16, జనవరి 2017, సోమవారం

మంచాల రమేష్‌, కరీంనగర్‌ జిల్లా నటుడు, దర్శకుడు

మంచాల రమేష్‌, కరీంనగర్‌ జిల్లా నటుడు, దర్శకుడు
--------------------

న‌టుడు, ద‌ర్శ‌కుడు - మంచాల ర‌మేష్‌, క‌రీంన‌గ‌ర్
మంచాల రమేష్‌ స్వస్థలం వంగర. రామచంద్రం, కనకలక్ష్మి దంపతులకు 1970 ఆగష్టు 22న జన్మించారు. 1980 సంవత్సరంలో 'బడిపంతులు' నాటకం ద్వారా బాలనటునిగా 10 సంవత్సరాల వయసులో ప్రప్రథమంగా రంగప్రవేశం చేశారు. నాటక రంగంలో నటునిగా, దర్శకునిగా చైతన్యకళాభారతి కార్యదర్శిగా వివిధ బాధ్యతలు చేపట్టి నేడు కరీంనగర్‌ రంగస్థల కళాకారునిగా తన జిల్లాకు ఎనలేని ఖ్యాతి సంపాదించి పెట్టారు.

వృత్తిరిత్యా కరీంనగర్‌ జిల్లాలో విద్యుత్‌శాఖ ఇ.ఆర్‌.ఓ రూరల్‌ విభాగంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రవృత్తిరిత్యా నాటకరంగాన్ని ఎంచుకుని ఇరు తెలుగు రాష్ట్రాలలో వివిధ వేదికలపై నాటికలను ప్రదర్శిస్తూ తన జిల్లాకు ఎనలేని గౌరవాన్ని సంపాదించి పెడుతున్నారు. 

ఇప్పటి వరకూ రమేష్‌ ప్రదర్శించిన నాటకాలు :
--------------------------------------
బడిపంతులు, సంసారంలో సరాగాలు, ప్రేమగోల నాటకాలలో బాలనటునిగా గుర్తింపు పొందారు.

చదవా : అనే నాటిక ద్వారా ప్రభుత్వం నిర్వహించిన అక్షర ఉజ్వల కార్యక్రమంలో జిల్లా అంతట 180 ప్రదర్శనలు నిర్వహించారు.

బంగారు గుడ్లు : నాటిక ద్వారా ప్రభుత్వం నిర్వహించిన సారా నిషేధం కార్యక్రమంలో కరీంనగర్‌ జిల్లా అంతటా 35 ప్రదర్శనలు నిర్వహించారు. 

నాకు ఇల్లొచ్చింది : నాటిక ద్వారా గృహ నిర్మాణ సంస్థ తరఫున జిల్లా అంతటా 26 ప్రదర్శనలు నిర్వహించి తనదైన సామాజిక బాధ్యతను పోషించారు. 

అటుపై కేవలం జిల్లాకి మాత్రమే కాక తెలుగు రాష్ట్రమంతా కూడా తనవంతు సామాజిక కార్యకలాపాలను విస్తరించి తనదైన బాధ్యతను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు మంచాల రమేష్‌. 

2002 నందినాటకోత్సవాలలో భాగంగా తన సమాజంతో ''సతిన్మ'' అనే నాటికను ప్రదర్శించి నటునిగా నంది అవార్డుని గెలుచుకున్నారు. రాష్ట్రంలో పలు ప్రదర్శనలు ఇచ్చి తన నాటిక ద్వారా, నటన ద్వారా ప్రేక్షకులను సమస్యపట్ల ఆలోచింపచేశారు. 

2006లో ''ప్రేమ ఈక్వల్ట్‌'' నాటికను నిజామాబాద్‌లో నిర్వహించిన నంది నాటకోత్సవాలలో ప్రదర్శించారు. 

