో హస్తభూషణంగా మిగిలిపోయి వుండేది ఈ నాటకం కూడా. 

విమర్శ

సాహిత్య ప్రక్రియల్లో ఒక్క నాటకం తప్ప మిగిలిన అన్ని ప్రక్రియలను చదవటం ద్వారా మాత్రమే విశ్లేషణ చేయటం జరుగుతుంది. కానీ, నాటకం అలా కాదు. ఇటు సాహిత్య పరంగానూ, అటు ప్రదర్శనా పరంగానూ విశ్లేషణకు వేదికైంది. అంటే రచయిత సృష్టించిన అక్షరాలకు దృశ్యరూపం పొంది, జీవం పోసుకుంటుంది. పుటల్లో అక్షరాలతో నిండిన ఓ ఘనపదార్థం సజీవ పాత్ర చిత్రణ ద్వారా సరికొత్త రూపు సంతరించుకుంటుంది. అంటే నాటక విమర్శ ‘పుస్తక’ విమర్శ, ‘ప్రదర్శన’ విమర్శ అనే రెండు రకాలుగా నిక్షిప్తమై ఉంది. రచనాపరంగా చూస్తే, భాష, సంభాషణలు, శైలి, కథ, కథనం రచయిత ప్రతిభను చాటుతుంటే, నాటకీకరణ, అభినయం,ఆహార్యం, రంగాలంకరణ, విద్యుద్దీపనం, సంగీతం, గమనం, ఉద్వేగ స్థితిగతులు, రంగస్థల విన్యాసాలు, రంగస్థల వ్యాపారం తద్వారా కళాశాలతో కళాకారుల ప్రతిభను సామూహిక ప్రయత్నంతో ప్రదర్శనా పూర్వక ప్రతిభను చాటుతాయి. కుక ఇక్కడ సాహిత్యపరమైన, ప్రదర్శనా పరమైన విశ్లేషతోపాటు ప్రశంస, విమర్శ అవసరమౌతాయి. సూక్ష్మంగా చెప్పాలంటే ఒక నాటకం ఇటు పఠనా పరంగానూ, అటు ప్రదర్శనా పరంగానూ బాగుందంటే ఎందుకు బాగుందో చెప్పగలగాలి లేదా బాగాలేదంటే ఎందుకు బాగాలేదో కారణాలు విశదీకరించగలగాలి. దీనినే విమర్శ అంటారు..

ఈ విమర్శే కనుక లేకపోతే ఏ కళారూపంలో అయినా పరిపూర్ణత సాధించటం సాధ్యమవ్వదు. అయితే ఎటువంటి విమర్శలు అవసరం? అసలు విమర్శకులకు ఉండాల్సిన లక్షణాలేంటి అనే అంశంపై నాకు తెలిసిన కొందరు నాటకరంగ పెద్దలు వారివారి అనుభవాలను నాకు వివరించారు. నేను వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

ముందుగా విమర్శ ప్రాధాన్యతను వివరిస్తూ.. ప్రొఫెసర్ జి.యస్.ప్రసాదరెడ్డిగారు ఇలా అన్నారు.. 
అసలీ విమర్శ అంటే ఏంటి? ఇది అవసరమా? అయితే, గియితే ఎంతవరకూ? ఏమేరకు? దీన్ని ఎవరు చేస్తారు? వారి అర్హత ేంటి? ఒకవేళ చేసినా ఎవరు స్వీకరిస్తారు? స్వీకరిస్తే అనుసరిస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభిస్తే విమర్శ ఆవశ్యకత విశదపడుతుంది.

నాటక ప్రదర్శన ప్రధానం వినోదాన్ని కలిగించటం.. అయితే హాయిగా వినోదించక, ఈ విమర్శ ఏంటి? విమర్శ రచనపైనా, నటులపైనా? దర్శకుడిపైనా? ఇతర సాంకేతిక అంశాలపైనా? లేదా ప్రేక్షకులపైనా లేక వీటన్నిటిపైనా? అసలు విమర్శకు ప్రామాణికం ఏంటి? ఇవన్నీ తెలిస్తే, విమర్శించటం సులువే అవుతుంది. అయితే ఎవరు విమర్శించాలి? సాధారణ ప్రదర్శన అయితే ప్రేక్షకులు.. పోటీ ప్రదర్శనలు అయితే న్యాయనిర్ణేతలు. ఈ రెండు విభాగాల్లో ఈ రెండు వర్గాలు తమతమ అభిప్రాయాలను విమర్శ పేరుతో వెలిబుస్తే అది పూర్తి విమర్శ అవుతుందా? అయినట్లుగా లెక్కలేమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నలకు సమాధానం పూర్తిగా దొరకటం కష్టం.

ఏది ఏమైనా విమర్శను నిర్వచించాలీ అంటే సూక్ష్మంగా ప్రదర్శన తాలూకు మంచి, చెడుల వివ్లేషణ అని చెప్పుకోవచ్చు. ప్రదర్శనకు సంబంధఇంచిన ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, మంచి, చెడులను ఎటువంటి పక్షపాత ధోరణితో గాకుండా, పారదర్శకంగా విశ్లేషించగలిగిన, అనుభవంతో కూడిన, అధ్యయనం చేసిన వారెవరైనా విమర్శ చేయటానికి అర్హులే.. నలుగురు కలిస్తే నాటకం, నలుగురి కోసం ప్రదర్శన.. కనుక పదిమందీ మెచ్చేలా, నచ్చేలా ఉండేదే ఉత్తమ ప్రదర్శన అని చెప్పుకోవచ్చు. ఈ మెచ్చటం, నచ్చటం అనే అంశాలు ఆ ప్రదర్శనకు సంబంధించిన అన్ని అంశాలపై ఆధారపడి ఉండాలి.   (కొనసాగింపు)

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవం 2021

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా నవంబరు నెలలో నిర్వహించటం జరిగింది. 2021 నవం...

ప్రఖ్యాతిగాంచిన పోస్టులు