7, సెప్టెంబర్ 2020, సోమవారం

మునిపల్లె నాటక పరిషత్ ప్రథమ నాటకోత్సవం

మునిపల్లె నాటక పరిషత్ ప్రథమ నాటకోత్సవాలు

 
మునిపల్లె నాటకపరిషత్ నాటకోత్సవాలు 2020 మార్చి 11 మరియు 12 తేదీల్లో గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య వేదికపై ఐదునాటికలు ఎంపికచేసి ప్రదర్శించటం జరిగింది. ఈ సాయిరాఘవ మూవీమేకర్స్ మునిపల్లె నాటక పరిషత్ ప్రారంభించటానికి, నిర్వహించాలన్న ఆలోచన రావటానికి అంకురార్పణ చేసిన వ్యక్తులు వరుసగా డాక్టర్ జి.యస్.ప్రసాదరెడ్డి గారు, డి.రామకోటేశ్వరరావుగారు, కొల్లి మోహనరావుగారు, మానాపురం సత్యనారాయణగారు. నాటక పరిషత్ నిర్వహణ విషయంలో నేను వీరి ద్వారా అనేక సలహాలు, సంప్రదింపులు పొందాను. వీరిచ్చిన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని పరిషత్ నిర్వహించాలని అనుకున్నాను. కానీ నిర్వహించగలనా అన్న సంశయంతో దాదాపు సంవత్సర కాలం గడిపేశాను. నామీద నాకు నమ్మకంలేకే ఇంత సమయం వృధా చేసుకున్నాను.  ఒకదశలో ఏదైతే అదైంది.. ప్రయత్నం చేద్దాం అని ఒక మొండిధైర్యం చేశాను. అనుకున్నదే తడవుగా ఈ విషయాన్ని మా అన్నగారు చెరుకూరి సాంబశివరావు గారితో పంచుకున్నాను. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. వేదిక విషయమై నేను వేంకటేశ్వరస్వామి దేవాలయం, అన్నమయ్య కళావేదికను అనుకున్నాను. అక్కడ వేదిక దొరకటం చాలా అరుదైన విషయం. చాలా ముందుగా డేట్స్ బుక్ చేసుకోవాలి అని చెరుకూరి సాంబశివరావుగారు సూచించారు. అలాగే నా గురువుగారు నాయుడు గోపి గారు కూడా అదేమాట అన్నారు. అవసరమైతే ఆలయ నిర్వాహకులతో మాట్లాడతాను అని కూడా చెప్పారు. నేను తప్పకుండా మీ సహాయం పొందుతాను గురువుగారూ అన్నాను. 

ఆ తర్వాత నేను 2019 నవంబరు నెలలో ఆలయ కమిటీ వారికి లెటర్ అప్లై చేశాను. అయితే ఏవో కారణాలవల్ల వారినుంచి నాకు స్పందన రాలేదు. వారి నుంచి స్పందన వస్తుందిలే అని ఎదురు చూశాను. అయితే చెరుకూరి సాంబశివరావు అన్నగారు ఒకరోజు అడిగారు ఏం విద్యాధర్ పరిషత్ పనులు ఎంతవరకూ వచ్చాయి.. నేను విషయం చెప్పాను. అలా కాదు... నాతోరా.. అని ఆయనే దగ్గరుండి నన్ను దేవాలయ కమిటీ వారిదగ్గరకు తీసుకెళ్ళారు. నేను ఏ రోజు వారికి లెటర్ పెట్టిందీ చెప్పాను. వారు ఆ లెటర్ తీసుకొని చూశారు. అయితే మూడు నెలల వరకూ డేట్స్ లేవని చెప్పారు. సాంబశివరావు అన్నగారు వారిని వదలలేదు. మొత్తానికి ఎలాగోలా నాకోసం 2020 మార్చి నెలలో 11,12 కేటాయించారు. ఏం విద్యాధర్ హ్యాపీనా అన్నారు సాంబశివరావు అన్నగారు. నేను చాలా హ్యాపీ అన్నా అన్నాను. కానీ అసలు టెన్షన్ అప్పుడే మొదలైంది. నా పరిషత్ నిర్వహణకి చందాలు సేకరించాలి. ఎవరిని అడగాలి..? ఎక్కడ అడగాలో నాకు తెలీదు. అప్పటికీ నాకు తెలిసిన నట మిత్రులనీ, పరిషత్ నిర్వాహకులనీ అడిగాను. వారు కొంత సానుకూలంగా స్పందించారు. వారి వారి శక్తి కొలదీ అమౌంట్ పంపించారు. నా బంధువులనీ అడిగాను. వారు కూడా వారికి తోచింది పంపించారు. అయితే ఎంత అమౌంట్ వచ్చినా కూడా పరిషత్ నిర్వహణకు సరిపోదు. అదే సమయంలో నేను కెరటాలు నాటిక ప్రదర్శనలద్వారా పోగైన అమౌంట్ కొంత వుంది. ఆ అమౌంట్ ని కూడా ఇందులో వాడేందుకు సిద్ధమయ్యాను. నా పరిషత్ కి మొత్తం నేనే అయిపోయాను. నా పక్కన నిలబడటానికి పనులు అందుకోవటానికి మనుషులు లేకుండా పోయారు. అదే సమయంలో నేనున్నాను అంటూ నా మిత్రుడు మధు ముందుకొచ్చాడు. మొదటి రోజు కార్యక్రమాల నిర్వహణ అతనికి అప్పగించాను. రెండో రోజు నేను చూసుకున్నాను. వేదికపై బాధ్యత ఎవరు స్వీకరించాలి? అన్న అంశంలో ముందునుంచీ వున్న చెరుకూరి సాంబశివరావు అన్నగారిని అడిగాను. అయితే ఆయన కొత్తగా సినిమా ఓపెన్ అయిందనీ.. తాను దర్శకత్వ బాధ్యతలు చేపట్టాననీ కుదరటంలేదన్నారు. వెంటనే నేను నా మిత్రుడు బసవరాజు జయశంకర్ ని అడిగాను. ఆయన కాశీకి వెళ్ళేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నానని తన అశక్తత తెలియజేశారు. ఎవరు వేదిక మీద కార్యక్రమాలు నిర్వహించాలి అనే అంశంలో నాకు పెద్ద సమస్య ఎదురైంది. అయితే బసవరాజు జయశంకర్ దైవిక ఘటన వల్లనో మరే ఇతర కారణాల వల్లనో ఆయన కాశీ ప్రయాణం ఆగిపోయింది. వెంటనే ఆయన రంగంలోకి దిగారు. ఇక వేదికపై కార్యక్రమనిర్వహణకి పెద్దగా ఆలోచించాల్సిన అవసరంలేకుండా పోయింది. లైటింగ్ పనులు ఎవరికి అప్పగించాలి అనే అంశంలో నేను మొదటి నుంచి చాలా క్లారిటీగా వున్నాను. నా మిత్రుడు రాజారత్నంని అభ్యర్ధించాను. వెంటనే డేట్స్ రాసుకున్నాడు. మైక్ విషయంలో దేవాలయం వారే ఇచ్చారు. ఇక స్టేజీ కర్టెన్లు, డెకరేషన్లు వంటివి ఎక్కడ నుంచి తీసుకురావాలి అనే విషయంలో నాకు మరో ప్రశ్న.. అదే సమయంలో నా మిత్రుడు మధు తన దగ్గరున్నవి ఇచ్చాడు. నా మిత్రుడు పరమేష్ ని రంగాలంకరణ చేయాల్సిందిగా కోరాను. ఆయా నాటక సమాజాల వారికి మేకప్ బాధ్యతలు కూడా అతనికి సూచించాను. అతను కూడా సానుకూలంగా స్పందించాడు. 

ఇక్కడికి పరిషత్ నిర్వహణలో ఎవరి బాధ్యతలు వారు పూర్తిగా స్వీకరించారు. ఇక వచ్చిన నాటక సమాజసభ్యులకీ వసతి, భోజనం ఏర్పాట్లు ఈ విషయంలో నాకు రకరకాల ఆలోచనలున్నాయి. ఈ విషయం నా గురువుగారు నాయుడు గోపి గారు నాతో బృందావన్ గార్డెన్స్ లోని ఒక హోటల్ చెప్పారు. అక్కడ భోజనం రుచిగా వుందని చెప్పారు. వెంటనే అక్కడికి నా మిత్రుడు మధుతో చేరుకున్నాను. మధు తుళ్ళరు కళాపరిషత్ నిర్వహిస్తున్న అనుభవం వుంది. అందుకే అతన్ని తీసుకెళ్ళాను. అతను టిఫిన్, భోజనం రేట్లు మాట్లాడాడు. నేను అడ్వాన్స్ ఇచ్చేశాను. ఇక అన్నిటికన్నా ముఖ్యమైంది నాటక సమాజ నిర్వాహకులకి షీల్డులు బహూకరణ, ఆడపడచు సత్కారం.. షీల్డుల విషయంలో ఎక్కడ దొరుకుతాయో చెరుకూరి సాంబశివరావు అన్నగారి సలహా తీసుకొని అక్కడికి వెళ్ళి షీల్డులు ఆర్డర్ ఇచ్చాను. ఆడపడచు సత్కారం విషయంలో నా చెల్లెళ్ళు అమృతవర్షిణి, లహరిలు ముందుకొచ్చారు. వారు స్పాన్సర్ చేశారు. ఇలా నేను ఒక్కడినే అనుకున్న సమయంలో మేమంతా నీకున్నాం.. నువ్వు కార్యక్రమం మొదలు పెట్టు అంటూ ప్రోత్సహించారు. నన్ను ప్రోత్సహించిన వారిని ఈ తరుణంలో తలచుకోవటం నా ధర్మం, నా బాధ్యత అని నేను అనను.. వారి పట్ల నాకున్న ప్రేమ అనురాగంతో తలచుకుంటున్నాను. నాకు ఆర్థికంగా సాయం చేసిన వారిలో 

