15, జనవరి 2017, ఆదివారం

మేకప్‌ - కళామిత్ర 'అడవి శంకరరావు' హైదరాబాద్‌

మేకప్‌

- కళామిత్ర 'అడవి శంకరరావు' హైదరాబాద్‌
9440944545

1.మేకప్‌ అంటే ఏమిటి?
మేకప్‌ : అద్దళము (కోటింగ్‌), ముఖపత్రరచన, ముఖాంగరచన, రూపాలంకరణ ఆహార్యం.
ఆహార్యం : కళాకారుడికి మేకప్‌ వేసిన తరువాత శిరోజాలంకరణ, మేకప్‌ ఆర్టిస్ట్‌ సూచించిన కరెక్ట్‌ కలర్‌ కాంబినేషన్‌తో ఉన్న దుస్తులు ధరించటం, మొత్తం ఆపాదమస్తకరూపాన్నీ కలిపి ''ఆహార్యం'' అంటారు.

2. అసలు మేకప్‌ ఎందుకు?
చర్మం మీద పడే కాంతిని పీల్చుకునే గుణం కలిగి ఉంటుంది. కాంతిలేని కళాకారుడి ముఖ కవళికలు (ఎక్స్‌ప్రెషన్స్‌) ప్రదర్శించినా, అప్పుడు వ్యక్తమయ్యే అవకాశం ఉండదు. అందుకని ఎక్స్‌ప్రెషన్స్‌ని ప్రేక్షకుడి కంటిదాకా చేరేందుకుగాను ఆర్టిస్ట్‌ ఫేస్‌కి తప్పనిసరిగా మేకప్‌ అవసరం. ఇది నిజం. మేకప్‌ లేకుండా నాటకం వేస్తే, ఎంత లైటింగ్‌ ఉన్నా కూడా కళాకారుడు తన భావాన్ని ప్రేక్షకుడికి అందించలేడు. మేకప్‌కి లైటింగ్‌ ప్రాణం. మేకప్‌ ఆర్టిస్ట్‌ ప్రతి నాటక ప్రదర్శనకి ముందుగా స్టేజికి ఏర్పాటు చేసిన లైటింగ్‌ విధానాన్ని పరిశీలించాలి. జనరల్‌ (బ్రైట్‌) లైట్స్‌ ఎన్ని, ఏఏ ఏంగిల్స్‌లో వున్నాయి. ఫుట్‌లైట్స్‌ ఎన్ని, టాప్‌లైట్స్‌ ఎన్ని, జనరల్‌ లైట్స్‌ ఆర్టిస్ట్‌ ఫేస్‌ మీద ఎన్ని పడుతున్నాయి. కలర్‌ లైట్స్‌ ఎన్ని, ఏఏ రకాలు (బ్లూ, గ్రీన్‌, రెడ్‌, యెల్లో) ఎన్ని వున్నాయి అని తప్పనిసరిగా పరిశీలించాలి. ముందుగా ఏర్పాటు చేసిన లైట్స్‌ సరియైన ఏంగిల్‌లో వుండి కాంతిని ప్రసరిస్తున్నాయా లేదా అని చూసి, ప్రదర్శన సమయంలోనైనా సరిదిద్దుకోవచ్చు.

3. మేకప్‌ రూం ఎలా వుండాలి?
మేకప్‌ చేసే ముందు మేకప్‌ గది (గ్రీన్‌రూం)లో ఆర్టిస్ట్‌ ఫేస్‌ మీద కరెక్ట్‌ లైటింగ్‌ విధానంలో ఫేస్‌ మీద మూడువైపులా సరిసమానంగా లైటింగ్‌ పడే విధానం ఉండాలి. మేకప్‌రూంలో మేకప్‌కి 100 క్యాండిల్‌గానీ 200 క్యాండిల్‌ బల్బులుగానీ వుండాలి. హాలోజన్‌ లైటిగ్‌ పెట్టడం వ‌ల‌న చెమట ఎక్కువగా పట్టే అవకాశం వుంటుంది. మేకప్‌గదిలో ట్యూబ్‌లైట్‌ అస్సలు పనికిరాదు. మేకప్‌ వీధి ప్రదర్శనలకి ఎక్కువగా వుండాలి. స్టేజీలైటింగ్‌కి తగ్గట్టుగా స్టేజీ మేకప్‌ ఉండాలి. నాటక ప్రదర్శన అనేది రాత్రివేళ 9 గంటల ముందా? లేక 9 గంటల తరువాతా? అనేది కూడా గుర్తుంచుకుని మేకప్‌ చేయాలి. ఎందువలన అంటే రాత్రివేళ 9 గంటలలోపు ఇళ్ళల్లో, షాపుల్లో కరెంటు వాడకం ఎక్కువగా వుండటం వలన స్టేజీకి కరెంటు, ఓల్టేజీ సప్లై తక్కువగా వుండవచ్చు. రాత్రి 9 గంటల తరువాత వాటి వాడకం తగ్గటం వలన స్టేజీపై కాంతి పెరగవచ్చు. విద్యుత్‌ కాంతి ఎక్కువ, తక్కుగా ప్రసారమవటం వలన మేకప్‌ ఆర్టిస్ట్‌ వేసిన మేకప్‌లో కాంతి ఎక్కువగా, తక్కువగా కనపడవచ్చు. అది గమనించాలి.

4. మేకప్‌ ఎప్పుడూ ఒకే రకంగా వుండాలా? ఏమైనా మార్పులు అవసరమా?
మేకప్‌ ఎప్పుడూ ఒకేరకంగా వుండకూడదు. మార్పులకు అనుగుణంగా జాగ్రత్తగా చేస్తుండాలి. అంటే శీతాకాలంలో మేకప్‌ చేస్తే బాగా వుంటుంది. హాయిగా వుంటుంది. ఆర్టిస్ట్‌కీ, మేకప్‌ ఆర్టిస్ట్‌కీ పెద్దగా శ్రమవుండదు. వానాకాలంలో కూడా దాదాపు అంతే, అయితే వేసవి కాలంలోనే తంటా అంతా, ఇక్కడే వుంటుంది. ఏప్రిల్‌, మే నెలల్లో ఎండలు, ఉష్ణోగ్రత ఎక్కువ. అనెలల్లో వచ్చే కార్తెల ప్రభావం వలన మనిషి శ‌రీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. చర్మం మీద వుండే అసంఖ్యాక స్వేదగ్రంథులు, పెద్దవిగా వ్యాకోచించటం వలన చెమట ఎక్కువగా వస్తుంది. చెమట ఎక్కువగా రావటం వలన ముఖంమీద కారటం వలన ఆర్టిస్ట్‌కి చీదర, చిరాకు కలిగి నటనపై ఏకాగ్రత తప్పే ప్రమాదం వుంది. నాటకంలో నటించే కళాకారుల ముఖం ఎప్పుడూ చక్కగా వుండాలి. మేకప్‌ చేసిన మేకప్‌ ఆర్టిస్ట్‌లు ప్రతిసారీ కళాకారులందరికీ చెమట తుడవటం కుదరకపోవచ్చు. ఏ ఆర్టిస్ట్‌కి ఆ ఆర్టిస్టే ఒక తెల్లని, గ్లాస్కో క్లాత్‌ని తడిపి, పిండి రుమాలుగా మడతపెట్టి చెమట పీల్చేటట్లుగా జాగ్రత్తగా అద్దుకోవాలి. ముఖంమీద రుద్దకోకూడదు. చెమట ఎక్కువగా నుదురుమీద, రెండు కణతల క్రింద, చెవుల ముందు భాగంలోనూ, ముక్కు క్రింద భాగం, చుబుకం మీద, గడ్డం క్రింద, కంఠం మీద పడుతుంది. లైట్‌ వెలుతురులో అద్దం చూసుకుంటూ తడిపిన టచప్‌ క్లాత్‌తో చెమట పట్టిన భాగాన్ని మెత్తగా, సున్నితంగా చేసిన మేకప్‌ పాడవకుండా,బొట్లు వగైరాలు పోకుండా అద్దుకోవాలి. సీన్‌లోకి వెళ్ళేముందు, వెళ్ళి వచ్చిన తరువాత అలా చెయ్యాలి. తరువాత ఫేస్‌ని చల్లగాలికి ఫ్యాన్‌ ముందు వుంచాలి. చక్కగా ఆరుతుంది. వేసిన షర్ట్స్‌ వగైరా ఆరేటట్లు ఫ్యాన్‌కి శరీరం ముందువైపు, వీపు వైపు వుచితే తడిసిన డ్రస్‌లు ఆరుతాయి. కొంతమంది ఆరిస్టులకయితే తలమీద, జుట్టుకిందవైపు నుంచి కూడా విపరీతంగా చెమట కారుతుంది. అందుకే మేకప్‌ చేసే చోట తప్పనిసరిగా శబ్దం తక్కువగావచ్చే టేబుల్‌ ఫ్యాన్‌గానీ, పెడస్టల్‌ ఫ్యాన్‌గానీ వుంచాలి. మేకప్‌ రూమ్‌లోగానీ, హాల్లో కానీ ఆరుబయట ప్రదేశంలోగానీ, మేకప్‌ చేసేచోట ఆర్టిస్ట్‌ ఫేస్‌మీద చేసిన మేకప్‌ కలర్‌ త్వరగా ఆరటం కోసం ఒక టేబుల్‌ ఫ్యాన్‌గానీ, పెడస్టల్‌ ఫ్యాన్‌గానీ తప్పనిసరిగా వుంచాలి. మేకప్‌ ముందు, మేకప్‌ చేసిన తర్వాత, సహనటీనటులందరికో మరొక ఫ్యాన్‌ వుండాలి. మేకప్‌ చేయించుకునే ముందు తప్పనసిరగా చల్లని నీళ్ళతో మురికి బాగా నిమ్మకలిపిన సెఓప్‌తో పోయేటట్లుగా ముఖంమీద, మెడకిందా, మెడవెనుక, చెవుల వెనుక భాగాన శుభ్రంగా రెండుసార్లు కడుక్కుని మేకప్‌ చేయించుకోవటం చాలా మంచిది.

