మునిపల్లె నాటక పరిషత్ ప్రథమ నాటకోత్సవాలు
మునిపల్లె నాటకపరిషత్ నాటకోత్సవాలు 2020 మార్చి 11 మరియు 12 తేదీల్లో గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య వేదికపై ఐదునాటికలు ఎంపికచేసి ప్రదర్శించటం జరిగింది. ఈ సాయిరాఘవ మూవీమేకర్స్ మునిపల్లె నాటక పరిషత్ ప్రారంభించటానికి, నిర్వహించాలన్న ఆలోచన రావటానికి అంకురార్పణ చేసిన వ్యక్తులు వరుసగా డాక్టర్ జి.యస్.ప్రసాదరెడ్డి గారు, డి.రామకోటేశ్వరరావుగారు, కొల్లి మోహనరావుగారు, మానాపురం సత్యనారాయణగారు. నాటక పరిషత్ నిర్వహణ విషయంలో నేను వీరి ద్వారా అనేక సలహాలు, సంప్రదింపులు పొందాను. వీరిచ్చిన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని పరిషత్ నిర్వహించాలని అనుకున్నాను. కానీ నిర్వహించగలనా అన్న సంశయంతో దాదాపు సంవత్సర కాలం గడిపేశాను. నామీద నాకు నమ్మకంలేకే ఇంత సమయం వృధా చేసుకున్నాను. ఒకదశలో ఏదైతే అదైంది.. ప్రయత్నం చేద్దాం అని ఒక మొండిధైర్యం చేశాను. అనుకున్నదే తడవుగా ఈ విషయాన్ని మా అన్నగారు చెరుకూరి సాంబశివరావు గారితో పంచుకున్నాను. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. వేదిక విషయమై నేను వేంకటేశ్వరస్వామి దేవాలయం, అన్నమయ్య కళావేదికను అనుకున్నాను. అక్కడ వేదిక దొరకటం చాలా అరుదైన విషయం. చాలా ముందుగా డేట్స్ బుక్ చేసుకోవాలి అని చెరుకూరి సాంబశివరావుగారు సూచించారు. అలాగే నా గురువుగారు నాయుడు గోపి గారు కూడా అదేమాట అన్నారు. అవసరమైతే ఆలయ నిర్వాహకులతో మాట్లాడతాను అని కూడా చెప్పారు. నేను తప్పకుండా మీ సహాయం పొందుతాను గురువుగారూ అన్నాను.
ఆ తర్వాత నేను 2019 నవంబరు నెలలో ఆలయ కమిటీ వారికి లెటర్ అప్లై చేశాను. అయితే ఏవో కారణాలవల్ల వారినుంచి నాకు స్పందన రాలేదు. వారి నుంచి స్పందన వస్తుందిలే అని ఎదురు చూశాను. అయితే చెరుకూరి సాంబశివరావు అన్నగారు ఒకరోజు అడిగారు ఏం విద్యాధర్ పరిషత్ పనులు ఎంతవరకూ వచ్చాయి.. నేను విషయం చెప్పాను. అలా కాదు... నాతోరా.. అని ఆయనే దగ్గరుండి నన్ను దేవాలయ కమిటీ వారిదగ్గరకు తీసుకెళ్ళారు. నేను ఏ రోజు వారికి లెటర్ పెట్టిందీ చెప్పాను. వారు ఆ లెటర్ తీసుకొని చూశారు. అయితే మూడు నెలల వరకూ డేట్స్ లేవని చెప్పారు. సాంబశివరావు అన్నగారు వారిని వదలలేదు. మొత్తానికి ఎలాగోలా నాకోసం 2020 మార్చి నెలలో 11,12 కేటాయించారు. ఏం విద్యాధర్ హ్యాపీనా అన్నారు సాంబశివరావు అన్నగారు. నేను చాలా హ్యాపీ అన్నా అన్నాను. కానీ అసలు టెన్షన్ అప్పుడే మొదలైంది. నా పరిషత్ నిర్వహణకి చందాలు సేకరించాలి. ఎవరిని అడగాలి..? ఎక్కడ అడగాలో నాకు తెలీదు. అప్పటికీ నాకు తెలిసిన నట మిత్రులనీ, పరిషత్ నిర్వాహకులనీ అడిగాను. వారు కొంత సానుకూలంగా స్పందించారు. వారి వారి శక్తి కొలదీ అమౌంట్ పంపించారు. నా బంధువులనీ అడిగాను. వారు కూడా వారికి తోచింది పంపించారు. అయితే ఎంత అమౌంట్ వచ్చినా కూడా పరిషత్ నిర్వహణకు సరిపోదు. అదే సమయంలో నేను కెరటాలు నాటిక ప్రదర్శనలద్వారా పోగైన అమౌంట్ కొంత వుంది. ఆ అమౌంట్ ని కూడా ఇందులో వాడేందుకు సిద్ధమయ్యాను. నా పరిషత్ కి మొత్తం నేనే అయిపోయాను. నా పక్కన నిలబడటానికి పనులు అందుకోవటానికి మనుషులు లేకుండా పోయారు. అదే సమయంలో నేనున్నాను అంటూ నా మిత్రుడు మధు ముందుకొచ్చాడు. మొదటి రోజు కార్యక్రమాల నిర్వహణ అతనికి అప్పగించాను. రెండో రోజు నేను చూసుకున్నాను. వేదికపై బాధ్యత ఎవరు స్వీకరించాలి? అన్న అంశంలో ముందునుంచీ వున్న చెరుకూరి సాంబశివరావు అన్నగారిని అడిగాను. అయితే ఆయన కొత్తగా సినిమా ఓపెన్ అయిందనీ.. తాను దర్శకత్వ బాధ్యతలు చేపట్టాననీ కుదరటంలేదన్నారు. వెంటనే నేను నా మిత్రుడు బసవరాజు జయశంకర్ ని అడిగాను. ఆయన కాశీకి వెళ్ళేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నానని తన అశక్తత తెలియజేశారు. ఎవరు వేదిక మీద కార్యక్రమాలు నిర్వహించాలి అనే అంశంలో నాకు పెద్ద సమస్య ఎదురైంది. అయితే బసవరాజు జయశంకర్ దైవిక ఘటన వల్లనో మరే ఇతర కారణాల వల్లనో ఆయన కాశీ ప్రయాణం ఆగిపోయింది. వెంటనే ఆయన రంగంలోకి దిగారు. ఇక వేదికపై కార్యక్రమనిర్వహణకి పెద్దగా ఆలోచించాల్సిన అవసరంలేకుండా పోయింది. లైటింగ్ పనులు ఎవరికి అప్పగించాలి అనే అంశంలో నేను మొదటి నుంచి చాలా క్లారిటీగా వున్నాను. నా మిత్రుడు రాజారత్నంని అభ్యర్ధించాను. వెంటనే డేట్స్ రాసుకున్నాడు. మైక్ విషయంలో దేవాలయం వారే ఇచ్చారు. ఇక స్టేజీ కర్టెన్లు, డెకరేషన్లు వంటివి ఎక్కడ నుంచి తీసుకురావాలి అనే విషయంలో నాకు మరో ప్రశ్న.. అదే సమయంలో నా మిత్రుడు మధు తన దగ్గరున్నవి ఇచ్చాడు. నా మిత్రుడు పరమేష్ ని రంగాలంకరణ చేయాల్సిందిగా కోరాను. ఆయా నాటక సమాజాల వారికి మేకప్ బాధ్యతలు కూడా అతనికి సూచించాను. అతను కూడా సానుకూలంగా స్పందించాడు.