1. పి.శివప్రసాద్ - విశాఖపట్నం
2. చిట్టి వెంకటరావు - శ్రీకాకుళం
3. రఘు, చెలికాని వెంకటరావు - కొండెవరం
4. మల్లేశ్వరరావు - కావలి
5. మంచాల రమేష్ - కరీంనగర్
6. మునిపల్లె సత్యనారాయణ - హైదరాబాద్
7. ఎం.మధు - తుళ్ళూరు
8. ఎం.రవీంద్ర - చిలకలూరిపేట
9. కె.వి.మంగారావు -చిలకలూరిపేట
10.డాక్టర్ జె.రవీంద్ర - తిరుపతి
11. బసవరాజు జయశంకర్ - గుంటూరు
12. గుడిపాటి యోగీశ్వరరెడ్డి - వీడియో, ఫోటో గుంటూరు

అతిధులను సత్కరించుకునే అవకాశంలో భాగంగా నాటక రంగంలో అవిశ్రాంతంగా పనిచేస్తూ నాటకాన్నే వృత్తిగా స్వీకరించి నాటకరంగంలో అనేక విభాగాల్లో తనదైన ముద్రవేసుకొన్న యువకుడిని గుర్తించి చేసే సత్కారానికి మునిపల్లె నాటకపరిసత్ ‘‘జటాయువు’’ పురస్కారాన్ని అందించింది. అలాగే నాటకరంగాన్ని ప్రవృత్తిగా స్వీకరించి మానవీయ దృక్కోణంతో ముందుకు వెళుతున్న మరో వ్యక్తిని గుర్తించి వారు చేసిన సేవలకు గాను ‘‘రంగస్థల నటసింహం’’ అనే పురస్కారాన్ని కూడా అందించేందుకు నిర్ణయించాను.

11.03.2020 :  1. జటాయువు పురస్కారం 2020 - గోపరాజు విజయ్ - కొలకలూరు
12.03.2020 :  2. రంగస్థల నటసింహం 2020 - డాక్టర్ జలదంకి రవీంద్ర - తిరుపతి

కార్యక్రమాన్ని నిరాటంకంగా నిర్వహించటానికి సహకరించిన మిత్రులకీ, సన్నిహితులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను..

మీ 
విద్యాధర్ మునిపల్లె
మునిపల్లె నాటకపరిషత్, గుంటూరు

27, ఏప్రిల్ 2020, సోమవారం

ఆంధ్ర నాటక కళా పరిషత్తులో నెల్లూరు జిల్లా, వెంకటగిరి పట్టణ పాత్ర

1944,45 సంవత్సరాలలో వెంకటగిరిలోని అమెచ్యూర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుండి ఏలూరు వాస్తవ్యులు శ్రీ కొండముది గోపాలరాయ శర్మ వారు రచించిన ఎదురీత అనే నాటకాన్ని టి. ఈశ్వర దాస్ గారి ఆధ్వర్యంలో ఆంధ్ర నాటక కళా పరిషత్ విజయవాడ దుర్గా కళామందిరంలో ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ సంగీతం బహుమతులు సాధించారు. ఇందులో బాలసరస్వతి గారు నటించారు. దీనికి ఆత్రేయ గారు 5 పాటలు రాశారు.

