రంగస్థల నగ్నచిత్రం 2.10

రంగస్థల నగ్నచిత్రం 2.10
(కొనసాగింపు)
రంగస్థల నగ్నచిత్రం 2.9 మీద కొంతమంది రకరకాలుగా స్పందించారు. కొంతమంది పర్సనల్ గా వాట్సప్ మెసేజీలు పెట్టారు. కొంతమంది ఫోనుల ద్వారా స్పందించారు. రంగస్థల నగ్నచిత్రాన్ని విశేషంగా ఆదరిస్తున్న అశేష పాఠకులకు నా వందనాలు. నిన్న కొన్ని నా వ్యక్తిగత కారణాల వల్ల నేను రంగస్థల నగ్నచిత్రాన్ని అప్ లోడ్ చెయ్యలేక పోయాను. కానీ ఈసారి ఇలా జరగకుండా నేను తగిన జాగ్రత్తలు తీసుకుంటాను. ఇక విషయంలోకి వెళదాం.. 

:: నాటకవ్యాపారం :: 

కొన్ని కంపెనీలు తమ ప్రొడక్టుకి ఎక్కవ డిమాండ్ వున్నదన్నట్లుగా ఫాల్స్ పబ్లిసిటీ చేస్తుంటాయి. ఉదాహరణకు టీవీల్లో లైవ్ షోలు వంటివి నిర్వహిస్తుంటారు. వారు చెబుతుంటారు... కేవలం కొన్ని వస్తువులు మాత్రమే తమ వద్ద వున్నాయని ఫోన్ చేసి బుక్ చేసుకోవాలని, టీ.వీలో క్రింద స్క్రోల్ అవుతున్న నెంబరుకు ఫోన్ చేయండి అని తొందర చేసేస్తుంటారు. ఆ తొందర ఎలా వుంటుందంటే మనింట్లో ఆ వస్తువులేక పోతే జీవితంలో చాలా కోల్పోతామని, అసలు బ్రతకటం కూడా దండగే అన్నట్లుగా చెబుతారు. అదే సమయంలో వస్తువులు కూడా ఆన్ లైన్ లో బుకింగులు కూడా జరుగుతున్నట్లుగా మనని హిప్నొటైజ్ చేస్తూ మార్కెటింగ్ ట్రిక్ ని ప్లే చేస్తారు. అవే వస్తువులు కాసేపున్నాక, లేదా మరుసటి రోజో, ఒక వారం తర్వాతో మనకి ప్రకటనల రూపంలో దర్శనమిస్తుంటాయి. ఇలాంటి కంపెనీలు ఎంతకాలం నిలబడతాయో అందరికీ తెలిసిందే.. ప్రొడక్టులకైతే వారంటీ వుండదు కానీ, ప్రొడక్టులను పబ్లిసిటీ చేసే కంపెనీలకు మాత్రం గ్యారంటీ వుంటుంది. ఇదే ఫార్ములాని కొన్ని పెద్దపెద్ద డ్రామా కంపెనీ వీళ్ళు ఫాలో అవుతారు. 

నేను 2.7 లో పేర్కొన్న పాయింట్ ‘‘స్క్రూటినీలో నాటికలను సెలక్ట్ చేసుకునే దిశలో కొంతమంది జడ్జీలను ఆకర్షించటానికి తమవారిని, తమవారి వారిని అవసరమైతే వాహనాల్లో రవాణాచేసి, నాటకి ప్రదర్శన సమయంలో చపట్లు, ఈలలు, గోలలు చేయించి తమ నాటిక ప్రేక్షకాదరణ పొందిందన్నట్లుగా, అలాంటి నాటికను సెలక్ట్ చెయ్యక పోతే జడ్జిలకు ఏమీతెలీదని, పరిషత్ వారు ఏదో కోల్పోతారనీ,  అప్రదిష్టపాలవుతారన్నట్లుగా సైకలాజికల్ బ్లాక్ మేల్ చేయటం వంటి చర్యలకు పూనుకుంటున్నారు. ఇలా చేయటంలో కొంతమంది ప్రాధమిక పరిశీలకులు వారి ప్రలోభంలో పడిపోతూ ఆ నాటికను సెలక్టు చేసుకుంటూ దానిని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇది పబ్లిసిటీ స్టంట్ లో గత కొంతకాలంగా కొన్ని నాటకసమాజాలకు చెల్లుతూ వస్తోంది. ఇది ఎలా వుంటుందంటే రాజకీయ నాయకుల ఉపన్యాసాలకు జనసమీకరణ చేసినట్లు అన్నమాట’’ వర్తిస్తుంది. 