5. మేకప్‌ ఎలా చెయ్యాలి?
నాటకంలో పాత్ర ధరించే పాత్రధారి ఎత్తుగా వేసుకున్న 3లేక 4 కుర్చీల ఎత్తులో కూర్చుంటే మేకప్‌ ఆర్టిస్ట్‌కి సౌకర్యవంతంగా వుంటుంది. ఎందుకంటే మేకప్‌ చేసే మేకప్‌ ఆర్టిస్ట్‌కి ఎత్తు తక్కువ అయితే ఎక్కువసార్లు వంగి వంగి లేవటం వలన నడుం నొప్పి వచ్చే పరిస్థితి వుంది. అందుకని మేకప్‌ ఆర్టిస్ట్‌ ఎక్కువగా వంగి లేవక నిటారుగా నిలబడి వుండి మేకప్‌ చేస్తే బావుంటుంది. ఫ్యాన్‌గాలి ఆర్టిస్ట్‌ ముఖంమీదకి వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. బల్బుల కాంతి ముఖంమీద సరిగా పడేలా చూసుకోవాలి. అప్పుడు మేకప్‌ ప్రారంభించాలి. ముందుగా కళాకారుల మోకాళ్ళపై నుంచీ కంఠం వరకూ క్లాత్‌ని వేసి వుంచాలి. ముఖం శుభ్రంగా తుడిచి పాత్రది చిన్న వయసా, పెద్ద వయసా అని తెలుసుకుని ఫౌండేషన్‌ లైటా, డార్కా అని నిర్ణయించాలి. కలర్‌ మిక్సింగ్స్‌లో సమపాళ్ళలో ముఖంపై అప్లై చేయాలి. జిడ్డుని పీల్చే గుణం వున్న పౌడర్‌ ముఖంమీద పఫ్‌తో అప్లై చేసి, కొద్దిసేపు ఆగి తడి స్పాంజ్‌తో పౌడర్‌ పోయేటట్లుగా రెండు సార్లు తుడవాలి. పాత్రకి తగిన ఛాయ ఉన్న ''ప్యాన్‌కేక్‌'' నెంబరుని ఎంచుకుని మంచి స్పాజ్‌తో అప్లైచేసి, నీళ్ళతో కొద్దిగా తడిపిన స్పాంజ్‌తో సమంగా, మరకలు లేకుండా సరిచేయాలి. ముక్కు, సన్నంగా కనబడేలా చేయటానికి, ముక్కుకు రెండువైపులా డార్క్‌ ఇచ్చిన తరువాత, ముక్కుదూలంమీద మధ్యలో లైట్‌గా బుగ్గమీద వున్నంత కలర్‌ షేడ్‌ని పొడవుగా కిందికి స్పాంజ్‌తో లాగాలి. ముఖంమీద 'ప్యాన్‌కేక్‌' సమంగా వున్న తరువాత బ్లాక్‌ ఐబ్రో పెన్సిల్‌తో కనుబొమ్మలు, చెవులు పట్టీలు, మీసాలు దగ్గర బ్లాక్‌ కలర్‌తో సరిచేసుకోవాలి. కంటి కింద లైట్‌గా ఒక లైన్‌ షేడ్‌ ఇవ్వాలి. అలా చేస్తే స్కిన్‌టోన్‌ నుంచి ఐబాల్‌ బయటకి వచ్చే సౌలభ్యం వుంది. చివరల పెదవులపైన లేత వయసు పాత్ర అయితే లైట్‌ షేడ్‌ లిప్‌స్టిక్‌, పెద్ద వయసు పాత్ర అయితే డార్క్‌షేడ్‌ వున్న లిప్‌స్టిక్స్‌ ఇవ్వాలి. మేకప్‌ చేసే కార్యక్రమంలో భాగంగా మెడ ముందు, మెడ వెనుక, చేతులకు, వేళ్ళకు కూడా తప్పనిసరిగా మేకప్‌ చేయాలి. మనిషి ముకంలో కళ్ళు, ముక్కు, పెదవులకు వున్నంత  ప్రాధాన్యత, చెవులకు వుండదు. అందువలన వాటికి సాధారణ మేకప్‌ సరిపోతుంది.