ఆ తర్వాత, ఆత్రేయ గారు రచించిన రామ్ రహీం, నాటకం 1949,50 సంవత్సరాలలో ప్రదర్శించి ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ఉత్తమ ప్రదర్శన బహుమతి సాధించారు. ఆ నాటకంలో శ్రీ మోహన్ దాస్ గారికి ఉత్తమ సంగీతం బహుమతి వచ్చింది. ఆ తరువాత వరుసగా ఆత్రేయ గారి కప్పలు, ఎన్జీవో నాటికలు ఆంధ్ర నాటక పరిషత్తులో ఉత్తమ ప్రదర్శన బహుమతులు సాధించాయి. ఆ తర్వాత వెంకటగిరిలోని కల్చర్ ఆర్ట్స్ థియేటర్ వారు శ్రీ వేణు గారి రచన, దర్శకత్వంలో దిష్టి బొమ్మలు అనే నాటకాన్ని ఆంధ్ర నాటక కళా పరిషత్ లో ప్రదర్శించగా శ్రీ వేణు గారికి ఉత్తమ నటుడు బహుమతి వచ్చింది.

కాలగమనంలో అన్ని సంస్థలు ఒకే తాటి మీదికి వచ్చి నట సమాఖ్య పేరుతో బహుశ 1963 నుండి 2004 వరకు దిగ్విజయంగా, ప్రతిష్టాత్మకంగా పరిషత్తు నిర్వహించడంతోపాటు శ్రీ జిఎం శాస్త్రిగారు రచించిన ఈ జనానికోదండం నాటకం పరిషత్తులలో ప్రదర్శించారు.

కె.వి.రమణారెడ్డిగారు, వేణు గారు జంటగారాసిన ‘రాజీవం’ నాటికను తొలిసారిగా ఈ సమాజంవారే ప్రదర్శించగా, తర్వాత
జి.యస్.ఆర్. ముార్తిగారు పాపులర్ చేశారు.
(ఈ సమాచారం వెంకటగిరి వాస్తవ్యులు, సీనియర్ నటులు గురుతుల్యులు శ్రీ ఎస్ ఎల్ నరసింహం గారి నుండి జిబికె మూర్తిగారు సేకరించారని తెలిసింది.)

25, ఏప్రిల్ 2020, శనివారం

సాంఘీక నాటక రంగానికి పుట్టినిల్లు పాలకొల్లు


కళలకు నిలయం కళాకారులకు ఆలయమైన పాలకొల్లు సాంఘీక నాటక రంగానికి పుట్టినిల్లు గా పేరుగాంచింది. పినిశెట్టి శ్రీరామమూర్తి, చలం‌, అల్లు రామలింగయ్య, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, కొసనా ఈశ్వర్, కాశీనాధుని సత్యనారాయణ, మల్లది సత్యనారాయణ, దుర్వాసుల వెంకట శాస్త్రి, భమిడపాటి శ్రీ రామమూర్తి, భమిడపాటి లక్ష్మీ నారాయణ, ఆండ్ర శేషగిరిరావు, పోకల నరశింహారావు‌, ఉషా బాబూరావు, ఓఎస్.రావు, వంగానరశింహారావు, దాసరి సత్యనారాయణ మూర్తి, తొట్టెంపూడి ఆంజనేయులు, రావూరి నాగభూషణం, వంగా అప్పారావు, పేలూరి దాసు, కొంగరాపి అప్పారావు, బోనం బాబూరావు, చేగొండి సత్యనారాయణ మూర్తి, కత్తుల రామమోహన్, వీ‌రాఅప్పారావు, వీరా పోతన, గండేటి వెంకటేశ్వరరావు, తాళాబత్తుల వెంకటేశ్వరరావు, గంటా రామమోహన్, మానాపురం సత్యనారాయణ, రాజా తాతయ్య, విన్నకోట వెంకటేశ్వరరావు, యియ్యిపు రామలిగశ్వరరావు తదితరులు నాటక రంగంలో పేరు ప్రఖ్యాతలు పొందారు.