2010లో నంద్యాలలో ఏర్పాటు చేసిన నంది నాటకోత్సవాలలో ''చెల్లనిపైసలు'' నాటికతో తనలోని దర్శకుని బయటకు తీసి కాంస్యనందిని సాధించారు రమేష్‌. ఈ నాటికద్వారా వృద్ధాప్యం మనిషికి శాపం కాదంటూ, ప్రతి ఒక్కరూ రేపటి వృద్ధులేనని, వృద్ధాప్యాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరంటూ వృద్ధులను అలక్ష్యం చేసేవారిపట్ల తనదైన శైలిలో దర్శకత్వ కొరడా ఝుళిపించారు. దీంతో నాటికకు అఖిలాంధ్ర ప్రేక్షకులు రమేష్‌కు బ్రహ్మరథం పట్టారు. వృద్ధులు రమేష్‌ని మనసారా ఆశీర్వదించారు. ఇరు తెలుగు రాష్ట్రాలలో 30 ప్రదర్శనలిచ్చిన ఈ నాటికకు 25 ఉత్తమ ప్రదర్శన బహుమతులు పొందటం జరిగింది. 

అటుపై 2013 సంవత్సరం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన నంది నాటకోత్సవాలలో ''దొంగలు'' నాటికకు దర్శకత్వం వహించి ప్రదర్శించారు. ఈ నాటికద్వారా తల్లితండ్రుల్ని వృద్ధాప్యంలో చూడకుండా ఆస్థికోసం కాపుకాసే బిడ్డలు బిడ్డలు కారని, వారు తల్లితండ్రుల కష్టాలను దోచేసే దొంగలని గర్జించారు. ఈ నాటికకు కూడా ఆంధ్రరాష్ట్రం బ్రహ్మరథం పట్టింది. ఈ దొంగలు నాటిక ప్రదర్శించిన రమేష్‌ ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దొంగిలించాడనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇరు తెలుగు రాష్ట్రాలలో 80 ప్రదర్శనలకు గాను 70 ఉత్తమ ప్రదర్శనలు, 25 ఉత్తమ దర్శకత్వం అవార్డులు, 40 ఉత్తమ నటుని అవార్డులు పొందారు.

ప్రస్తుతం రమేష్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న నాటిక ''ఈలెక్క ఇంతే''. ఇరు తెలుగు రాష్ట్రాలలో 35 ప్రదర్శనలిచ్చి 10 ఉత్తమ ప్రదర్శనలు, 12 ఉత్తమ నటుడు, 6 ఉత్తమ దర్శకత్వ బహుమతులు సాధించారు.

ఇవి కాక ఇంకా....

మనిషి, ఆడది, ఈతరం మారాలి, పామరులు, నిరసన, ఆకలివేట, కాలచక్రం, విధాత, నేనుపట్నం పోతనే, ప్రేమపిచ్చోళ్ళు, ఇతిహాసం, క్షతగాత్రుడు, ఆశాపాశం, నగరం ప్రశాంతంగా ఉంది, లాలలీల, క్లిక్‌, పెన్‌కౌంటర్‌, గర్భగుడి, మార్గదర్శి, సన్మతి, చెల్లనిపైసలు, ఎవరో ఒకరు, గారడి వంటి నాటికల ద్వారా విభిన్న పాత్రలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో నిర్వహించిన ఎన్నో పరిషత్‌ పోటీనాటికలలో సుమారు 340 ప్రదర్శనలు ఇచ్చి ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ దర్శకుడు వంటి అవార్డులు దాదాపు 40కి పైమాటే. 

కరీంనగర్‌ జిల్లా నాటకరంగ చరిత్రలో ఈయన ద్వారా చెల్లనిపైసలు, దొంగలు నాటికలకు ఇంత ఖ్యాతి దక్కింది అనటంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. నాలుగు సార్లు నంది నాటకోత్సవాలలో జిల్లా తరఫున పాల్గొన్న ఏకైక నాటక సమాజం ఇదే కావటం చెప్పుకోదగిన విషయం. 

సన్మానాలు, సత్కారాలు
-------------------------------
ఫోక్‌ ఆర్ట్‌ అకాడమీ, కరీంనగర్‌ వారిచే గ్రామీణ కళాజ్యోతి అవార్డు, తుమ్మల రంగస్థల పురస్కారం వారిచే సత్కారం, చైతన్యకళాభారతి, కరీంనగర్‌ వారిచే ఉత్తమ రంగస్థల నటనా పురస్కారం, చెల్లనిపైసలు నాటికకు దర్శకత్వం వహించి, నటించి నందినాటకోత్సవాలలో తృతీయ బహుమతి పొందినందుకు రసరమ్య కళారంజని, నల్గొండవారిచే సన్మానం, కళాజగతి, నాటకరంగ పత్రిక వారిచే విశాఖ పట్నంలో కళాశ్రేష్ఠ బిరుదుసత్కారం, జిల్లా కళాకారుల సమాఖ్య వారిచే సత్కారం. మానవత కల్చరల్‌ అకాడమి వారిచే సత్కారం పొందారు.

