9, ఏప్రిల్ 2020, గురువారం

నాటకరంగానికి వన్నెతెచ్చిన శ్రీరాముల సత్యనారాయణ


నాటకరంగ మేరు శిఖరం,  కరీంనగర్ నాటక రంగానికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన ప్రముఖ వ్యక్తి శ్రీరాముల సత్యనారాయణ. నాటక రచయితగా దర్శకునిగా నటునిగా పలువురి ప్రశంసలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన. భేషజాలకు ఆర్భాటాలకు, ఆర్భాటాలకు దూరంగా ఉండే ఉత్తమ వ్యక్తిత్వం తో పాటు నాటక కళా ప్రతిభ కలిగిన వాడు ఆయన. సమాజ హితాన్ని చేకూర్చడమే కాకుండా సమాజంలో పరివర్తన కలిగించే నాటకాలను రచించి, నటించి, ప్రదర్శించిన ప్రయోగశీలి. నాటక సామాగ్రి తక్కువగా, పాత్రలను పరిమితంగా ఉపయోగిస్తూ గొప్ప దృశ్యాన్ని, సందేశాన్ని అందించడం ఆయన రచనా పాటవానికి నిదర్శనం. పాత్రల ఎంపికలో రూపకల్పనలో సంభాషణల కూర్పు లో  ఎక్కడ కృత్రిమత్వం లేకుండా సహజంగా మన మధ్యన జరుగుతున్నట్లుగా ఉంటూ ఆలోచన, ఆవేదన, ఆనందం, అన్నిటికీ మించిన సందేశం ఆయన నాటకాల్లో ప్రత్యేకం.

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో 6 జనవరి 1952 రోజున జన్మించిన శ్రీరాముల సత్యనారాయణ బీఎస్సీ అగ్రకల్చర్ పూర్తి చేసి  వ్యవసాయ అధికారి గా  అనేక సంవత్సరాలు విశిష్ట సేవలు అందించారు. వృత్తిని సమర్థవంతంగా నిర్వహిస్తూనే మరోపక్క నాటక రంగానికి ఎనలేని సేవ చేశారు. 1970లో పదవి కోసం అనే నాటికలో నటించి రంగ ప్రవేశం చేసిన సత్యనారాయణ ఆ తర్వాత అనేక నాటకాలలో నటించి రాష్ట్రస్థాయిలో పలు బహుమతులు గెల్చుకున్నారు. పద్మ కళానికేతన్ సంస్థకు కార్యదర్శి గా 1980లోనే రాష్ట్ర స్థాయి నాటక పోటీలు నిర్వహించారు.

1985 మే 1 న ఆయన కునమల్ల రమేష్, బండారి శ్రీరాములు, తిప్పర్తి ప్రభాకర్, బండారి రవీందర్ తదితరులతో కలిసి  చైతన్య కళాభారతి అనే నాటక సంస్థను స్థాపించారు. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే *నటనా జ్యోతి* కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒక నాటిక ప్రదర్శన కరీంనగర్ కళాభారతిలో ఏర్పాటు చేయడం ఆయన ప్రతిభకు తార్కాణం. ప్రతి మాసం నాటకాన్ని రచించి, దర్శకత్వం వహించడం తో పాటు  నటించడం ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. పాటు విజయవంతంగా నిర్వహించిన తర్వాత మరుసటి సంవత్సరం త్రైమాసిక కార్యక్రమం ఏర్పాటు చేసి తన బృందంతో నాటకాలు ప్రదర్శించడమే కాకుండా చైతన్య కళాభారతి కీర్తి పతాకాన్ని రాష్ట్రం నలుదిశలా ఎగరవేశారు.  మొట్టమొదటిసారిగా 1981లో ఈ తరం మారాలి అనే నాటికను విద్యార్థులు విద్యా విధానం ఇతివృత్తంగా తీసుకుని రచించారు. ఇక ఆ తర్వాత పామరులు,శివమెత్తిన సత్యం, ఆకలి వేట, ప్రేమ పిచ్చోళ్ళు, మనిషి, ఆడది అబల కాదు, నిరసన, కాలచక్రం, నేను పట్నం బోతనే, రైతు రాజ్యం, చదవరా, ఆశాపాశం, అగ్ని పరీక్ష, మలిసంద్య లాంటి నాటకాలు రచించి ఉత్తమ రచయితగా వివిధ పరిషత్తు పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు. ఈ నాటకాలన్నీ బీహెచ్ఈఎల్, మంచిర్యాల, సంగారెడ్డి, ఇందూరు,  వర్ధన్నపేట మొదలగు రాష్ట్ర స్థాయి నాటక పోటీలలో ప్రదర్శించబడి ఉత్తమ రచన, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ ప్రదర్శన లాంటి బహుమతులు ఆయన, ఆయన బృందం గెలుచుకున్నారు. అనేక సంవత్సరాలు చైతన్య కళాభారతి పక్షాన తెలంగాణ స్థాయి నాటక పోటీలు నిర్వహించి కరీంనగర్ కళాకారులు పలు ఉత్తమ నాటకాలను చూసే అవకాశాన్ని కల్పించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం- అక్షర ఉజ్వల కోసం చాలా గ్రామాలలో నాటకాలను సంస్థ పక్షాన ప్రదర్శించి నిరక్షరాస్యుల లో చదువుకోవాలనే ఉత్సాహాన్ని కలిగించారు. అక్షర ఉజ్జ్వల కమిటీ నిర్మించిన నవోదయం అనే టెలి ఫిలిం కు కథా రచన సంభాషణలు సమకూర్చడం కాకుండా  ప్రముఖ దర్శకులు స్వర్గీయ  దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో ఒక ప్రముఖ పాత్రను కూడా పోషించి అందరి ప్రశంసలు పొందారు.