పాలకొల్లు కిచెందిన పినిశెట్టి శ్రీ రామమూర్తి రచించిన ఆడది, అన్నాచెల్లెలు, పల్లెపడుచు వంటి నాటకాలు ఎంతే పేరు ప్రఖ్యాతులు పొంది నేటికీ ఎక్కడో ఒక చోట ప్రదర్శింపబడుతున్నాయి. వీరా పోతన రచించిన తల్లీ క్షమించు నాటిక నంది నాటకోత్సవాలో పాల్గొని అనేక బహుమతులు పొందారు. తాళాబత్తుల వెంకటేశ్వరరావు సైకతశిల్పం, సప్తపది, దిష్టబొమ్మలు వంటి నాటికలు రచించి నాటకరంగలో మంచి రచయితగా పేరుపొందారు. విన్నకోట వెంకటేశ్వరరావు, రాజా  తాతయ్య, మానాపురం సత్యనారాయణ, వంగా నరశింహారావు నంది నాటకోత్సవాలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

పాలకొల్లుకి చెందిన మాంటిస్సోరి స్కూల్, దీప్తి స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో బాలల నాటికలు నంది నాటకోత్సవాలలో పాల్గొని అనేక బహుమతులు పొందారు.

పాలకొల్లు నాటక పరిషత్తులు
చలనచిత్రరంగంలో పాలకొల్లు కళాకారులు ప్రధాన పాత్ర పోషించడానికి ఇక్కడి నాటక పరిషత్ లు కీలకపాత్ర వహిచాయి.దాదాపు అరవై సంవత్సరాల క్రితం నాటక రంగాన్ని ఆంద్ర నాటక కళాపరిషత్ ఆదుకున్న సమయంలో పాలకొల్లు లో కొందరు యువకులు మిత్ర బృందం అనే సంస్థ ను ఏర్పాటు చేసి దసరా ఉత్సవాల సందర్భంగా నాటక పోటీలు నిర్వహించారు. పాలకొల్లు లో నాటక పరిషత్ లు ప్రారంభించడానికి తొలిమెట్టు బొండాడ పెంటయ్య, బొండాడ వెంకట్రాజు గుప్త, వంకాయల పురుషోత్తం, జస్టీస్ ఇయ్యపు పాండురంగారావు, పినిశెట్టి సత్యనారాయణ, కూరెళ్ళ సత్యనారాయణ, అద్దేపల్లి రాంప్రసాద్, చుండూరి రెడ్డిబాబు, గమిని మాణిక్యాలరావు, శ్రీ కాకొల్లు రామబ్రహ్మం, వేము రామలిగయ్య వంటి కళిభిమానులు దాదాపు 14సంవత్సరాలు నాటక పరిషత్ నిర్వహించారు. ఈ పరిషత్ లో ఆదుర్తి సుబ్బారావు, సావిత్రి వంటి ప్రముఖులను సన్మానించారు. పాలకొల్లు నాటక పరిషత్ పేరిట జాన నాగేశ్వరరావు, బోళ్ళ సర్వేశ్వరరావు‌, ఉషాబాబూరావు, వీరా అప్పారావు, కొంగరాపి అప్పారావు, వీరా సత్యం, గుత్తికొండ కాశీ నాయకత్వం వహించారు.

1964లో కొంతమంది యువకులు నెహ్రూ ప్రెండ్స్ యూనియన్ స్దాపింఛి నాటిక పోటీలు రెండు సంవత్సరాలు చేసారు. ఈ సంస్థకు కందుల అప్పారావు, వంగా నరశింహారావు, బందెల ఈశ్వరరావు, కొంగరాపి అప్పారావు కర్రా సత్యనారాయణ, పిహెచ్.గోపాలరాజు సారద్యం వహించారు. ఈ కాలంలోనే సోమేశ్వర అగ్రహారం లో ఆంజనేయ కళాపరిషత్, వీవర్స్ కాలనీ యువజన సంఘం ఆద్వర్యంలో నాటికల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు రాజాను బద్రం‌, ఓఎస్.రావు, విన్నకోట వెంకటేశ్వరరావు, కొడవటీ దత్తు, మానెం దుర్గాప్రసాద్ సారద్యం వహించారు.

చేగొండి వెంకట హరరామ జోగయ్య ఎమ్మెల్యే గా ఉన్న కాలంలో పాలకొల్లు లోని పరిషత్ లు అన్నీకలిపి సంగీత నాటక అకాడమీ గా రూపకల్పనచేసి నాటక పోటీలు నిర్వహించారు. దీనికి జోగయ్య, ఆద్దేపల్లి రాంప్రసాద్, అత్యం జగన్మోహన్, చుండూరి రెడ్డి బాబు,వంగా నరశింహారావు నాయకత్వం వహించారు. స్వర్గీయ కోడి రామకృష్ణ స్వర్గీయ దాసరి నారాయణ రావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న కాలంలో మిత్రులు సహకారంతో దాసరి నారాయణ రావు కల్చరల్ అసోసియేషన్ స్థాపించి 5 సంవత్సరాలు నాటికల పోటీలు నిర్వహించారు. దీనికి ఇయ్యిపు పాండురంగారావు, కొటికలపూడి రాజమోహన్ రావు,  ఇయ్యిపు రామచంద్రరావు, ఇయ్యిపు రామలిగేశ్వరరావు, శివాల ప్రభాకర్ సారధ్యం వహించారు.

