24, నవంబర్ 2019, ఆదివారం

నాటక ప్రదర్శన-విమర్శ 3

(కొనసాగింపు)
గత సంచికలో చెప్పిన దానికి భిన్నంగా వుండేదే ఉత్తమ విమర్శకు దారితీస్తుంది. అలా చేయగలినవాడే ఉత్తమ విమర్శకుడుిగా గుర్తించబడతాడు. ఇక సమాజం సాహిత్యాన్ని ప్రభావితం చేస్తే, సాహిత్యం విమర్శను ప్రేరేపిస్తుంది. అంటే సాహితీ విమర్శచేత ప్రభావితమైన సాహిత్యం - సమాజాన్నీ, సమాజంలోని ఆలోచనాత్మక భావజాలాన్నీ ప్రభావితం చేస్తుంది. అందుచేత సాహితీ విమర్శ అవసరమైంది.. అనివార్యమైంది.. పాఠకులు, సామాజికులు సాహితీ జీవనగమనంలో నిత్యకృత్యమైంది.. ఈ విషయంలో నాటక సాహిత్యానికి ఎక్సెప్షన్ లేదు. సాహితీ ప్రక్రియైనా విశ్లేషణ, ప్రశంస, విమర్శలకు స్థానం కల్పించినప్పుడు మాత్రమే సమాజం ప్రభావితం అవుతుంది. అలా కానట్లయితే, అది ఉత్తమరచనగా కాకుండా ఉత్తరచనగానే మిగిలిపోతుంది. మరి ఇంతగా ప్రభావితం చేసే రచన మౌలికంగా ఏ లక్షణాలను కలిగి వుండాలి?

ప్రఖ్యాత హంగేరియన్ విమర్శకుడు జార్జ్ లూకాచ్ సమాజాన్ని ప్రభావితం చేసే రచనకు ఈ క్రింది లక్షణాలుండి తీరాలన్నారు. 

  1. సంపూర్ణత : రచన విస్తృతంగా ఉండి, జీవన గమనాన్నీ, అనుభవాలనూ పంచుకోవాలి.
  2. సమకాలీనత : రచనలో చోటు చేసుకున్న ప్రాంతకాలాలను ఆ జీవన గమనం ప్రతిబింబించాలి. దేశ కాలాలకు సంబంధించిన సాధరణ, ప్రత్యేక లక్షణాలు ఆ రచనలో గోచరించాలి.
  3. ప్రపంచ చారిత్రక దృశ్యం రచనలోని జీవిత దృశ్యాలకూ, ప్రాపంచిక స్థితిగతులకూ మధ్య వుండే సంబంధం ప్రస్ఫుటం కావాలి లేదా కనీసం సూచించబడాలి.
ఇక నాటక సాహిత్యం అనే మహాసాధనానికి సమాజం, రచయిత, రచన పాఠకుడు అనే నాలుగు స్థంభాలు పరస్పర సంబంధం కలిగి దేనికదే భిన్నంగా కన్పిస్తూ, ఆ భిన్నత్వంలో ఏకత్వానికి దారితీసే అంశాలుగా పరిణమిస్తాయి. వీటి ఆధారంగా నాటక విమర్శను నాలుగు విధాలుగా విభజించవచ్చు.


  1. సమాజ పరమైన విమర్శ : అంటే సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ సమాజాన్ని రచనతో పోలుస్తూ చేసేది.
  2. రచయిత పరమైన విమర్శ : కేవలం రచయితను దృష్టిలో పెట్టుకొని, అతని ధృక్పథంతో చేసేది.
  3. రచనా పరమైనది : రచయిత , సమాజాన్ని వదలి, కేవలం రచనా ధృష్టితో చేసేది.
  4. పాఠక పరమైనది : పై మూడింటినీ కాదని, కేవలం తన దృష్టితో చూసి చేసేది.

మరి నాటక ప్రదర్శన విషయానికొస్తే, పైన చెప్పినంత సులువుకాదు. కారణం ఏమిటంటే పై విషయమంతా వ్యక్తిగతం. ఇక్కడ ఎందరో ప్రేక్షకుల స్పందన, మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. నాటక ప్రదర్శనకు సంబంధించిన విమర్శ, ప్రశంస విశ్లేషణ బాధ్యతాయుతం.. తీక్షణం.. సునిశితం ఎందుకని నాటకం జీవితానికి దర్పణం కాబట్టి, ఇక్కడ నాటక ప్రదర్శన విమర్శ సామాజిక బాధ్యతై కూచుంది. మింగుడు పడని విషయాలను సైతం నిష్కర్షగా, నిష్పాక్షికంగా, నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా కరకుబడని సత్యాలను సైతం విమర్శకుడు వెల్లడించాల్సిన బాధ్యత అతడిపై ఉంది. అసందర్భ వాదనలూ, అర్థం పర్థంలేని సిద్ధాంతాలు, మొండి వాదాల జోలికి పోకుండా విమర్శకు పూనుకొంటే తనను తాను సంస్కరించుకుంటూ ఎదగటమే కాకుండా సమాజాన్ని కూడా సంస్కరించిన వాడౌతాడు. ఇవన్నీ లేకుండా విమర్శకులం అంటూ తమకు తాముగా ఓ పనికిమాలిన ముద్ర వేసుకుంటూ, ఏదో విధంగా పబ్బం గడుపుకుంటూ, ఏకపక్ష పక్షపాత ధోరణులతో ఏవేవో పిచ్చిరాతలు రాసేవారు నా దృష్టిలో సాంస్కృతిక రంగ నిరుద్యోగులు మరియు సాంస్కృతిక వ్యభిచారులు.

అసలు విమర్శకుడంటే ఎవరు? అతనికి ఎలాంటి లక్షణాలుండాలి? ఇప్పుడీ అంశాల్ని పరిశీలిద్దాం
‘నభావ హీనోస్తిరసః’ అన్నాడు నాట్యశాస్త్రంలో భరతుడు. రచనపై ఎటువంటి స్పందనలు లేనివాడు ‘అరసికుడు’ అని దీనర్థం. అంటే అభిరుచి, అభినివేశం, భావోద్రేకాలు ఇటువంటి వేవీ అతనికుండవు. ప్రముఖ ఆంగ్ల విమర్శకుడు ఇటువంటి వాడ్ని ‘ఫిలిస్టర్’అన్నాడు. ఇటువంటి వాడ్ని ఉద్దేశించే ఇంకో విధంగా ‘‘ అరసి కేషు కవిత్వం నివేదనం శిరశి మాలి మాలి మాలిఖ’’

‘‘ రసికత్వం ఆస్వాదించి అనుభవించే గుణం లేని వాడికోసం రచనలు చేసే దురదృష్టాలన్నీ నాకివ్వకు దేవా ’’ అని బ్రహ్మను ప్రార్థించాడు కాళిదాసు.

ఇక రెండవ వర్గాన్ని చూద్దాం.. మీరు.. కొంతమేరకు ఆ సాహితీ ప్రక్రియ చదివేటప్పుడు ఏదో ఒక అనుభవానికి లోను కావచ్చు లేదా అసంతృప్తి చెందవచ్చు. లేదా ఆనందిచచ్చు. కానీ తన స్పందన, ప్రతిస్పందనలకు కారణాలు మాత్రం చెప్పలేడు.

ఇక మూడవ వర్గాన్ని చూస్తే ఆ రచనను చదివి బాగా ఆకళింపు చేసుకొని, స్పందించటమే కాక, ఆ స్పందనకు కారణాలను కూడా శోధించి, తను అనుభవాలను ఇతరులకు పంచుతాడు. ఆ రచనకు మూలాలేంటి? ప్రేరణేంటి? కథను మలచిన తీరు, వర్ణన అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? చివరికి ఏం చెప్పాడు.? ఇత్యాది ప్రశ్నలన్నీ తనకు తానుగా వేసుకుంటూ, సమాధానాలు రాబట్టుకునే ప్రయత్నంలో భాగంగా సంఘర్షణను అనుభవిస్తూ, తన అనుభవాలన్నింటినీ బహిర్గతం చేసి, ఆ రచనకు ఓ రకమైన ్రపజాదరణ కల్పించే ప్రయత్నం చేస్తాడు. ఇటువంటి వాడ్ని ‘విమర్శకుడు’ అనవచ్చు. అయితే విమర్శకుడు సహృదయుడుగా వుండాలి. మన అలంకార శాస్త్రం సహృదయుడు లక్షణాలను ఈ క్రింది విధంగా పేర్కొంది.
(కొనసాగింపు)

కామెంట్‌లు లేవు:

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవం 2021

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా నవంబరు నెలలో నిర్వహించటం జరిగింది. 2021 నవం...

ప్రఖ్యాతిగాంచిన పోస్టులు