నాటకం ప్రదర్శన
సాహిత్య ప్రక్రియలన్నింటిలో ‘నాటక’ ప్రక్రియకు ప్రత్యేకమైన స్థానం వుంది. అందుకే కాళిదాస మహాకవి ‘‘కావ్యేషు నాటకం రమ్యం’’ అన్నారు. అక్షరసత్యములైన ఆ మాటలు అందరికీ అనుభవ పూర్వకములే. ఎన్నో సాహిత్య ప్రక్రియలు కేవలం చదవటానికి మాత్రమే ఉపయోగపడుతుంటే నాటకం మాత్రం అలాకాదు. ఇటు చదవటానికీ, అటు చూడటానికీ, వినటానికీ, ప్రదర్శించటానికీ నోచుకున్న ఏకైక ప్రక్రియ. ఇక్కడ మనం ఒక విషయాన్ని ప్రస్థావించాలి. సాహిత్య ప్రక్రియలన్నింటిలో నాటకానికి ప్రత్యేకమైన స్థానమున్నా.. చదివిటప్పుడు ఎంతో అద్భుతంగా అనిపించినా, ప్రదర్శనకు నోచుకున్న సమయంలో మాత్రమే ప్రత్యేక స్థానం సంతరించుకుంటుంది, తద్వారానే ప్రజాదరణ పొందుతుంది. ఆ విధంగా సాహిత్య ప్రక్రియకు ప్రత్యేక స్థానం లభిస్తుంది. అలా ప్రదర్శనకు నోచుకోకుండా, ప్రజాదరణ పొందకుండా ఉంటే మిగిలిన సాహిత్య ప్రక్రియల మాదిరిగానే, కేవలం పాఠకుల చేతిలో హస్తభూషణంగా మిగిలిపోయి వుండేది ఈ నాటకం కూడా.
విమర్శ
సాహిత్య ప్రక్రియల్లో ఒక్క నాటకం తప్ప మిగిలిన అన్ని ప్రక్రియలను చదవటం ద్వారా మాత్రమే విశ్లేషణ చేయటం జరుగుతుంది. కానీ, నాటకం అలా కాదు. ఇటు సాహిత్య పరంగానూ, అటు ప్రదర్శనా పరంగానూ విశ్లేషణకు వేదికైంది. అంటే రచయిత సృష్టించిన అక్షరాలకు దృశ్యరూపం పొంది, జీవం పోసుకుంటుంది. పుటల్లో అక్షరాలతో నిండిన ఓ ఘనపదార్థం సజీవ పాత్ర చిత్రణ ద్వారా సరికొత్త రూపు సంతరించుకుంటుంది. అంటే నాటక విమర్శ ‘పుస్తక’ విమర్శ, ‘ప్రదర్శన’ విమర్శ అనే రెండు రకాలుగా నిక్షిప్తమై ఉంది. రచనాపరంగా చూస్తే, భాష, సంభాషణలు, శైలి, కథ, కథనం రచయిత ప్రతిభను చాటుతుంటే, నాటకీకరణ, అభినయం,ఆహార్యం, రంగాలంకరణ, విద్యుద్దీపనం, సంగీతం, గమనం, ఉద్వేగ స్థితిగతులు, రంగస్థల విన్యాసాలు, రంగస్థల వ్యాపారం తద్వారా కళాశాలతో కళాకారుల ప్రతిభను సామూహిక ప్రయత్నంతో ప్రదర్శనా పూర్వక ప్రతిభను చాటుతాయి. కుక ఇక్కడ సాహిత్యపరమైన, ప్రదర్శనా పరమైన విశ్లేషతోపాటు ప్రశంస, విమర్శ అవసరమౌతాయి. సూక్ష్మంగా చెప్పాలంటే ఒక నాటకం ఇటు పఠనా పరంగానూ, అటు ప్రదర్శనా పరంగానూ బాగుందంటే ఎందుకు బాగుందో చెప్పగలగాలి లేదా బాగాలేదంటే ఎందుకు బాగాలేదో కారణాలు విశదీకరించగలగాలి. దీనినే విమర్శ అంటారు..
ఈ విమర్శే కనుక లేకపోతే ఏ కళారూపంలో అయినా పరిపూర్ణత సాధించటం సాధ్యమవ్వదు. అయితే ఎటువంటి విమర్శలు అవసరం? అసలు విమర్శకులకు ఉండాల్సిన లక్షణాలేంటి అనే అంశంపై నాకు తెలిసిన కొందరు నాటకరంగ పెద్దలు వారివారి అనుభవాలను నాకు వివరించారు. నేను వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
ముందుగా విమర్శ ప్రాధాన్యతను వివరిస్తూ.. ప్రొఫెసర్ జి.యస్.ప్రసాదరెడ్డిగారు ఇలా అన్నారు..
అసలీ విమర్శ అంటే ఏంటి? ఇది అవసరమా? అయితే, గియితే ఎంతవరకూ? ఏమేరకు? దీన్ని ఎవరు చేస్తారు? వారి అర్హత ేంటి? ఒకవేళ చేసినా ఎవరు స్వీకరిస్తారు? స్వీకరిస్తే అనుసరిస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభిస్తే విమర్శ ఆవశ్యకత విశదపడుతుంది.
నాటక ప్రదర్శన ప్రధానం వినోదాన్ని కలిగించటం.. అయితే హాయిగా వినోదించక, ఈ విమర్శ ఏంటి? విమర్శ రచనపైనా, నటులపైనా? దర్శకుడిపైనా? ఇతర సాంకేతిక అంశాలపైనా? లేదా ప్రేక్షకులపైనా లేక వీటన్నిటిపైనా? అసలు విమర్శకు ప్రామాణికం ఏంటి? ఇవన్నీ తెలిస్తే, విమర్శించటం సులువే అవుతుంది. అయితే ఎవరు విమర్శించాలి? సాధారణ ప్రదర్శన అయితే ప్రేక్షకులు.. పోటీ ప్రదర్శనలు అయితే న్యాయనిర్ణేతలు. ఈ రెండు విభాగాల్లో ఈ రెండు వర్గాలు తమతమ అభిప్రాయాలను విమర్శ పేరుతో వెలిబుస్తే అది పూర్తి విమర్శ అవుతుందా? అయినట్లుగా లెక్కలేమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నలకు సమాధానం పూర్తిగా దొరకటం కష్టం.
ఏది ఏమైనా విమర్శను నిర్వచించాలీ అంటే సూక్ష్మంగా ప్రదర్శన తాలూకు మంచి, చెడుల వివ్లేషణ అని చెప్పుకోవచ్చు. ప్రదర్శనకు సంబంధఇంచిన ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, మంచి, చెడులను ఎటువంటి పక్షపాత ధోరణితో గాకుండా, పారదర్శకంగా విశ్లేషించగలిగిన, అనుభవంతో కూడిన, అధ్యయనం చేసిన వారెవరైనా విమర్శ చేయటానికి అర్హులే.. నలుగురు కలిస్తే నాటకం, నలుగురి కోసం ప్రదర్శన.. కనుక పదిమందీ మెచ్చేలా, నచ్చేలా ఉండేదే ఉత్తమ ప్రదర్శన అని చెప్పుకోవచ్చు. ఈ మెచ్చటం, నచ్చటం అనే అంశాలు ఆ ప్రదర్శనకు సంబంధించిన అన్ని అంశాలపై ఆధారపడి ఉండాలి. (కొనసాగింపు)