ప్రముఖ జర్నలిస్ట్ అడబాల వీరాస్వామి రాజా 1960లో మహాత్మా మైత్రిబృందం అనే నాటక సంస్థను స్థాపించడం ద్వారా పాలకొల్లు నాటక పరిషత్ ల చరిత్ర మలుపు తిరిగింది. ఈ నాటక పరిషత్తు పోటీల సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, గుర్రం జాషువా, బోయి భీమన్న, నటరాజ రామకృష్ణ, సంపత్ కుమార్, చెరుకువాడ నరసింహం పంతులు, వావిలాల గోపాలకృష్ణయ్య, బాట్టం శ్రీ రామమూర్తి, అద్దేపల్లి వివేకానంద దేవి, క్రొవ్విడి లింగరాజు వంటి ఉద్దండులు పాల్గొన్నారు. మహాత్మా మైత్రి బృందానికి మాజీమంత్రి చేగొండి వెంకట హరరామ జోగయ్య, చల్లా రాజా, అందే పిచ్చయ్య, ఇయ్యిపు వీరబద్రం, చీకట్ల నరసింహమూర్తి, పోలిశెట్టి బేబి, కొంగరాపి అప్పారావు, మండెల వెంకట నర్సయ్య సారద్యం వహించారు.

వర్ధనీడి సత్యనారాయణ ఎమ్మెల్యే గా ఉన్న కాలంలో వర్దినీడి బాబ్జీ, చుండూరి రెడ్డి బాబు,చందక రాము ఆధ్వర్యంలో క్షీరపురి నాటక అకాడమీ పేరుతో నాటికల పోటీలు నిర్వహించారు. కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం సహకారంతో దాసరి నారాయణరావు కల్చరల్ యూనిట్ పేరుతో రెండు సంవత్సరాలు నాటక ల పోటీలు సురభి నాటకోత్సవాలు నిర్వహించారు.

ఈ నాటక పోటీలకు డాక్టర్ సీహెచ్. సత్యనారాయణ మూర్తి, వీరా శ్రీనివాస్, వంగా నరశింహారావు, కత్తుల రామమోహన్, పోలిశెట్టి శ్రీనివాస్, రావూరి చాచా, గండేటి వెంకటేశ్వరరావు, వీరా పోతన సారద్యం వహింఛారు.

శ్రీ రామపేట దేవి ఫ్రెండ్స్ యూనియన్ పేరిట రాజా తాతయ్య,శివాల రామారావు, చీర దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నాటక పరిషత్ నిర్వహించారు.

పాలకొల్లు లలిత కళాంజలి నాటక అకాడమీ కి జస్టీస్ ఇయ్యిపు పాండురంగారావు, వాకాడ అప్పారావు, కొటికలపూడి రాజమోహనరావు, ఇయ్యిపు రామలింగేశ్వర రావు, ఇందుకూరి దిలీప్ కుమార్ రాజు, కొటికలపూడి కృష్ణా రావు, మానాపురం సత్యనారాయణ, శివాల దుర్గా ప్రసాద్, నీలంశెట్టీ సత్యప్రసాద్, మేడికొండ శ్రీనివాసరావు సారద్యం వహించారు.

2008లో మానాపురం సత్యనారాయణ వ్యవస్థాపకునిగా పాలకొల్లు కళాపరిషత్ ఆవిర్భావం జరిగింది. చలం స్మారక నాటకోత్సవం, అల్లు రామలింగయ్య, పినిశెట్టి శ్రీ రామమూర్తి, ఇవివి సత్యనారాయణ, వంగా అప్పారావు స్మారక నాటకోత్సవాలు, డాక్టర్ గజల్ శ్రీ నివాస్ పాలకొల్లు కళాపరిషత్, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ స్మారక నాటకోత్సవం 12సంవత్సరాలుగా నాటికల పోటీలు నిర్వహిస్తున్నారు. కె.వి.కృష్ణ వర్మ‌‌, మానాపురం సత్యనారాయణ, మేడికొండ శ్రీ నివాసరావు, విన్నకోట వెంకటేశ్వరరావు, డాక్టర్ వర్మ, జక్కంపూడి కుమార్, కొణిజేటి గుప్త, విఠాకుల రమణారావు సారధ్యం వహిస్తున్నారు. పాలకొల్లులో సుదీర్ఘ కలం నాటక పరిషత్ నిర్వహించిన సంస్థ లలిత కళాంజలి నాటక అకాడమీ 33 సంవత్సరాలు నిర్వహించారు.

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం ద్వారా సినీ దర్శకునిగా పరిచయ మైన కోడి రామకృష్ణ మిత్రుల సహకారంతో 33సంవత్సరాల పాటు నాటికల పోటీలు నిర్వహించారు. 1983లో ఈ పరిషత్ ప్రారంబించి తొలుత నాటకాలు, తర్వాత నాటకాలు, నాటికల పోటీలు నిర్వహించి అతి పెధ్ద పరిషత్ గా పేరు పొందింది. ఆయన బతికి ఉంటే మరల పరిషత్ జరిపేవారు.
(పాలకొలను వార్తా పత్రిక, 10వ వార్షికోత్సవ సంచిక, 16 నవంబరు 2013, పుట. 15,16. )
(వ్యాస రచయిత: మానాపురం సత్యనారాయణ, జర్నలిస్ట్, పాలకొల్లు కళా పరిషత్ వ్యవస్థాపకుడు)

16, ఏప్రిల్ 2020, గురువారం

చెంగల్వ పూదండ (నాటిక)

చెంగల్వపూదండ నాటిక తెలుగు భాష ఔన్నత్యాన్నీ, ఆవశ్యకతనూ చాటిచెప్పే రచన. పరభాషా వ్యామోహంలో మాతృభాషను మరవొద్దని సున్నితంగా చెప్పిన ప్రదర్శన. శిష్టా చంద్రశేఖర్ రచనను శ్రీ కళానికేతన్, హైదరాబాదు వారి సమర్పణలో డా. వెంకట్ గోవాడ దర్శకత్వంలో అనేక ప్రదర్శనలు చేశారు.

ప్రదర్శన వివరాలు

  1. 05.01.2013 అజో-విభో ఫౌండేషన్, అనంతపురం
  2. 22.01.2013 నంది నాటకోత్సవం, విజయనగరం
  3. 31.01.2013 ఎన్ టి ఆర్ కళా పరిషత్. ఒంగోలు
  4. 10.02.2013 భద్రాద్రి కళా పరిషత్, భద్రాచలం
  5. 26.02.2013 పాలకొల్లు కళా పరిషత్, పాలకొల్లు
  6. 27.02.2013 ద్రాక్షారామ నాటకపరిషత్, ద్రాక్షారామం
  7. 01.03.2013 రంగస్థలి, నరసరావుపేట
  8. 02.03.2013 ఎన్.టి.ఆర్ కళాపరిషత్, గుంటూరు
  9. 24.03.2013 కోన ప్రభాకరరావు నాటకపరిషత్తు, బాపట్ల
  10. 25.03.2013 అభినయ నాటకపరిషత్తు, రావులపాలెం
  11. 10.04.2013 సి.ఆర్.సి.కాటన్ కళాపరిషత్తు, రావులపాలెం
  12. 11.04.2013 ఏ.ఎస్.రాజా నాటకోత్సవం, విశాఖపట్నం
  13. 18.04.2013 శ్రీ కళానికేతన్ వార్షికోత్సవం, హైదరాబాదు
  14. 27.04.2013 వి.ఎస్.ఎమ్. కళాపరిషత్తు, రాయవరం
  15. 28.04.2013 ప్రగతికళామండలి, సత్తెనపల్లి
  16. 29.04.2013 పరుచూరి రఘుబాబు పరిషత్తు, పల్లెకోన
  17. 04.05.2013 నాగార్జున కళా పరిషత్తు, కొండపల్లి
  18. 05.05.2013 ఎస్.కె.ఎల్. కళాపరిషత్తు, శ్రీకాళహస్తి
  19. 06.05.2013 ఎస్.ఎం. నాటకపరిషత్తు, తాటిపర్తి
  20. 17.05.2013 పల్నాడు కళాపరిషత్తు, పిడుగురాళ్ళ
  21. 25.05.2013 పి.ఎ.ఎం.ఎస్.శతాబ్ది ఉత్సవాలు, బాపట్ల
  22. 04.06.2013 బి.హెచ్.ఇ.ఎల్, హైదరాబాదు
  23. 08.06.2013 ఎ.ఎస్.ఆర్. కళాపరిషత్తు, కాకినాడ