 ఊరుమ్మడి బతుకులు, నిమజ్జనం లాంటి అవార్డు చిత్రాలకు దర్శకత్వం వహించిన బిఎస్ నారాయణ దర్శకత్వంలో  నిర్మించబడ్డ మార్గదర్శి సినిమాకు సామాజిక న్యాయం ఇతివృత్తంగా కథ, సంభాషణలు అందించడమే కాకుండా చిత్ర నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ చిత్రంలో ఆయన ఒక  పాత్రను కూడా పోషించారు.  ఆ సినిమా ద్వారా అనేక మంది నటీనటులకు అవకాశాన్ని కల్పించారు. ఈ చిత్రం 1993 లో జాతీయ సమైక్యత నంది పురస్కారాన్ని కూడా గెలుచుకుంది.
వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు గా ఉద్యోగ విరమణ పొందిన అనంతరం పరివర్తన, నేను బ్రతికే ఉన్నా, ష్ ఇలాంటి లఘు చిత్రాలకు కథ మాటలు అందించి వహించారు. ఆయన రాసిన వివిధ నాటకాలు పుస్తకాలుగా కూడా వెలువరించారు.
ఆ మధ్య మిషన్ కాకతీయ లో భాగంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ అధికారుల సమావేశంలో శ్రీరాముల సత్యనారాయణ రైతు సమస్యలపై రూపొందించి నటించిన లఘు చిత్రాన్ని చూసి మంత్రి హరీష్ రావు కంట నీరు పెట్టిన వార్త అన్ని ప్రధాన పత్రికలలో రావడం విశేషం.

కరీంనగర్ జిల్లా కళాకారుల సమాఖ్య తొలి అధ్యక్షుడిగా సేవలందించారు. సమైక్య సాహితీ ప్రతి సంవత్సరం ఉత్తమ నాటక రచయిత కు అందించే తుమ్మల రంగస్థల పురస్కారాన్ని గెలుచుకున్నారు ఆయన స్థాపించిన చైతన్య కళాభారతి సంస్థ ద్వారా నాతో సహా మంచాల రమేష్, తిప్పర్తి ప్రభు, వడ్నాల కిషన్, కునమల్ల రమేష్, బండారి దేవరాజ్, గద్దె ఉదయ్ కుమార్ లాంటి ఆణిముత్యాల వంటి అనేక మంది నటీనటులు ఆవిర్భవించి సంస్థను నంది నాటక పోటీలలో వరకు ఎదిగేలా చేశారు. ఉభయ రాష్ట్రాలలో నలు మూలల ప్రతిష్టాత్మకమైన వేదికల మీద నాటకాలను ప్రదర్శిస్తూ 35 సంవత్సరాలు గా సంస్థను ఎవరెస్టు శిఖరం లాగా నిలబెడుతున్నారు.  రంగస్థల సేవే తన జీవిత ధ్యేయంగా భావిస్తూ చివరివరకు నటన, రచన, దర్శకత్వం, నిర్మాణం బాధ్యతల తో అలుపెరుగని కృషి చేశారు. అనారోగ్యంతో  2020, ఏప్రిల్ 9న మరణించారు.

(మాడిశెట్టి గోపాల్, కరీంనగర్ రాసిన వ్యాసం నుండి)

కామెంట్‌లు లేవు:

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవం 2021

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా నవంబరు నెలలో నిర్వహించటం జరిగింది. 2021 నవం...

ప్రఖ్యాతిగాంచిన పోస్టులు