6. ఒకే వయసులో వున్న పాత్రలకు మేకప్‌ ఎలా చేయాలి?
ఉదాహరణకి బాగా ఆరోగ్యవంతుడు, ధనవంతుడు అయిన సుమారు 60 సంవత్సరముల పాత్రకి, చక్కని శరీర ధారుడ్యం వున్న పాత్రదారి ముఖంలో ఆరోగ్యంగా, ఆనందంగా వుండేలా మంచి బ్రైట్‌ 'ప్యాన్‌కేక్‌'తో చెయ్యాలి. తలకి సన్నగా హెయిర్‌ వైట్‌నర్‌ స్ట్రోక్‌ ఒకటి ఇవ్వాలి. ఆకారానికి తగిన మీసం, మెడలో బంగారు గొలుసు, చెవులకి ఆభరణాలు అలంకరిస్తే బావుంటుంది. అలాగే 60 యేళ్ళ మధ్యతరగతి తండ్రి పాత్రకి కుటుంబపరమైన సమస్యల వలయంలో చిక్కుకున్న వాని పాత్ర రూపకల్పన విధానంలో కళ్ళకింద నల్లచారికలు, వడిలిన పెదవులు, గ్రే మీసం, అవసరమైన గ్రే గడ్డం, గ్రేకలర్‌ తల జుట్టు, దేవునిమీద భారంవేసిన వ్యక్తిగా ఒక బొట్టు, దైన్యం ప్రతిబింబించే విధంగా చేయాలి. అన్ని సంతోషాలకీ దూరమయ్యి, మందుకి దగ్గరయిన 60 ఏళ్ళ ఒక బడుగు జీవి రూపంగా నలిగిపోయిన, మాసిపోయిన దుస్తులు, బక్క చిక్కిన శరీరం, మాసిపోయిన గడ్డం, మీసం, తైలసంస్కారంలేని రంగు మారిన తుప్పతల జుత్తు, లోతుకు పోయిన కళ్ళు, కంటి కింద నల్లచారికలపై తాగినట్లుగా ఎర్రని కళ్ళ గుర్తులు, డల్‌ కలర్‌ మేకప్‌ ఆపాత్రకి న్యాయం చేస్తుంది. ఆ పాత్రలకి ఒకే వయసయినా కూడా ఆర్థిక, ఆరోగ్య, సామాజిక పరిస్థితుల ప్రభావం, వాటిమీద వుండేలాగా మేకప్‌ చేస్తే ప్రేక్షకాదరణ తప్పక లభిస్తుంది. పౌరాణిక నాటకాలు, వీధి భాగవతం, వీధినాటికలు, శాస్త్రీయ నృత్యాలు, సాంఘిక నాటకాలు వుంటాయి. పగటిపూట సూర్యకాంతిలో ప్రదర్శించే వీధి భాగవతం, వీధి నాటికలకు మేకప్‌ జనానికి కనబడే విధంగా వుండాలి. పౌరాణికపాత్రల రూపకల్పనలో సగభాగం దుస్తులు, నగలు, కిరీటాలు ఆయుధాలకు పోతే, మిగతా సగభాగం మేకప్‌దే. పౌరాణిక మేకప్‌ కొద్దిగా మందంగా, అందంగా చెయ్యాలి. దుష్టరాక్షస పాత్రలు, దేవపాత్రలు, సాత్వికపాత్రలు, సాధారణపాత్రలు వుంటాయి. కదా.. పౌరాణిక పాత్రల రూపాల్ని మనమెవరమూ చూడలేదు. కానీ, కవుల వర్ణనను బట్టి, చిత్రకారులు వేసిన కల్పనను బట్టి ఆయా పాత్రలకి రూపకల్పన చేయటం జరుగుతోంది. వేసిన రంగును బట్టి దుస్తులు, నగలు, కిరీటాలు, ఆయుధాలు ఒక వంతయితే, ముఖపత్ర రచన మరొక వంతు. పౌరాణిక నాటకాల్లో డ్రెస్‌, కర్టెన్స్‌, టెక్నీషియన్స్‌ విషయాల్లో కొంత పురోగమించినా కూకర్‌ విషయములో పాత విధానాలు విడనాడి కొంత అభివృద్ధి మెలకువలు పాటిస్తే ఆధునిక సమాజం ఇంకా బావుంటుంది.

