17, జనవరి 2017, మంగళవారం

గంగోత్రితో నాయుడు గోపి - విద్యాధర్ మునిపల్లె

గంగోత్రితో నాయుడు గోపి

నాయుడు గోపి నటుడు, దర్శకుడు


జీవితానికి దర్పణం రంగస్థలమనుకుంటే రంగస్థల ప్రదర్శనాస్థలిగా వాసికెక్కి వన్నె తరగని రంగారు బంగారు నందులను మూట కట్టుకొచ్చే మహోన్నత నాటక సంస్థగా గంగోత్రికి ఆంధ్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానముంది. గంగోత్రి సాంస్కృతిక సామాజిక సేవా సంస్థగా పెదకాకానిలో ప్రభవించినా భారత దేశమంతటా దాని రస ఝరులు ఉప్పొంగి ప్రవహిస్తూ దేశపుటెల్లలు దాటి ఖండాంతరాల దాకా పరవళ్ళు తొక్కుతూ గుంటూరూ వారి గొప్పతనాన్ని చాటి చెప్పటం గంగోత్రి వారి విశిష్ఠత. సాంస్కృతిక సామాజిక సేవా సంస్థగా ఉన్న గంగోత్రికి నాయుడు గోపి తండ్రైతే, అక్షరాలా నాటకం తల్లి. ఈ తల్లితండ్రుల పెంపకంలో 2016 నాటికి 26సంవత్సరాలు పూర్తి చేసుకుంది గంగోత్రి నాటక సమాజం. ఈ సందర్భంగా తనను మంచి నటునిగా, దర్శకునిగా రూపుదిద్దిన గురువులను, గంగోత్రి ఎదుగుదలకు రచనలు అందించిన రచయితలను, సహకరించిన సాంకేతిక వర్గాన్ని, నటీనటులను, సలహాలిచ్చి గంగోత్రి అభివృద్ధికి కృషిచేసిన ప్రతి ఒక్కరిని సంస్థ అధినేత శ్రీ నాయుడు గోపి మూడు రోజుల పాటు పెద్ద సభలను నిర్వహించి ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ వారితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని గంగోత్రి ఔన్నత్యాన్ని మరింతగా పెంచారు. 

గంగోత్రి గుండె చప్పుడు

ఒక నాటక సమాజం 26 వసంతాలపాటు నిరాటంకంగా, ఉదృతంగా నాటకాలు ప్రదర్శించాలంటే, ఎన్ని కష్టాలకి, నష్టాలకి, చీదరింపులకు, ఛీత్కారాలకి, అలుగుళ్ళకి, నీలుగుళ్ళకి, బ్రతిమలాటలకు బలికావాలో వాటన్నిటినీ తట్టుకోవటానికి ఆ సమాజ నిర్వాహకునికి, ఎంత ఓర్పుకావాలో, నేర్పు కావాలో.... భావితరం వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ గంగోత్రి గుండె చప్పుడు. ఈ 26సంవత్సరాల గంగోత్రి ప్రవాహంలో కొట్టుకొచ్చిన, ముళ్ళు, పొదలు, రాళ్ళు, రప్పలు, రత్నాలుగా ఎలా మారాయో వివరించే ప్రయత్నమే ఈ వ్యాసం. ఇందులో గంగోత్రి సమాజం ఆవిర్భావానికి కారకులు నాయుడు గోపి. గంగోత్రిని నడిపించిన రథ సారధి నాయుడు గోపి. ఇది ఎవరు అవునన్నా, కాదన్నా నిజం. అలాంటి రధ సారధి ప్రయాణించిన మార్గం అంత సులభతరమేం కాదు. ఎన్నో గతుకులు, ముళ్ళ దారుల్లో తన గంగోత్రి తేరుని నడిపించాల్సి వచ్చింది. తేరు దారి తప్పకుండా ఓర్పు, నేర్పు, సహనం, సౌశీల్యం, చిరునవ్వు అనే ఐదు గుర్రాలు కట్టిన గంగోత్రిని నడిపించి విజయాలు సాధించారు. అయినా ఏనాడూ గర్వంతో విర్రవీగలేదు. తను ఎక్కడనుండి మొదలయ్యారో  ఎప్పుడూ మననంలో వుంచుకుంటారు శ్రీ నాయుడు గోపి. 

గంగోత్రి ఆవిర్భావం

ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత శ్రీ.కె.యస్‌.టి.శాయి గారి దగ్గర నటనలో ఓనమాలు దిద్దారు నాయుడు గోపి. ఆ తర్వాత 1980లో 'శాస్త్రీయం'- గుంటూరు, 'స్పందన' - ఒంగోలు, 'వేమన ఆర్ట్స్‌' గుంటూరు  మొదలైన నాటక సమాజాలలో ఎన్నో వేషాలు వేస్తూ నటినిగా ఒక్కో మెట్టు ఎక్కారు నాయుడు గోపి. తను దర్శకునిగా ఎదుగుదలకి ముఖ్యకారణం జి.యస్‌.ఆర్‌.కె.శాస్త్రి అయితే నటునిగా తనకో గుర్తింపు రావటానికి తోడ్పడిన వాడు వేముల మోహనరావు. 1989 వరకు రంగస్థలంపై నిరాటకంగా  నటిస్తున్న సమయంలో తను నటిస్తున్న సమాజాల్లోని నటులు సినిమాల్లో అవకాశాలకోసం వెళ్ళిపోతున్న తరుణంలో నాటక ప్రదర్శనలు కుంటు పడ్డాయి.  దీంతో దాదాపు సంవత్సరంపాటు ఏకాకిగా వుండిపోయారు. మిత్రులతో కొత్తసమాజం ప్రారంభించాలనే ఊగిసలాటలో పాటిబండ్ల ఆనందరావు అనే రచయిత రచించిన  సినిమాను చూడటానికి నాయుడుగోపి, రజతమూర్తిలు మద్రాసు వెళ్ళటం జరిగింది. ఆనందరావుని కలిసి  కొత్తసమాజం ఆలోచన గురించి వివరించటం జరిగింది. రజతమూర్తితో కలిసి నాయుడుగోపి నాటకం ప్రదర్శించేట్లయితే నాటకం ఇస్తానన్న కండిషన్‌తో రాసిందే ''మానస సరోవరం'' నాటకం. నాటకం అద్భుతంగా రచన సాగింది. దీనికి ఒక మంచి దర్శకుడిని వెతుక్కోవాలి, ప్రదర్శనలివ్వాలనే ఆలోచించారు కానీ, తనలోని దర్శకుని అప్పటికీ గుర్తించలేదు. దర్శకుని పిలిపించుకునే ఆర్థిక స్తోమత లేని కారణంగా 1990 జనవరి మొదటివారంలో నాటకసమాజానికి ఒక పేరు నిర్ణయించే క్రమంలో ఎంతోమంది ఎన్నో పేర్లు చెప్పినా  చివరికి ఆనంద్‌ అనే ఒక మిత్రుని సలహా ప్రకారం ''గంగోత్రి'' అనే పేరును నాయుడుగోపితోపాటు సమాజ సభ్యులందరూ ఆమోదించారు. సిహెచ్‌ రజితమూర్తి, పెండెం కోటేశ్వరరావు, బి.బాబూరావు, పి.సాంబిరెడ్డి, పి.నాగిరెడ్డి, డి. నాగేశ్వరరావు, శ్రీమతి యస్‌. లక్ష్మిల బలవంతంతో ఆయనే దర్శకునిగా మారటం జరిగింది.

మానస సరోవరం నాటకంతో దర్శకునిగా మారిన నాయుడుగోపి తొలి ప్రదర్శన తన సమాజం ద్వారా 1990 ఏప్రిల్‌ 9న వెనిగండ్ల గ్రామంలో ఇచ్చారు. ఆ ఊరిలో మేనరికపు పెళ్ళిళ్ళు ఎక్కువ. ఆ పెళ్ళిళ్ళతో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులకు గురయ్యేవారు. వాళ్ళంతా మానససరోవరం నాటకం చూసి మేనరికపు పెళ్ళిళ్ళకు స్వస్థిచెప్పారంటే అది అతిశయోక్తికాదు. నాటకం తీసుకొని పరిషత్తులకు వెళ్ళిన గోపికి ఎనిమిదిచోట్ల తెల్లకాగితం ఎదురైంది. తోటి మిత్రులంతా నాటకం ఆపేద్దామన్నారు. ''కొత్త సమాజం పెట్టుకున్నారు నష్టపోవద్దంటూ'' సన్నిహితులు హెచ్చరించారు. ''నూటికి నూటపదిమంది మెచ్చే నాటకం రాస్తానంటూ '' రచయిత ఆనందరావు హామీఇచ్చాడు. గోపిలో గందరగోళం. అయినా ఎక్కడో ఈ నాటకంమీద ఆశ. మరో ప్రయత్నం చేశారు. అంతే నాటకం ఆడినచోటల్లా బహుమతులతోపాటు, విశేష ప్రజాదరణ పొందింది. ఆ రకంగా ''గంగోత్రి'' మొదటి నాటకం విజయవంతమైంది.