వీరి ప్రొడక్ట్ ని మార్కెటింగ్ చేసుకునే విషయంలో ఇటువంటి పబ్లిసిటీలు ఇచ్చుకునే ఆయా డ్రామా కంపెనీలు ఒక్కోసారి వెంటనే ఫలితాలు పొందుతాయి.. ఒక్కోసారి ఆశించిన ఫలితాలు పొందలేక నష్టపోతాయి. అయినా వీరు నిరాశ చెందరు. ప్రొడక్టు మారినప్పుడల్లా తమతమ వాక్ఛాతుర్యంతో జనాన్ని, జడ్జీలను ఆకర్షిస్తారు. తెలివైన జడ్జీలు జరుగుతున్న విషయాన్ని గమనించి పబ్లిసిటీ మాయలో పడరు. వీరి మాయని గుర్తించని వారైతే వెంటనే ప్రొడక్టుని కొనుక్కుంటారు. అంటే అలాంటి వాటికి ప్రదర్శనావకాశం కల్పిస్తారన్నమాట.

ప్రొడక్టుని కొనుగోలు చేసి, మార్కెటింగ్ చేసే డీలర్ పాయింట్లు (నాటకపరిషత్తులు), మార్కెటింగ్ ఏజెంట్లను (స్క్రూటినీ జడ్జీలు లేదా పరిషత్తులకి నాటకాలు రిఫర్ చేసే రిఫరేలు) కంపెనీల ప్రధాన టార్గెట్లు. కంపెనీ ప్రొడక్టుని మార్కెటింగ్ చేసే విషయంలో ఏజెంట్లకు ఎలాంటి పారితోషకాలిస్తారో.. అటువంటివే కొన్ని కొన్ని గిఫ్టులు కూడా ఇక్కడ వుంటాయి. ఏజెంట్లకి కంపెనీలు ప్రోత్సాహకాలిచ్చి ఎలా ఎంకరేజ్ చేస్తారో ఇక్కడ కూడా డ్రామా కంపెనీ ఏజెంట్లకి ఒక్కో ఏజెంట్ వ్యక్తిత్వాన్నిబట్టీ లేదా వారి కోరికలను బట్టీ ప్రోత్సాహకాలుంటాయి. ఉదాహరణకి కొంతమంది ఏజెంట్లకి పట్టు చీరలు, కందిపప్పు, మినపపప్పు ఇలాంటివి కిలోలకు కిలోలు అలాగే మరికొంతమంది ఏజెంట్లు చుక్క, ముక్క, పక్క వంటివి కోరితే వారికి ఆయా కంపెనీలు ఆఫర్ చేసి తృప్తి పరుస్తాయి. ఈ విషయం గోపరాజు విజయ్ గారు,  కీర్తిశేషులు కరణం సురేష్ గారు గత సంవత్సరం ఎవికెఫౌండేషన్ వారు నిర్వహించిన ప్రాధమిక పరిశీలనలో ఎదుర్కొన్నట్లుగా స్వయంగా గ్రంథస్థం చేయటంతోపాటు వేదికపై నొక్కి వక్కాణించారు. తమని అలాంటి విషయాలు ప్రలోభాలకు గురిచేయలేదని వారి పారదర్శక న్యాయనిర్ణయాన్ని చాటుకునే సందర్భంలో పేర్కొన్నారు. 

రంగస్థల నగ్నచిత్రం 1వ సెషన్ చివరి భాగాల్లో ఈ అంశాన్ని నేను ప్రస్థావించటం కూడా జరిగింది. వారిని సంప్రదిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఏజెంట్లను శాటిస్ఫై చేసే నాటక కంపెనీలు (సమాజాలు) ఏవేవి? వారికి ఎదురైన సంఘటనలు ఏవి అనే అంశాలు స్వయంగా వారిద్వారానే వెలుగులోకి వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక మంచి నాటకం ప్రోత్సహించబడాలి.. ఒక చెడ్డనాటకాన్ని నిర్మూలించాలి.. అనే నినాదంతో నాటకరంగ న్యాయనిర్ణేతలు వ్యవహరిస్తే తెలుగు నాటకరంగం మూడుపువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. ఏజెంట్లు ఇలాంటి ప్రలోభాలకు లొంగితే తెలుగునాటకరంగం మరింతగా పతనావస్తకు చేరుకొని ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నాటకమనే కళారూపం వుండేదని భవిష్యత్తరాలు పుస్తకాల్లోనూ, పేపర్ ఆర్టికల్స్ లోనూ చదువుకోవాల్సి వచ్చే ప్రమాదముంది. కీ.శే. కరణం సురేష్ గారిని ఎలాగూ మనం ఏమీ అడగలేము కనుక గోపరాజు విజయ్ గారన్నా అలాంటి వారి పేర్లు చెప్పి, తెలుగు నాటకరంగం నుంచి అలాంటి కలుపు మొక్కలను ఏరిపారేసేందుకు ఆయత్తమై, వారు, మనం ఎంతగానో ప్రేమించే నాటకరంగాన్ని శుభ్రపరచాలని కోరుకుంటున్నాను.
(కొనసాగింపు వుంది)

కామెంట్‌లు లేవు:

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవం 2021

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా నవంబరు నెలలో నిర్వహించటం జరిగింది. 2021 నవం...

ప్రఖ్యాతిగాంచిన పోస్టులు