మంచాల రమేష్‌ ఇంత సాధించటానికి కారణం తనను తీర్చిదిద్దిన గురువు శ్రీరాములు సత్యనారాయణ, బండారి దేవరాజ్‌లు కారణమైతే, తననే నమ్మి తనవెంట వుండి నడిపించే కళాకారులు, దర్శకులు, రచయితలు కూడా అని సవినయంగా సమాధానం చెప్పటం అతనిలోని నిగర్వతను చాటిచెబుతుంది. నిత్య తన వెంట వుండి నడిపించే గద్దె ఉదయ్‌కుమార్‌, అల్లకొండ కిషన్‌రెడ్డి, తిప్పర్తి ప్రభాకర్‌, కె.సత్యనారాయణ, వడ్నాల కిషన్‌, రంగు వెంకటనారాయణ, రచయిత శివరామ్‌ తనకు ప్రదర్శనలప్పుడు సెలవలు మంజూరు చేసే అధికారులు, సహకరించే విద్యుత్‌ ఉద్యోగులు లేకపోతే తను లేనని సమాధానం ఇచ్చారు రమేష్‌. ఎన్ని జన్మలెత్తినా కూడా వీళ్ళ ఋణం తీర్చుకోలేనంటూ తన సహృదయాన్ని చాటుకున్నారు రమేష్‌. 

చివరిగా...
-----------
ప్రజలను చైతన్యపరచటానికి ఎన్నో కళారూపాలున్నాయి. అందులో ఓ భాగమే నాటకరంగం. ప్రధానంగా కళలకి, ప్రజలకి విడదీయరాని బంధం ఉంది. కళలు అనేది ప్రజాజీవితంలో భాగమైపోయింది. దానికి ఉదాహరణ ఒక గద్దర్‌, ఒక వంగపండు, ఒక మిద్దె రాములు, ఒక శబ్దర్‌ హస్మి వీళ్ళే తనకు స్ఫూర్తి అని రమేష్‌ అన్నారు. 

30 సంవత్సరాల నుండి నాటకరంగానికి తన వంతు కృషి చేస్తూ నూతన కళాకారులను ప్రోత్సహిస్తూ, సంప్రదాయ నాటకాలను నూతన పద్ధతులలో ప్రయోగించటం, కళారూపాల ద్వారా సమాజంలో పేరుకుపోతున్న సామాజిక సమస్యలను, రుగ్మతలను ప్రజల దృష్టికి తెచ్చి చైతన్య పరుస్తూ వారికి స్ఫూర్తి, సామాజిక స్పృహ కల్పించటమే తన జీవితాశయంగా చెప్పారు. ఎన్ని అవార్డులు సాధించినా తన నాటకాల ద్వారా ప్రజలని చైతన్య పరచనప్పుడు తను నాటకాలు ప్రదర్శించటంలో అర్థమే లేదని వివరించారు. సత్యహరిశ్చంద్ర నాటకం చూసి జీవితంలో అబద్ధం చెప్పకూడదని స్ఫూర్తి చెంది మన దేశానికే స్వాతంత్య్రం తెచ్చిన ఓ మామూలు మనిషి మహాత్ముడైన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తూ నాటకం ద్వారా కనీసం నలుగురిలోనైనా మారాలనే ఆలోచన తెప్పిస్తే చాలంటూ ఇంటర్వ్యూని ముగించారు రమేష్‌.

మంచాల రమేష్‌ మరిన్ని నాటకాలను ప్రదర్శించాలని, ప్రజల్ని ఆలోచింపచేయాలని ఆకాంక్షిస్తూ మరో అతిధితో మళ్ళీ మీ ముందుకు వస్తుంది... తెలుగునాటకరంగం

నవ్యాంధ్రప్రదేశ్ నాటక పరిషత్తుల వివరాలు

(దేవిరెడ్డి రామకోటేశ్వరరావు గారి సహకారంతో...) Srikakulam district: Sri Sumitra kalasamithi, Srikakulam - 532201, Contact persons: Sri...

ప్రఖ్యాతిగాంచిన పోస్టులు