ఇక్కడికి పరిషత్ నిర్వహణలో ఎవరి బాధ్యతలు వారు పూర్తిగా స్వీకరించారు. ఇక వచ్చిన నాటక సమాజసభ్యులకీ వసతి, భోజనం ఏర్పాట్లు ఈ విషయంలో నాకు రకరకాల ఆలోచనలున్నాయి. ఈ విషయం నా గురువుగారు నాయుడు గోపి గారు నాతో బృందావన్ గార్డెన్స్ లోని ఒక హోటల్ చెప్పారు. అక్కడ భోజనం రుచిగా వుందని చెప్పారు. వెంటనే అక్కడికి నా మిత్రుడు మధుతో చేరుకున్నాను. మధు తుళ్ళరు కళాపరిషత్ నిర్వహిస్తున్న అనుభవం వుంది. అందుకే అతన్ని తీసుకెళ్ళాను. అతను టిఫిన్, భోజనం రేట్లు మాట్లాడాడు. నేను అడ్వాన్స్ ఇచ్చేశాను. ఇక అన్నిటికన్నా ముఖ్యమైంది నాటక సమాజ నిర్వాహకులకి షీల్డులు బహూకరణ, ఆడపడచు సత్కారం.. షీల్డుల విషయంలో ఎక్కడ దొరుకుతాయో చెరుకూరి సాంబశివరావు అన్నగారి సలహా తీసుకొని అక్కడికి వెళ్ళి షీల్డులు ఆర్డర్ ఇచ్చాను. ఆడపడచు సత్కారం విషయంలో నా చెల్లెళ్ళు అమృతవర్షిణి, లహరిలు ముందుకొచ్చారు. వారు స్పాన్సర్ చేశారు. ఇలా నేను ఒక్కడినే అనుకున్న సమయంలో మేమంతా నీకున్నాం.. నువ్వు కార్యక్రమం మొదలు పెట్టు అంటూ ప్రోత్సహించారు. నన్ను ప్రోత్సహించిన వారిని ఈ తరుణంలో తలచుకోవటం నా ధర్మం, నా బాధ్యత అని నేను అనను.. వారి పట్ల నాకున్న ప్రేమ అనురాగంతో తలచుకుంటున్నాను. నాకు ఆర్థికంగా సాయం చేసిన వారిలో
1. పి.శివప్రసాద్ - విశాఖపట్నం
2. చిట్టి వెంకటరావు - శ్రీకాకుళం
3. రఘు, చెలికాని వెంకటరావు - కొండెవరం
4. మల్లేశ్వరరావు - కావలి
5. మంచాల రమేష్ - కరీంనగర్
6. మునిపల్లె సత్యనారాయణ - హైదరాబాద్
7. ఎం.మధు - తుళ్ళూరు
8. ఎం.రవీంద్ర - చిలకలూరిపేట
9. కె.వి.మంగారావు -చిలకలూరిపేట
10.డాక్టర్ జె.రవీంద్ర - తిరుపతి
11. బసవరాజు జయశంకర్ - గుంటూరు
12. గుడిపాటి యోగీశ్వరరెడ్డి - వీడియో, ఫోటో గుంటూరు
అతిధులను సత్కరించుకునే అవకాశంలో భాగంగా నాటక రంగంలో అవిశ్రాంతంగా పనిచేస్తూ నాటకాన్నే వృత్తిగా స్వీకరించి నాటకరంగంలో అనేక విభాగాల్లో తనదైన ముద్రవేసుకొన్న యువకుడిని గుర్తించి చేసే సత్కారానికి మునిపల్లె నాటకపరిసత్ ‘‘జటాయువు’’ పురస్కారాన్ని అందించింది. అలాగే నాటకరంగాన్ని ప్రవృత్తిగా స్వీకరించి మానవీయ దృక్కోణంతో ముందుకు వెళుతున్న మరో వ్యక్తిని గుర్తించి వారు చేసిన సేవలకు గాను ‘‘రంగస్థల నటసింహం’’ అనే పురస్కారాన్ని కూడా అందించేందుకు నిర్ణయించాను.
11.03.2020 : 1. జటాయువు పురస్కారం 2020 - గోపరాజు విజయ్ - కొలకలూరు
12.03.2020 : 2. రంగస్థల నటసింహం 2020 - డాక్టర్ జలదంకి రవీంద్ర - తిరుపతి
కార్యక్రమాన్ని నిరాటంకంగా నిర్వహించటానికి సహకరించిన మిత్రులకీ, సన్నిహితులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను..
మీ
విద్యాధర్ మునిపల్లె
మునిపల్లె నాటకపరిషత్, గుంటూరు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి