17, జనవరి 2017, మంగళవారం

గంగోత్రితో నాయుడు గోపి - విద్యాధర్ మునిపల్లె

గంగోత్రితో నాయుడు గోపి

నాయుడు గోపి నటుడు, దర్శకుడు


జీవితానికి దర్పణం రంగస్థలమనుకుంటే రంగస్థల ప్రదర్శనాస్థలిగా వాసికెక్కి వన్నె తరగని రంగారు బంగారు నందులను మూట కట్టుకొచ్చే మహోన్నత నాటక సంస్థగా గంగోత్రికి ఆంధ్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానముంది. గంగోత్రి సాంస్కృతిక సామాజిక సేవా సంస్థగా పెదకాకానిలో ప్రభవించినా భారత దేశమంతటా దాని రస ఝరులు ఉప్పొంగి ప్రవహిస్తూ దేశపుటెల్లలు దాటి ఖండాంతరాల దాకా పరవళ్ళు తొక్కుతూ గుంటూరూ వారి గొప్పతనాన్ని చాటి చెప్పటం గంగోత్రి వారి విశిష్ఠత. సాంస్కృతిక సామాజిక సేవా సంస్థగా ఉన్న గంగోత్రికి నాయుడు గోపి తండ్రైతే, అక్షరాలా నాటకం తల్లి. ఈ తల్లితండ్రుల పెంపకంలో 2016 నాటికి 26సంవత్సరాలు పూర్తి చేసుకుంది గంగోత్రి నాటక సమాజం. ఈ సందర్భంగా తనను మంచి నటునిగా, దర్శకునిగా రూపుదిద్దిన గురువులను, గంగోత్రి ఎదుగుదలకు రచనలు అందించిన రచయితలను, సహకరించిన సాంకేతిక వర్గాన్ని, నటీనటులను, సలహాలిచ్చి గంగోత్రి అభివృద్ధికి కృషిచేసిన ప్రతి ఒక్కరిని సంస్థ అధినేత శ్రీ నాయుడు గోపి మూడు రోజుల పాటు పెద్ద సభలను నిర్వహించి ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ వారితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని గంగోత్రి ఔన్నత్యాన్ని మరింతగా పెంచారు. 

గంగోత్రి గుండె చప్పుడు

ఒక నాటక సమాజం 26 వసంతాలపాటు నిరాటంకంగా, ఉదృతంగా నాటకాలు ప్రదర్శించాలంటే, ఎన్ని కష్టాలకి, నష్టాలకి, చీదరింపులకు, ఛీత్కారాలకి, అలుగుళ్ళకి, నీలుగుళ్ళకి, బ్రతిమలాటలకు బలికావాలో వాటన్నిటినీ తట్టుకోవటానికి ఆ సమాజ నిర్వాహకునికి, ఎంత ఓర్పుకావాలో, నేర్పు కావాలో.... భావితరం వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ గంగోత్రి గుండె చప్పుడు. ఈ 26సంవత్సరాల గంగోత్రి ప్రవాహంలో కొట్టుకొచ్చిన, ముళ్ళు, పొదలు, రాళ్ళు, రప్పలు, రత్నాలుగా ఎలా మారాయో వివరించే ప్రయత్నమే ఈ వ్యాసం. ఇందులో గంగోత్రి సమాజం ఆవిర్భావానికి కారకులు నాయుడు గోపి. గంగోత్రిని నడిపించిన రథ సారధి నాయుడు గోపి. ఇది ఎవరు అవునన్నా, కాదన్నా నిజం. అలాంటి రధ సారధి ప్రయాణించిన మార్గం అంత సులభతరమేం కాదు. ఎన్నో గతుకులు, ముళ్ళ దారుల్లో తన గంగోత్రి తేరుని నడిపించాల్సి వచ్చింది. తేరు దారి తప్పకుండా ఓర్పు, నేర్పు, సహనం, సౌశీల్యం, చిరునవ్వు అనే ఐదు గుర్రాలు కట్టిన గంగోత్రిని నడిపించి విజయాలు సాధించారు. అయినా ఏనాడూ గర్వంతో విర్రవీగలేదు. తను ఎక్కడనుండి మొదలయ్యారో  ఎప్పుడూ మననంలో వుంచుకుంటారు శ్రీ నాయుడు గోపి. 

గంగోత్రి ఆవిర్భావం

ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత శ్రీ.కె.యస్‌.టి.శాయి గారి దగ్గర నటనలో ఓనమాలు దిద్దారు నాయుడు గోపి. ఆ తర్వాత 1980లో 'శాస్త్రీయం'- గుంటూరు, 'స్పందన' - ఒంగోలు, 'వేమన ఆర్ట్స్‌' గుంటూరు  మొదలైన నాటక సమాజాలలో ఎన్నో వేషాలు వేస్తూ నటినిగా ఒక్కో మెట్టు ఎక్కారు నాయుడు గోపి. తను దర్శకునిగా ఎదుగుదలకి ముఖ్యకారణం జి.యస్‌.ఆర్‌.కె.శాస్త్రి అయితే నటునిగా తనకో గుర్తింపు రావటానికి తోడ్పడిన వాడు వేముల మోహనరావు. 1989 వరకు రంగస్థలంపై నిరాటకంగా  నటిస్తున్న సమయంలో తను నటిస్తున్న సమాజాల్లోని నటులు సినిమాల్లో అవకాశాలకోసం వెళ్ళిపోతున్న తరుణంలో నాటక ప్రదర్శనలు కుంటు పడ్డాయి.  దీంతో దాదాపు సంవత్సరంపాటు ఏకాకిగా వుండిపోయారు. మిత్రులతో కొత్తసమాజం ప్రారంభించాలనే ఊగిసలాటలో పాటిబండ్ల ఆనందరావు అనే రచయిత రచించిన  సినిమాను చూడటానికి నాయుడుగోపి, రజతమూర్తిలు మద్రాసు వెళ్ళటం జరిగింది. ఆనందరావుని కలిసి  కొత్తసమాజం ఆలోచన గురించి వివరించటం జరిగింది. రజతమూర్తితో కలిసి నాయుడుగోపి నాటకం ప్రదర్శించేట్లయితే నాటకం ఇస్తానన్న కండిషన్‌తో రాసిందే ''మానస సరోవరం'' నాటకం. నాటకం అద్భుతంగా రచన సాగింది. దీనికి ఒక మంచి దర్శకుడిని వెతుక్కోవాలి, ప్రదర్శనలివ్వాలనే ఆలోచించారు కానీ, తనలోని దర్శకుని అప్పటికీ గుర్తించలేదు. దర్శకుని పిలిపించుకునే ఆర్థిక స్తోమత లేని కారణంగా 1990 జనవరి మొదటివారంలో నాటకసమాజానికి ఒక పేరు నిర్ణయించే క్రమంలో ఎంతోమంది ఎన్నో పేర్లు చెప్పినా  చివరికి ఆనంద్‌ అనే ఒక మిత్రుని సలహా ప్రకారం ''గంగోత్రి'' అనే పేరును నాయుడుగోపితోపాటు సమాజ సభ్యులందరూ ఆమోదించారు. సిహెచ్‌ రజితమూర్తి, పెండెం కోటేశ్వరరావు, బి.బాబూరావు, పి.సాంబిరెడ్డి, పి.నాగిరెడ్డి, డి. నాగేశ్వరరావు, శ్రీమతి యస్‌. లక్ష్మిల బలవంతంతో ఆయనే దర్శకునిగా మారటం జరిగింది.

మానస సరోవరం నాటకంతో దర్శకునిగా మారిన నాయుడుగోపి తొలి ప్రదర్శన తన సమాజం ద్వారా 1990 ఏప్రిల్‌ 9న వెనిగండ్ల గ్రామంలో ఇచ్చారు. ఆ ఊరిలో మేనరికపు పెళ్ళిళ్ళు ఎక్కువ. ఆ పెళ్ళిళ్ళతో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులకు గురయ్యేవారు. వాళ్ళంతా మానససరోవరం నాటకం చూసి మేనరికపు పెళ్ళిళ్ళకు స్వస్థిచెప్పారంటే అది అతిశయోక్తికాదు. నాటకం తీసుకొని పరిషత్తులకు వెళ్ళిన గోపికి ఎనిమిదిచోట్ల తెల్లకాగితం ఎదురైంది. తోటి మిత్రులంతా నాటకం ఆపేద్దామన్నారు. ''కొత్త సమాజం పెట్టుకున్నారు నష్టపోవద్దంటూ'' సన్నిహితులు హెచ్చరించారు. ''నూటికి నూటపదిమంది మెచ్చే నాటకం రాస్తానంటూ '' రచయిత ఆనందరావు హామీఇచ్చాడు. గోపిలో గందరగోళం. అయినా ఎక్కడో ఈ నాటకంమీద ఆశ. మరో ప్రయత్నం చేశారు. అంతే నాటకం ఆడినచోటల్లా బహుమతులతోపాటు, విశేష ప్రజాదరణ పొందింది. ఆ రకంగా ''గంగోత్రి'' మొదటి నాటకం విజయవంతమైంది.

అటుపై ''కాదుసుమాకల'' నాటకం రాసి పాటిబండ్ల ఆనందరావు రాసివ్వటం, దానిని తీసుకొని మళ్ళీ రాష్ట్రంలో ఉన్న పరిషత్తులకు గోపి బయల్దేరటం జరిగింది. ఆనందరావు అన్నట్లు నూటికి నూటపదిమంది మెచ్చే నాటకాన్నే నాయుడుగోపికి అందించి మాట నిలుపుకున్నారు. ఆతర్వాత మళ్ళీ ఆనందరావుని నాటకం అడిగిన వెంటనే ఎప్పుడో ఇచ్చిన నీతిచంద్రిక నాటకం ఆడుకొమ్మన్నారు. ఆతర్వాత మళ్ళీ ఆనందరావు గంగోత్రితో నాటకం చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా నాటక పరిషత్తులో విస్తృతంగా నాటికల పోటీలు జరుగుతుండటంతో నాటికలు కూడా చేయాలన్న తలంపు గోపికి కలిగింది. కొత్తనాటికలు రాసేవారు దొరకని కారణంగా ఆనందరావు రాసిన పాత నాటిక ''దర్పణం'' ప్రదర్శించారు. కానీ పాత నాటికంటూ దానిని పరిషత్తులు తోసిపారేశాయి. దాంతో మాడభూషి దివాకర్‌బాబు రచించిన ''దహతిమమ మానసం'' ప్రదర్శించారు. ఇదీ పాతదేనంటూ పరిషత్తులు పోటీలనుంచి తొలగించటం జరిగింది. ఆతర్వాత హైదరాబాద్‌కు చెందిన వంశీనిరంజన్‌ కళాకేంద్రం ''నవ్వండీ ఇది విషాదం'' నాటిక విజయవాడలో ప్రదర్శిస్తుండగా చూసిన గోపి ఆ నాటికను ఎలాగైనా ఒకసారి ప్రదర్శించాలని ఉత్సాహపడ్డారు. వెంటనే రచయిత పంతం సత్యనాథన్‌ని కలిసి తన కోరిక వెల్లడించగా.. శివరామకృష్ణయ్యకు చెప్పి ప్రదర్శించుకోమన్నారు. శివరామకృష్ణయ్య కూడా సుముఖత వ్యక్తంచేయగా.. దానిని దాదాపు 50 ప్రదర్శనలకు పైనే విజయవంతంగా ప్రదర్శించారు నాయుడు గోపి. అటుపై యద్భవిష్యం, శ్వేతపత్రం, లజ్జ, శ్రీముఖ వ్యాఘ్రం, శ్రీచక్రం, హింసధ్వని, భూమిపుత్రుడు, పడమటిగాలి, వానప్రస్థం, ఎడారికోయిల, ఓనమాలు, భారతరత్న, ఆంబోతు వంటి సాంఘిక నాటికలు, నాటకాలే కాక, పల్నాటిభారతం, హంసగీతం, శ్రీవేమన వంటి పద్యనాటకాలకు కూడా దర్శకత్వం వహించారు. 

యువకులను నాటకరంగంలోకి ఆహ్వానిస్తూ వారిని ప్రోత్సహించే దిశగా విద్యాధర్‌ మునిపల్లె  (నన్ను) అనే 29 సంవత్సరాల యువకుడు రాసి తీసుకు వచ్చిన గమనం నాటికను రాష్ట్రంలో అనేక చోట్ల ప్రదర్శించి అతనికి రచయితగా ఒక స్థానాన్ని కల్పించారు. వెంటనే విద్యాధర్‌ మునిపల్లె రాసిన శ్రీగురురాఘవేంద్రచరితం పద్యనాటకాన్ని అనేక చోట్ల ప్రదర్శించి కాంస్యనందిని సాధించేలా తీర్చిదిద్దారు నాయుడు గోపి. అటుపై గంగోత్రి 25 సంవత్సరాల వేడుకల్లో అప్పటివరకూ గంగోత్రికి సేవలందించి, విజయానికి కారకులైన ప్రతి ఒక్కరినీ సత్కరించుకోవటం నాయుడు గోపి యొక్క సహృదయతకి, నాటకం పట్ల ఆయనకున్న మక్కువకూ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 

చివరిగా .... 

ఒక రైతు పొలంలో విత్తనాలు చల్లి వ్యవసాయం చేసి పంటను పండిస్తే, నాయుడు గోపి రంగస్థలమనే పొలంలో నాటకాలనే విత్తనాలు వేసి ఉన్నతమైన భావాలనే నీటితో కళాకారుల నటననే ఎరువులుగా వేసి నాటకరంగంపై నటసుగంధాలను వెదజల్లిన కృషీవలుడు. ఇతని కృషి ఫలితంగానే ఎంతో మంది ఈయన వద్ద నటన, దర్శకత్వం నేర్చుకొని వేరే సమాజాలు ఏర్పాటు చేసుకొని ఈ నాడు నాటకరంగంలో తమదైన శైలిలో చెరగని ముద్ర వేసుకున్నారు. కొత్త తరాన్ని తీసుకు వస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా నాటకంలో నవ్యత, నాణ్యతలకు ఏమాత్రం తగ్గకుండా ఇప్పటికీ యువకులతో ఉత్సాహంగా పరుగులు తీస్తున్న ఈ నటకృషీవలుని పాదములకు నమస్కరిస్తూ మరికొన్ని ఆణిముత్యాలను నాటకరంగానికి అందించాల్సిందిగా వేడుకుంటోంది తెలుగునాటకరంగం.

16, జనవరి 2017, సోమవారం

మంచాల రమేష్‌, కరీంనగర్‌ జిల్లా నటుడు, దర్శకుడు

మంచాల రమేష్‌, కరీంనగర్‌ జిల్లా నటుడు, దర్శకుడు
--------------------

న‌టుడు, ద‌ర్శ‌కుడు - మంచాల ర‌మేష్‌, క‌రీంన‌గ‌ర్
మంచాల రమేష్‌ స్వస్థలం వంగర. రామచంద్రం, కనకలక్ష్మి దంపతులకు 1970 ఆగష్టు 22న జన్మించారు. 1980 సంవత్సరంలో 'బడిపంతులు' నాటకం ద్వారా బాలనటునిగా 10 సంవత్సరాల వయసులో ప్రప్రథమంగా రంగప్రవేశం చేశారు. నాటక రంగంలో నటునిగా, దర్శకునిగా చైతన్యకళాభారతి కార్యదర్శిగా వివిధ బాధ్యతలు చేపట్టి నేడు కరీంనగర్‌ రంగస్థల కళాకారునిగా తన జిల్లాకు ఎనలేని ఖ్యాతి సంపాదించి పెట్టారు.

వృత్తిరిత్యా కరీంనగర్‌ జిల్లాలో విద్యుత్‌శాఖ ఇ.ఆర్‌.ఓ రూరల్‌ విభాగంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రవృత్తిరిత్యా నాటకరంగాన్ని ఎంచుకుని ఇరు తెలుగు రాష్ట్రాలలో వివిధ వేదికలపై నాటికలను ప్రదర్శిస్తూ తన జిల్లాకు ఎనలేని గౌరవాన్ని సంపాదించి పెడుతున్నారు. 

ఇప్పటి వరకూ రమేష్‌ ప్రదర్శించిన నాటకాలు :
--------------------------------------
బడిపంతులు, సంసారంలో సరాగాలు, ప్రేమగోల నాటకాలలో బాలనటునిగా గుర్తింపు పొందారు.

చదవా : అనే నాటిక ద్వారా ప్రభుత్వం నిర్వహించిన అక్షర ఉజ్వల కార్యక్రమంలో జిల్లా అంతట 180 ప్రదర్శనలు నిర్వహించారు.

బంగారు గుడ్లు : నాటిక ద్వారా ప్రభుత్వం నిర్వహించిన సారా నిషేధం కార్యక్రమంలో కరీంనగర్‌ జిల్లా అంతటా 35 ప్రదర్శనలు నిర్వహించారు. 

నాకు ఇల్లొచ్చింది : నాటిక ద్వారా గృహ నిర్మాణ సంస్థ తరఫున జిల్లా అంతటా 26 ప్రదర్శనలు నిర్వహించి తనదైన సామాజిక బాధ్యతను పోషించారు. 

అటుపై కేవలం జిల్లాకి మాత్రమే కాక తెలుగు రాష్ట్రమంతా కూడా తనవంతు సామాజిక కార్యకలాపాలను విస్తరించి తనదైన బాధ్యతను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు మంచాల రమేష్‌. 

2002 నందినాటకోత్సవాలలో భాగంగా తన సమాజంతో ''సతిన్మ'' అనే నాటికను ప్రదర్శించి నటునిగా నంది అవార్డుని గెలుచుకున్నారు. రాష్ట్రంలో పలు ప్రదర్శనలు ఇచ్చి తన నాటిక ద్వారా, నటన ద్వారా ప్రేక్షకులను సమస్యపట్ల ఆలోచింపచేశారు. 

2006లో ''ప్రేమ ఈక్వల్ట్‌'' నాటికను నిజామాబాద్‌లో నిర్వహించిన నంది నాటకోత్సవాలలో ప్రదర్శించారు. 

2010లో నంద్యాలలో ఏర్పాటు చేసిన నంది నాటకోత్సవాలలో ''చెల్లనిపైసలు'' నాటికతో తనలోని దర్శకుని బయటకు తీసి కాంస్యనందిని సాధించారు రమేష్‌. ఈ నాటికద్వారా వృద్ధాప్యం మనిషికి శాపం కాదంటూ, ప్రతి ఒక్కరూ రేపటి వృద్ధులేనని, వృద్ధాప్యాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరంటూ వృద్ధులను అలక్ష్యం చేసేవారిపట్ల తనదైన శైలిలో దర్శకత్వ కొరడా ఝుళిపించారు. దీంతో నాటికకు అఖిలాంధ్ర ప్రేక్షకులు రమేష్‌కు బ్రహ్మరథం పట్టారు. వృద్ధులు రమేష్‌ని మనసారా ఆశీర్వదించారు. ఇరు తెలుగు రాష్ట్రాలలో 30 ప్రదర్శనలిచ్చిన ఈ నాటికకు 25 ఉత్తమ ప్రదర్శన బహుమతులు పొందటం జరిగింది. 

అటుపై 2013 సంవత్సరం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన నంది నాటకోత్సవాలలో ''దొంగలు'' నాటికకు దర్శకత్వం వహించి ప్రదర్శించారు. ఈ నాటికద్వారా తల్లితండ్రుల్ని వృద్ధాప్యంలో చూడకుండా ఆస్థికోసం కాపుకాసే బిడ్డలు బిడ్డలు కారని, వారు తల్లితండ్రుల కష్టాలను దోచేసే దొంగలని గర్జించారు. ఈ నాటికకు కూడా ఆంధ్రరాష్ట్రం బ్రహ్మరథం పట్టింది. ఈ దొంగలు నాటిక ప్రదర్శించిన రమేష్‌ ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దొంగిలించాడనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇరు తెలుగు రాష్ట్రాలలో 80 ప్రదర్శనలకు గాను 70 ఉత్తమ ప్రదర్శనలు, 25 ఉత్తమ దర్శకత్వం అవార్డులు, 40 ఉత్తమ నటుని అవార్డులు పొందారు.

ప్రస్తుతం రమేష్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న నాటిక ''ఈలెక్క ఇంతే''. ఇరు తెలుగు రాష్ట్రాలలో 35 ప్రదర్శనలిచ్చి 10 ఉత్తమ ప్రదర్శనలు, 12 ఉత్తమ నటుడు, 6 ఉత్తమ దర్శకత్వ బహుమతులు సాధించారు.

ఇవి కాక ఇంకా....

మనిషి, ఆడది, ఈతరం మారాలి, పామరులు, నిరసన, ఆకలివేట, కాలచక్రం, విధాత, నేనుపట్నం పోతనే, ప్రేమపిచ్చోళ్ళు, ఇతిహాసం, క్షతగాత్రుడు, ఆశాపాశం, నగరం ప్రశాంతంగా ఉంది, లాలలీల, క్లిక్‌, పెన్‌కౌంటర్‌, గర్భగుడి, మార్గదర్శి, సన్మతి, చెల్లనిపైసలు, ఎవరో ఒకరు, గారడి వంటి నాటికల ద్వారా విభిన్న పాత్రలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో నిర్వహించిన ఎన్నో పరిషత్‌ పోటీనాటికలలో సుమారు 340 ప్రదర్శనలు ఇచ్చి ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ దర్శకుడు వంటి అవార్డులు దాదాపు 40కి పైమాటే. 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగ చరిత్రలో ఈయన ద్వారా చెల్లనిపైసలు, దొంగలు నాటికలకు ఇంత ఖ్యాతి దక్కింది అనటంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. నాలుగు సార్లు నంది నాటకోత్సవాలలో జిల్లా తరఫున పాల్గొన్న ఏకైక నాటక సమాజం ఇదే కావటం చెప్పుకోదగిన విషయం. 

సన్మానాలు, సత్కారాలు
-------------------------------
ఫోక్‌ ఆర్ట్‌ అకాడమీ, కరీంనగర్‌ వారిచే గ్రామీణ కళాజ్యోతి అవార్డు, తుమ్మల రంగస్థల పురస్కారం వారిచే సత్కారం, చైతన్యకళాభారతి, కరీంనగర్‌ వారిచే ఉత్తమ రంగస్థల నటనా పురస్కారం, చెల్లనిపైసలు నాటికకు దర్శకత్వం వహించి, నటించి నందినాటకోత్సవాలలో తృతీయ బహుమతి పొందినందుకు రసరమ్య కళారంజని, నల్గొండవారిచే సన్మానం, కళాజగతి, నాటకరంగ పత్రిక వారిచే విశాఖ పట్నంలో కళాశ్రేష్ఠ బిరుదుసత్కారం, జిల్లా కళాకారుల సమాఖ్య వారిచే సత్కారం. మానవత కల్చరల్‌ అకాడమి వారిచే సత్కారం పొందారు.

మంచాల రమేష్‌ ఇంత సాధించటానికి కారణం తనను తీర్చిదిద్దిన గురువు శ్రీరాములు సత్యనారాయణ, బండారి దేవరాజ్‌లు కారణమైతే, తననే నమ్మి తనవెంట వుండి నడిపించే కళాకారులు, దర్శకులు, రచయితలు కూడా అని సవినయంగా సమాధానం చెప్పటం అతనిలోని నిగర్వతను చాటిచెబుతుంది. నిత్య తన వెంట వుండి నడిపించే గద్దె ఉదయ్‌కుమార్‌, అల్లకొండ కిషన్‌రెడ్డి, తిప్పర్తి ప్రభాకర్‌, కె.సత్యనారాయణ, వడ్నాల కిషన్‌, రంగు వెంకటనారాయణ, రచయిత శివరామ్‌ తనకు ప్రదర్శనలప్పుడు సెలవలు మంజూరు చేసే అధికారులు, సహకరించే విద్యుత్‌ ఉద్యోగులు లేకపోతే తను లేనని సమాధానం ఇచ్చారు రమేష్‌. ఎన్ని జన్మలెత్తినా కూడా వీళ్ళ ఋణం తీర్చుకోలేనంటూ తన సహృదయాన్ని చాటుకున్నారు రమేష్‌. 

చివరిగా...
-----------
ప్రజలను చైతన్యపరచటానికి ఎన్నో కళారూపాలున్నాయి. అందులో ఓ భాగమే నాటకరంగం. ప్రధానంగా కళలకి, ప్రజలకి విడదీయరాని బంధం ఉంది. కళలు అనేది ప్రజాజీవితంలో భాగమైపోయింది. దానికి ఉదాహరణ ఒక గద్దర్‌, ఒక వంగపండు, ఒక మిద్దె రాములు, ఒక శబ్దర్‌ హస్మి వీళ్ళే తనకు స్ఫూర్తి అని రమేష్‌ అన్నారు. 

30 సంవత్సరాల నుండి నాటకరంగానికి తన వంతు కృషి చేస్తూ నూతన కళాకారులను ప్రోత్సహిస్తూ, సంప్రదాయ నాటకాలను నూతన పద్ధతులలో ప్రయోగించటం, కళారూపాల ద్వారా సమాజంలో పేరుకుపోతున్న సామాజిక సమస్యలను, రుగ్మతలను ప్రజల దృష్టికి తెచ్చి చైతన్య పరుస్తూ వారికి స్ఫూర్తి, సామాజిక స్పృహ కల్పించటమే తన జీవితాశయంగా చెప్పారు. ఎన్ని అవార్డులు సాధించినా తన నాటకాల ద్వారా ప్రజలని చైతన్య పరచనప్పుడు తను నాటకాలు ప్రదర్శించటంలో అర్థమే లేదని వివరించారు. సత్యహరిశ్చంద్ర నాటకం చూసి జీవితంలో అబద్ధం చెప్పకూడదని స్ఫూర్తి చెంది మన దేశానికే స్వాతంత్య్రం తెచ్చిన ఓ మామూలు మనిషి మహాత్ముడైన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తూ నాటకం ద్వారా కనీసం నలుగురిలోనైనా మారాలనే ఆలోచన తెప్పిస్తే చాలంటూ ఇంటర్వ్యూని ముగించారు రమేష్‌.

మంచాల రమేష్‌ మరిన్ని నాటకాలను ప్రదర్శించాలని, ప్రజల్ని ఆలోచింపచేయాలని ఆకాంక్షిస్తూ మరో అతిధితో మళ్ళీ మీ ముందుకు వస్తుంది... తెలుగునాటకరంగం

15, జనవరి 2017, ఆదివారం

మేకప్‌ - కళామిత్ర 'అడవి శంకరరావు' హైదరాబాద్‌

మేకప్‌

- కళామిత్ర 'అడవి శంకరరావు' హైదరాబాద్‌
9440944545

1.మేకప్‌ అంటే ఏమిటి?
మేకప్‌ : అద్దళము (కోటింగ్‌), ముఖపత్రరచన, ముఖాంగరచన, రూపాలంకరణ ఆహార్యం.
ఆహార్యం : కళాకారుడికి మేకప్‌ వేసిన తరువాత శిరోజాలంకరణ, మేకప్‌ ఆర్టిస్ట్‌ సూచించిన కరెక్ట్‌ కలర్‌ కాంబినేషన్‌తో ఉన్న దుస్తులు ధరించటం, మొత్తం ఆపాదమస్తకరూపాన్నీ కలిపి ''ఆహార్యం'' అంటారు.

2. అసలు మేకప్‌ ఎందుకు?
చర్మం మీద పడే కాంతిని పీల్చుకునే గుణం కలిగి ఉంటుంది. కాంతిలేని కళాకారుడి ముఖ కవళికలు (ఎక్స్‌ప్రెషన్స్‌) ప్రదర్శించినా, అప్పుడు వ్యక్తమయ్యే అవకాశం ఉండదు. అందుకని ఎక్స్‌ప్రెషన్స్‌ని ప్రేక్షకుడి కంటిదాకా చేరేందుకుగాను ఆర్టిస్ట్‌ ఫేస్‌కి తప్పనిసరిగా మేకప్‌ అవసరం. ఇది నిజం. మేకప్‌ లేకుండా నాటకం వేస్తే, ఎంత లైటింగ్‌ ఉన్నా కూడా కళాకారుడు తన భావాన్ని ప్రేక్షకుడికి అందించలేడు. మేకప్‌కి లైటింగ్‌ ప్రాణం. మేకప్‌ ఆర్టిస్ట్‌ ప్రతి నాటక ప్రదర్శనకి ముందుగా స్టేజికి ఏర్పాటు చేసిన లైటింగ్‌ విధానాన్ని పరిశీలించాలి. జనరల్‌ (బ్రైట్‌) లైట్స్‌ ఎన్ని, ఏఏ ఏంగిల్స్‌లో వున్నాయి. ఫుట్‌లైట్స్‌ ఎన్ని, టాప్‌లైట్స్‌ ఎన్ని, జనరల్‌ లైట్స్‌ ఆర్టిస్ట్‌ ఫేస్‌ మీద ఎన్ని పడుతున్నాయి. కలర్‌ లైట్స్‌ ఎన్ని, ఏఏ రకాలు (బ్లూ, గ్రీన్‌, రెడ్‌, యెల్లో) ఎన్ని వున్నాయి అని తప్పనిసరిగా పరిశీలించాలి. ముందుగా ఏర్పాటు చేసిన లైట్స్‌ సరియైన ఏంగిల్‌లో వుండి కాంతిని ప్రసరిస్తున్నాయా లేదా అని చూసి, ప్రదర్శన సమయంలోనైనా సరిదిద్దుకోవచ్చు.

3. మేకప్‌ రూం ఎలా వుండాలి?
మేకప్‌ చేసే ముందు మేకప్‌ గది (గ్రీన్‌రూం)లో ఆర్టిస్ట్‌ ఫేస్‌ మీద కరెక్ట్‌ లైటింగ్‌ విధానంలో ఫేస్‌ మీద మూడువైపులా సరిసమానంగా లైటింగ్‌ పడే విధానం ఉండాలి. మేకప్‌రూంలో మేకప్‌కి 100 క్యాండిల్‌గానీ 200 క్యాండిల్‌ బల్బులుగానీ వుండాలి. హాలోజన్‌ లైటిగ్‌ పెట్టడం వ‌ల‌న చెమట ఎక్కువగా పట్టే అవకాశం వుంటుంది. మేకప్‌గదిలో ట్యూబ్‌లైట్‌ అస్సలు పనికిరాదు. మేకప్‌ వీధి ప్రదర్శనలకి ఎక్కువగా వుండాలి. స్టేజీలైటింగ్‌కి తగ్గట్టుగా స్టేజీ మేకప్‌ ఉండాలి. నాటక ప్రదర్శన అనేది రాత్రివేళ 9 గంటల ముందా? లేక 9 గంటల తరువాతా? అనేది కూడా గుర్తుంచుకుని మేకప్‌ చేయాలి. ఎందువలన అంటే రాత్రివేళ 9 గంటలలోపు ఇళ్ళల్లో, షాపుల్లో కరెంటు వాడకం ఎక్కువగా వుండటం వలన స్టేజీకి కరెంటు, ఓల్టేజీ సప్లై తక్కువగా వుండవచ్చు. రాత్రి 9 గంటల తరువాత వాటి వాడకం తగ్గటం వలన స్టేజీపై కాంతి పెరగవచ్చు. విద్యుత్‌ కాంతి ఎక్కువ, తక్కుగా ప్రసారమవటం వలన మేకప్‌ ఆర్టిస్ట్‌ వేసిన మేకప్‌లో కాంతి ఎక్కువగా, తక్కువగా కనపడవచ్చు. అది గమనించాలి.

4. మేకప్‌ ఎప్పుడూ ఒకే రకంగా వుండాలా? ఏమైనా మార్పులు అవసరమా?
మేకప్‌ ఎప్పుడూ ఒకేరకంగా వుండకూడదు. మార్పులకు అనుగుణంగా జాగ్రత్తగా చేస్తుండాలి. అంటే శీతాకాలంలో మేకప్‌ చేస్తే బాగా వుంటుంది. హాయిగా వుంటుంది. ఆర్టిస్ట్‌కీ, మేకప్‌ ఆర్టిస్ట్‌కీ పెద్దగా శ్రమవుండదు. వానాకాలంలో కూడా దాదాపు అంతే, అయితే వేసవి కాలంలోనే తంటా అంతా, ఇక్కడే వుంటుంది. ఏప్రిల్‌, మే నెలల్లో ఎండలు, ఉష్ణోగ్రత ఎక్కువ. అనెలల్లో వచ్చే కార్తెల ప్రభావం వలన మనిషి శ‌రీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. చర్మం మీద వుండే అసంఖ్యాక స్వేదగ్రంథులు, పెద్దవిగా వ్యాకోచించటం వలన చెమట ఎక్కువగా వస్తుంది. చెమట ఎక్కువగా రావటం వలన ముఖంమీద కారటం వలన ఆర్టిస్ట్‌కి చీదర, చిరాకు కలిగి నటనపై ఏకాగ్రత తప్పే ప్రమాదం వుంది. నాటకంలో నటించే కళాకారుల ముఖం ఎప్పుడూ చక్కగా వుండాలి. మేకప్‌ చేసిన మేకప్‌ ఆర్టిస్ట్‌లు ప్రతిసారీ కళాకారులందరికీ చెమట తుడవటం కుదరకపోవచ్చు. ఏ ఆర్టిస్ట్‌కి ఆ ఆర్టిస్టే ఒక తెల్లని, గ్లాస్కో క్లాత్‌ని తడిపి, పిండి రుమాలుగా మడతపెట్టి చెమట పీల్చేటట్లుగా జాగ్రత్తగా అద్దుకోవాలి. ముఖంమీద రుద్దకోకూడదు. చెమట ఎక్కువగా నుదురుమీద, రెండు కణతల క్రింద, చెవుల ముందు భాగంలోనూ, ముక్కు క్రింద భాగం, చుబుకం మీద, గడ్డం క్రింద, కంఠం మీద పడుతుంది. లైట్‌ వెలుతురులో అద్దం చూసుకుంటూ తడిపిన టచప్‌ క్లాత్‌తో చెమట పట్టిన భాగాన్ని మెత్తగా, సున్నితంగా చేసిన మేకప్‌ పాడవకుండా,బొట్లు వగైరాలు పోకుండా అద్దుకోవాలి. సీన్‌లోకి వెళ్ళేముందు, వెళ్ళి వచ్చిన తరువాత అలా చెయ్యాలి. తరువాత ఫేస్‌ని చల్లగాలికి ఫ్యాన్‌ ముందు వుంచాలి. చక్కగా ఆరుతుంది. వేసిన షర్ట్స్‌ వగైరా ఆరేటట్లు ఫ్యాన్‌కి శరీరం ముందువైపు, వీపు వైపు వుచితే తడిసిన డ్రస్‌లు ఆరుతాయి. కొంతమంది ఆరిస్టులకయితే తలమీద, జుట్టుకిందవైపు నుంచి కూడా విపరీతంగా చెమట కారుతుంది. అందుకే మేకప్‌ చేసే చోట తప్పనిసరిగా శబ్దం తక్కువగావచ్చే టేబుల్‌ ఫ్యాన్‌గానీ, పెడస్టల్‌ ఫ్యాన్‌గానీ వుంచాలి. మేకప్‌ రూమ్‌లోగానీ, హాల్లో కానీ ఆరుబయట ప్రదేశంలోగానీ, మేకప్‌ చేసేచోట ఆర్టిస్ట్‌ ఫేస్‌మీద చేసిన మేకప్‌ కలర్‌ త్వరగా ఆరటం కోసం ఒక టేబుల్‌ ఫ్యాన్‌గానీ, పెడస్టల్‌ ఫ్యాన్‌గానీ తప్పనిసరిగా వుంచాలి. మేకప్‌ ముందు, మేకప్‌ చేసిన తర్వాత, సహనటీనటులందరికో మరొక ఫ్యాన్‌ వుండాలి. మేకప్‌ చేయించుకునే ముందు తప్పనసిరగా చల్లని నీళ్ళతో మురికి బాగా నిమ్మకలిపిన సెఓప్‌తో పోయేటట్లుగా ముఖంమీద, మెడకిందా, మెడవెనుక, చెవుల వెనుక భాగాన శుభ్రంగా రెండుసార్లు కడుక్కుని మేకప్‌ చేయించుకోవటం చాలా మంచిది.

5. మేకప్‌ ఎలా చెయ్యాలి?
నాటకంలో పాత్ర ధరించే పాత్రధారి ఎత్తుగా వేసుకున్న 3లేక 4 కుర్చీల ఎత్తులో కూర్చుంటే మేకప్‌ ఆర్టిస్ట్‌కి సౌకర్యవంతంగా వుంటుంది. ఎందుకంటే మేకప్‌ చేసే మేకప్‌ ఆర్టిస్ట్‌కి ఎత్తు తక్కువ అయితే ఎక్కువసార్లు వంగి వంగి లేవటం వలన నడుం నొప్పి వచ్చే పరిస్థితి వుంది. అందుకని మేకప్‌ ఆర్టిస్ట్‌ ఎక్కువగా వంగి లేవక నిటారుగా నిలబడి వుండి మేకప్‌ చేస్తే బావుంటుంది. ఫ్యాన్‌గాలి ఆర్టిస్ట్‌ ముఖంమీదకి వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. బల్బుల కాంతి ముఖంమీద సరిగా పడేలా చూసుకోవాలి. అప్పుడు మేకప్‌ ప్రారంభించాలి. ముందుగా కళాకారుల మోకాళ్ళపై నుంచీ కంఠం వరకూ క్లాత్‌ని వేసి వుంచాలి. ముఖం శుభ్రంగా తుడిచి పాత్రది చిన్న వయసా, పెద్ద వయసా అని తెలుసుకుని ఫౌండేషన్‌ లైటా, డార్కా అని నిర్ణయించాలి. కలర్‌ మిక్సింగ్స్‌లో సమపాళ్ళలో ముఖంపై అప్లై చేయాలి. జిడ్డుని పీల్చే గుణం వున్న పౌడర్‌ ముఖంమీద పఫ్‌తో అప్లై చేసి, కొద్దిసేపు ఆగి తడి స్పాంజ్‌తో పౌడర్‌ పోయేటట్లుగా రెండు సార్లు తుడవాలి. పాత్రకి తగిన ఛాయ ఉన్న ''ప్యాన్‌కేక్‌'' నెంబరుని ఎంచుకుని మంచి స్పాజ్‌తో అప్లైచేసి, నీళ్ళతో కొద్దిగా తడిపిన స్పాంజ్‌తో సమంగా, మరకలు లేకుండా సరిచేయాలి. ముక్కు, సన్నంగా కనబడేలా చేయటానికి, ముక్కుకు రెండువైపులా డార్క్‌ ఇచ్చిన తరువాత, ముక్కుదూలంమీద మధ్యలో లైట్‌గా బుగ్గమీద వున్నంత కలర్‌ షేడ్‌ని పొడవుగా కిందికి స్పాంజ్‌తో లాగాలి. ముఖంమీద 'ప్యాన్‌కేక్‌' సమంగా వున్న తరువాత బ్లాక్‌ ఐబ్రో పెన్సిల్‌తో కనుబొమ్మలు, చెవులు పట్టీలు, మీసాలు దగ్గర బ్లాక్‌ కలర్‌తో సరిచేసుకోవాలి. కంటి కింద లైట్‌గా ఒక లైన్‌ షేడ్‌ ఇవ్వాలి. అలా చేస్తే స్కిన్‌టోన్‌ నుంచి ఐబాల్‌ బయటకి వచ్చే సౌలభ్యం వుంది. చివరల పెదవులపైన లేత వయసు పాత్ర అయితే లైట్‌ షేడ్‌ లిప్‌స్టిక్‌, పెద్ద వయసు పాత్ర అయితే డార్క్‌షేడ్‌ వున్న లిప్‌స్టిక్స్‌ ఇవ్వాలి. మేకప్‌ చేసే కార్యక్రమంలో భాగంగా మెడ ముందు, మెడ వెనుక, చేతులకు, వేళ్ళకు కూడా తప్పనిసరిగా మేకప్‌ చేయాలి. మనిషి ముకంలో కళ్ళు, ముక్కు, పెదవులకు వున్నంత  ప్రాధాన్యత, చెవులకు వుండదు. అందువలన వాటికి సాధారణ మేకప్‌ సరిపోతుంది.

6. ఒకే వయసులో వున్న పాత్రలకు మేకప్‌ ఎలా చేయాలి?
ఉదాహరణకి బాగా ఆరోగ్యవంతుడు, ధనవంతుడు అయిన సుమారు 60 సంవత్సరముల పాత్రకి, చక్కని శరీర ధారుడ్యం వున్న పాత్రదారి ముఖంలో ఆరోగ్యంగా, ఆనందంగా వుండేలా మంచి బ్రైట్‌ 'ప్యాన్‌కేక్‌'తో చెయ్యాలి. తలకి సన్నగా హెయిర్‌ వైట్‌నర్‌ స్ట్రోక్‌ ఒకటి ఇవ్వాలి. ఆకారానికి తగిన మీసం, మెడలో బంగారు గొలుసు, చెవులకి ఆభరణాలు అలంకరిస్తే బావుంటుంది. అలాగే 60 యేళ్ళ మధ్యతరగతి తండ్రి పాత్రకి కుటుంబపరమైన సమస్యల వలయంలో చిక్కుకున్న వాని పాత్ర రూపకల్పన విధానంలో కళ్ళకింద నల్లచారికలు, వడిలిన పెదవులు, గ్రే మీసం, అవసరమైన గ్రే గడ్డం, గ్రేకలర్‌ తల జుట్టు, దేవునిమీద భారంవేసిన వ్యక్తిగా ఒక బొట్టు, దైన్యం ప్రతిబింబించే విధంగా చేయాలి. అన్ని సంతోషాలకీ దూరమయ్యి, మందుకి దగ్గరయిన 60 ఏళ్ళ ఒక బడుగు జీవి రూపంగా నలిగిపోయిన, మాసిపోయిన దుస్తులు, బక్క చిక్కిన శరీరం, మాసిపోయిన గడ్డం, మీసం, తైలసంస్కారంలేని రంగు మారిన తుప్పతల జుత్తు, లోతుకు పోయిన కళ్ళు, కంటి కింద నల్లచారికలపై తాగినట్లుగా ఎర్రని కళ్ళ గుర్తులు, డల్‌ కలర్‌ మేకప్‌ ఆపాత్రకి న్యాయం చేస్తుంది. ఆ పాత్రలకి ఒకే వయసయినా కూడా ఆర్థిక, ఆరోగ్య, సామాజిక పరిస్థితుల ప్రభావం, వాటిమీద వుండేలాగా మేకప్‌ చేస్తే ప్రేక్షకాదరణ తప్పక లభిస్తుంది. పౌరాణిక నాటకాలు, వీధి భాగవతం, వీధినాటికలు, శాస్త్రీయ నృత్యాలు, సాంఘిక నాటకాలు వుంటాయి. పగటిపూట సూర్యకాంతిలో ప్రదర్శించే వీధి భాగవతం, వీధి నాటికలకు మేకప్‌ జనానికి కనబడే విధంగా వుండాలి. పౌరాణికపాత్రల రూపకల్పనలో సగభాగం దుస్తులు, నగలు, కిరీటాలు ఆయుధాలకు పోతే, మిగతా సగభాగం మేకప్‌దే. పౌరాణిక మేకప్‌ కొద్దిగా మందంగా, అందంగా చెయ్యాలి. దుష్టరాక్షస పాత్రలు, దేవపాత్రలు, సాత్వికపాత్రలు, సాధారణపాత్రలు వుంటాయి. కదా.. పౌరాణిక పాత్రల రూపాల్ని మనమెవరమూ చూడలేదు. కానీ, కవుల వర్ణనను బట్టి, చిత్రకారులు వేసిన కల్పనను బట్టి ఆయా పాత్రలకి రూపకల్పన చేయటం జరుగుతోంది. వేసిన రంగును బట్టి దుస్తులు, నగలు, కిరీటాలు, ఆయుధాలు ఒక వంతయితే, ముఖపత్ర రచన మరొక వంతు. పౌరాణిక నాటకాల్లో డ్రెస్‌, కర్టెన్స్‌, టెక్నీషియన్స్‌ విషయాల్లో కొంత పురోగమించినా కూకర్‌ విషయములో పాత విధానాలు విడనాడి కొంత అభివృద్ధి మెలకువలు పాటిస్తే ఆధునిక సమాజం ఇంకా బావుంటుంది.

7. మేకప్‌, డ్రస్‌, కర్టెన్స్‌, లైటింగ్‌ల మధ్య అవినాభావ సంబంధం ఏమిటి?
సహజంగా మేకప్‌ ఎల్లో, వైట్‌ కలర్స్‌లో బ్రైట్‌గా వుంటుంది. ఆ మేకప్‌ కనపడటం కోసం తగినంత లైటింగ్‌ ఫోకస్‌ పడాలి. మరి ఆ ఆర్టిస్ట్‌ ఫేస్‌ సరిగా కనబడాలంటే బ్యాక్‌ గ్రౌండ్‌ కర్టెన్‌ ప్రపంచమంతా నాటకం కోసం ఎంపిక చేసిన బ్లూ, బ్లూబ్లాక్‌, గ్రీన్‌బ్లాక్‌ కర్టెన్స్‌ తప్పనిసరిగా ఈ రంగు కర్టెన్స్‌నే వాడాలి. వేరే ఏ కలర్‌ కర్టెన్స్‌ వాడినా ఫ్లోరసింట్‌ రంగులు లైటింగ్‌కి డామినేట్‌ అయ్యి ఆర్టిస్ట్‌ ఫేస్‌ క్లియర్‌గా కనబడదు. అనవసరంగా కలర్‌ లైట్స్‌ వాడినా ఆర్టిస్ట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ కనబడవు. కలర్‌ లైట్స్‌ వాడితే స్టేజీమీద డ్రెస్‌, వస్తువులు రంగులు మారి పోతాయి కూడా, లైటింగ్ ఎక్కువగా వుంటే డైరెక్షన్‌, లైట్‌ డ్రెస్‌లు బర్న్‌ అవుతాయి. తప్పనిసరిగా అనగా సఖ్యత, సహృదయత అవసరం. ఎవరు ఎవరు పనిచేసినా... నాటక ప్రదర్శన విజయవంతం అవాలనే ఆశయంతో పనిచేస్తే మంచిది.

విద్యాధ‌ర్ మునిప‌ల్లె - ర‌చ‌న‌లు

స్వరార్ణవం (నాటిక) ఇది కువైట్ తెలుగు అసోసియేషన్ వారు నిర్వహించిన నాటిక రచనల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందింది. ఈ నాటికను ప్రదర్శించ గలిగే నాటక సమాజం నాకింతవరకూ తారసపడలేదు.

దగ్ధగీతం - 2017 జనవరి 5వ తారీఖున అప్పాజోసుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ వారు నిర్వహించిన కథా నాటికల పోటీలకు గాను రచించాను. మూలకథ శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య, దర్శకత్వం నాయుడు గోపి 

పిల్లి పంచాంగం - హాస్య‌నాటిక‌. 
నేనురాసిన తొలి హాస్యనాటిక ఇదే. దీనిని విజయవాడకు చెందిన సుమధుర కళానికేతన్ అనే హాస్య నాటక పరిషత్ వారి పోటీల కోసం రాయటం జరిగింది. దీనిని వారు కారణాంతరాలవల్ల సెలక్టు చెయ్యలేదు. కానీ వేరే సందర్భంలో విజయవాడలోని ఘంటసాల సంగీతకళాశాలలో ఈ నాటికను ప్రదర్శించటం జరిగింది. అక్కడ ఆద్యంతం నవ్వుల పూవులు పూయించింది. అటు తర్వాత దీనిని అనేక ప్రదర్శనలిచ్చి ఇచ్చిన ప్రతి చోట నుంచి ప్రేక్షకుల నవ్వుల కానుకను అందుకున్నాం.. ఈ నాటికకు దర్శకత్వం నాయుడు గోపి వహించగా, సంగీత దర్శకత్వం : టి. సాంబశివరావు అందించారు. ఈ నాటికలో విద్యాధర్ మునిపల్లె, నాయుడు గోపి, బి. బాబూరావులు పాత్రలు పోషించారు.

https://munipallevidyadhar.files.wordpress.com/2014/05/pillipanchangam.pdf

పిల్లి పంచాంగం

‘‘మంచివాడు’’ నాటిక  - ఇది ఆంధ్రప్రదేశ్ నంది నాటకోత్సవాలలో భాగంగా 01.02.2017 సాయంత్రం 07.00 గంటలకు శ్రీ ఆర్ట్స్, కావలి వారిచే గుంటూరులోని శ్రీ వేంక‌టేశ్వ‌ర విజ్ఞాన మందిరంలో ప్రదర్శించబడింది. ఈ నాటికకు యాసం కృష్ణమూర్తి దర్శకత్వం వహించగా, పి.లీలామోహన్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ నాటికను నా మిత్రులు బెహరా లక్ష్మీ నారాయణ ప్రోద్బలంతో ‘‘పరాధీనభారతం’’ అనే పేరుతో ప్రచురించిన నాటికల సంకలనంలో చోటు దక్కించుకుంది.  సంకలనంలో ముందుమాట ప్రముఖసినీ గేయ రచయిత భువనచంద్రగారు రచించారు.
గమనం నాటిక రచయితగా నా గమనాన్ని నిర్దేశించింది.
గమనం


అమృతవర్షిణి నాటిక నాకు నచ్చిన నాటికల్లో ఒకటి. కానీ నేను దీనిని అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేక పోయాను.


ఉత్తిష్ఠభారతి - రచయితగా నా ఉనికిని నిలబెట్టింది.


వారసులు - ఈ నాటికను నేను 2017 సంవత్సరం నిర్వహించిన నంది నాటకోత్సవాలలో తెనాలిలో ప్రదర్శించటం జరిగింది.
https://munipallevidyadhar.files.wordpress.com/2018/03/vaarasulu.pdf


అమ్మకానికో అమ్మ - 

ఈ నాటిక నేను 2018 వ సంవత్సరంలో శ్రీకాకుళం లో నిర్వహించిన నాటికల రచనలు మరియు కొత్తనాటికల ప్రదర్శనల పోటీలో పాల్గొనేందుకు నిర్వహించాను. ఆ ప్రదర్శనలో ఈ నాటికకు ఉత్తమ రచన, మరియు కేరెక్టర్ ఆర్టిస్ట్, ప్రోత్సాహక బహుమతులు లభించటంతో పాటు తృతీయ ఉత్తమ ప్రదర్శనగా బహుమతి అందుకోవటం జరిగింది. ఈ నాటిక లింక్ కింద ఇవ్వటం జరిగింది.   అమ్మకానికో అమ్మ

కెరటాలు -

ఈ నాటిక నేను 2018వ సంవత్సరం ఎ.వి.కె.ఎఫ్. వారి కథా నాటికల పోటీలకోసం రాయటం జరిగింది. దీనిని నేను యూట్యూబ్  లో వుంచాను. చాలా వ్యూస్ వచ్చాయి.
కెరటాలు (సాంఘిక నాటిక)

కొత్తనీరు -
ఈ నాటికను నేను 2017-18 సంవత్సరంలో ఎ.వి.కె.ఎఫ్. వారి కథా నాటికల పోటీలకోసం రాయటం జరిగింది. దీనిని నేను యూట్యూబ్ లో వుంచాను. ఈ నాటిక 2018 లో  దాదాపు 19 ప్రదర్శనలు మాత్రమే ప్రదర్శించాను. అయితే అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అవ్వటం తో దీనిని కొనసాగించలేక అర్ధాంతరంగా ఆపివేయటం జరిగింది.
కొత్తనీరు (సాంఘిక నాటిక)


మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవం 2021

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా నవంబరు నెలలో నిర్వహించటం జరిగింది. 2021 నవం...

ప్రఖ్యాతిగాంచిన పోస్టులు