అటుపై ''కాదుసుమాకల'' నాటకం రాసి పాటిబండ్ల ఆనందరావు రాసివ్వటం, దానిని తీసుకొని మళ్ళీ రాష్ట్రంలో ఉన్న పరిషత్తులకు గోపి బయల్దేరటం జరిగింది. ఆనందరావు అన్నట్లు నూటికి నూటపదిమంది మెచ్చే నాటకాన్నే నాయుడుగోపికి అందించి మాట నిలుపుకున్నారు. ఆతర్వాత మళ్ళీ ఆనందరావుని నాటకం అడిగిన వెంటనే ఎప్పుడో ఇచ్చిన నీతిచంద్రిక నాటకం ఆడుకొమ్మన్నారు. ఆతర్వాత మళ్ళీ ఆనందరావు గంగోత్రితో నాటకం చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా నాటక పరిషత్తులో విస్తృతంగా నాటికల పోటీలు జరుగుతుండటంతో నాటికలు కూడా చేయాలన్న తలంపు గోపికి కలిగింది. కొత్తనాటికలు రాసేవారు దొరకని కారణంగా ఆనందరావు రాసిన పాత నాటిక ''దర్పణం'' ప్రదర్శించారు. కానీ పాత నాటికంటూ దానిని పరిషత్తులు తోసిపారేశాయి. దాంతో మాడభూషి దివాకర్‌బాబు రచించిన ''దహతిమమ మానసం'' ప్రదర్శించారు. ఇదీ పాతదేనంటూ పరిషత్తులు పోటీలనుంచి తొలగించటం జరిగింది. ఆతర్వాత హైదరాబాద్‌కు చెందిన వంశీనిరంజన్‌ కళాకేంద్రం ''నవ్వండీ ఇది విషాదం'' నాటిక విజయవాడలో ప్రదర్శిస్తుండగా చూసిన గోపి ఆ నాటికను ఎలాగైనా ఒకసారి ప్రదర్శించాలని ఉత్సాహపడ్డారు. వెంటనే రచయిత పంతం సత్యనాథన్‌ని కలిసి తన కోరిక వెల్లడించగా.. శివరామకృష్ణయ్యకు చెప్పి ప్రదర్శించుకోమన్నారు. శివరామకృష్ణయ్య కూడా సుముఖత వ్యక్తంచేయగా.. దానిని దాదాపు 50 ప్రదర్శనలకు పైనే విజయవంతంగా ప్రదర్శించారు నాయుడు గోపి. అటుపై యద్భవిష్యం, శ్వేతపత్రం, లజ్జ, శ్రీముఖ వ్యాఘ్రం, శ్రీచక్రం, హింసధ్వని, భూమిపుత్రుడు, పడమటిగాలి, వానప్రస్థం, ఎడారికోయిల, ఓనమాలు, భారతరత్న, ఆంబోతు వంటి సాంఘిక నాటికలు, నాటకాలే కాక, పల్నాటిభారతం, హంసగీతం, శ్రీవేమన వంటి పద్యనాటకాలకు కూడా దర్శకత్వం వహించారు. 

యువకులను నాటకరంగంలోకి ఆహ్వానిస్తూ వారిని ప్రోత్సహించే దిశగా విద్యాధర్‌ మునిపల్లె  (నన్ను) అనే 29 సంవత్సరాల యువకుడు రాసి తీసుకు వచ్చిన గమనం నాటికను రాష్ట్రంలో అనేక చోట్ల ప్రదర్శించి అతనికి రచయితగా ఒక స్థానాన్ని కల్పించారు. వెంటనే విద్యాధర్‌ మునిపల్లె రాసిన శ్రీగురురాఘవేంద్రచరితం పద్యనాటకాన్ని అనేక చోట్ల ప్రదర్శించి కాంస్యనందిని సాధించేలా తీర్చిదిద్దారు నాయుడు గోపి. అటుపై గంగోత్రి 25 సంవత్సరాల వేడుకల్లో అప్పటివరకూ గంగోత్రికి సేవలందించి, విజయానికి కారకులైన ప్రతి ఒక్కరినీ సత్కరించుకోవటం నాయుడు గోపి యొక్క సహృదయతకి, నాటకం పట్ల ఆయనకున్న మక్కువకూ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 

చివరిగా .... 

ఒక రైతు పొలంలో విత్తనాలు చల్లి వ్యవసాయం చేసి పంటను పండిస్తే, నాయుడు గోపి రంగస్థలమనే పొలంలో నాటకాలనే విత్తనాలు వేసి ఉన్నతమైన భావాలనే నీటితో కళాకారుల నటననే ఎరువులుగా వేసి నాటకరంగంపై నటసుగంధాలను వెదజల్లిన కృషీవలుడు. ఇతని కృషి ఫలితంగానే ఎంతో మంది ఈయన వద్ద నటన, దర్శకత్వం నేర్చుకొని వేరే సమాజాలు ఏర్పాటు చేసుకొని ఈ నాడు నాటకరంగంలో తమదైన శైలిలో చెరగని ముద్ర వేసుకున్నారు. కొత్త తరాన్ని తీసుకు వస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా నాటకంలో నవ్యత, నాణ్యతలకు ఏమాత్రం తగ్గకుండా ఇప్పటికీ యువకులతో ఉత్సాహంగా పరుగులు తీస్తున్న ఈ నటకృషీవలుని పాదములకు నమస్కరిస్తూ మరికొన్ని ఆణిముత్యాలను నాటకరంగానికి అందించాల్సిందిగా వేడుకుంటోంది తెలుగునాటకరంగం.

కామెంట్‌లు లేవు:

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవం 2021

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా నవంబరు నెలలో నిర్వహించటం జరిగింది. 2021 నవం...

ప్రఖ్యాతిగాంచిన పోస్టులు