7. మేకప్‌, డ్రస్‌, కర్టెన్స్‌, లైటింగ్‌ల మధ్య అవినాభావ సంబంధం ఏమిటి?
సహజంగా మేకప్‌ ఎల్లో, వైట్‌ కలర్స్‌లో బ్రైట్‌గా వుంటుంది. ఆ మేకప్‌ కనపడటం కోసం తగినంత లైటింగ్‌ ఫోకస్‌ పడాలి. మరి ఆ ఆర్టిస్ట్‌ ఫేస్‌ సరిగా కనబడాలంటే బ్యాక్‌ గ్రౌండ్‌ కర్టెన్‌ ప్రపంచమంతా నాటకం కోసం ఎంపిక చేసిన బ్లూ, బ్లూబ్లాక్‌, గ్రీన్‌బ్లాక్‌ కర్టెన్స్‌ తప్పనిసరిగా ఈ రంగు కర్టెన్స్‌నే వాడాలి. వేరే ఏ కలర్‌ కర్టెన్స్‌ వాడినా ఫ్లోరసింట్‌ రంగులు లైటింగ్‌కి డామినేట్‌ అయ్యి ఆర్టిస్ట్‌ ఫేస్‌ క్లియర్‌గా కనబడదు. అనవసరంగా కలర్‌ లైట్స్‌ వాడినా ఆర్టిస్ట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ కనబడవు. కలర్‌ లైట్స్‌ వాడితే స్టేజీమీద డ్రెస్‌, వస్తువులు రంగులు మారి పోతాయి కూడా, లైటింగ్ ఎక్కువగా వుంటే డైరెక్షన్‌, లైట్‌ డ్రెస్‌లు బర్న్‌ అవుతాయి. తప్పనిసరిగా అనగా సఖ్యత, సహృదయత అవసరం. ఎవరు ఎవరు పనిచేసినా... నాటక ప్రదర్శన విజయవంతం అవాలనే ఆశయంతో పనిచేస్తే మంచిది.

కామెంట్‌లు లేవు:

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవం 2021

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా నవంబరు నెలలో నిర్వహించటం జరిగింది. 2021 నవం...

ప్రఖ్యాతిగాంచిన పోస్టులు