బహుమతుల వివరాలు

  • 2013 అజో విభో కందాళం ఫౌండేషన్ అనంతపురం (ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడు)
  • 2013 నంది నాటకోత్సవాలు, విజయనగరం (ఉత్తమ రచన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ జ్యూరీ ప్రదర్శన)
  • 2013 పాలకొల్లు కళాపరిషత్తు, పాలకొల్లు (ఉత్తమ ద్వితీయ ప్రదర్శన, ఉత్తమ రచన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ నటుడు)
  • 2013 ద్రాక్షారామ నాటక కళాపరిషత్తు, ద్రాక్షారామం(ఉత్తమ ఆహార్యం, ఉత్తమ నటుడు)
  • 2013 రంగస్థలి, నర్సరావుపేట (ఉత్తమ ఆహార్యం, ఉత్తమ నటుడు)
  • 2013 కోన ప్రభాకరరావు పరిషత్తు, బాపట్ల (ఉత్తమ ఆహార్యం, ఉత్తమ ప్రశంసా నటి, ఉత్తమ ప్రశంసా నటుడు)
  • 2013 అభినయ నాటక పరిషత్తు (ఉత్తమ ఆహార్యం, ఉత్తమ తృతీయ ప్రదర్శన, ఉత్తమ రచన)
  • 2013 సి.ర్.సి. కాటన్ కళాపరిషత్తు, (ఉత్తమ ద్వితీయ ప్రదర్శన, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు)
  • 2013 ఏ.ఎస్. రాజా నాటకోత్సవాలు, విశాఖ (ఉత్తమ ద్వితీయ ప్రదర్శన, ఉత్తమ రచన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ సంగీతం)
  • 2013 శ్రీకారం రోటరీ కళాపరిషత్తు, మార్టూరు (ఉత్తమ రచన, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ తృతీయ ప్రదర్శన)
  • 2013 వి.ఎస్.ఎన్.మూర్తి కళాపరిషత్తు, రాయవరం (ఉత్తమ ఆహార్యం)
  • 2013 ప్రగతి కళామండలి, సతేనపల్లి (ఉత్తమ రచన, ఉత్తమ తృతీయ ప్రదర్శన, ఉత్తమ ఆహార్యం)
  • 2013 నాగార్జున కళాపరిషత్తు, కొండపల్లి (ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ రచన, ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ బాల నటి)
  • 2013 కళావాణి, నాగులపాలెం (ఉత్తమ రచన, ఉత్తమ జ్యూరీ ప్రదర్శన)
  • 2013 మార్కండేయ నాటక కళాపరిషత్తు, తాటిపర్తి (ఉత్తమ బాలనటి )
  • 2013 బి.హెచ్.ఈ.ఎల్., హైదరాబాద్ (ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ రచన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ బాల నటి, ఉత్తమ జ్యూరీ నటుడు)
(డా. వెంకట్ గోవాడ గారు రాసినది)

9, ఏప్రిల్ 2020, గురువారం

నాటకరంగానికి వన్నెతెచ్చిన శ్రీరాముల సత్యనారాయణ


నాటకరంగ మేరు శిఖరం,  కరీంనగర్ నాటక రంగానికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన ప్రముఖ వ్యక్తి శ్రీరాముల సత్యనారాయణ. నాటక రచయితగా దర్శకునిగా నటునిగా పలువురి ప్రశంసలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన. భేషజాలకు ఆర్భాటాలకు, ఆర్భాటాలకు దూరంగా ఉండే ఉత్తమ వ్యక్తిత్వం తో పాటు నాటక కళా ప్రతిభ కలిగిన వాడు ఆయన. సమాజ హితాన్ని చేకూర్చడమే కాకుండా సమాజంలో పరివర్తన కలిగించే నాటకాలను రచించి, నటించి, ప్రదర్శించిన ప్రయోగశీలి. నాటక సామాగ్రి తక్కువగా, పాత్రలను పరిమితంగా ఉపయోగిస్తూ గొప్ప దృశ్యాన్ని, సందేశాన్ని అందించడం ఆయన రచనా పాటవానికి నిదర్శనం. పాత్రల ఎంపికలో రూపకల్పనలో సంభాషణల కూర్పు లో  ఎక్కడ కృత్రిమత్వం లేకుండా సహజంగా మన మధ్యన జరుగుతున్నట్లుగా ఉంటూ ఆలోచన, ఆవేదన, ఆనందం, అన్నిటికీ మించిన సందేశం ఆయన నాటకాల్లో ప్రత్యేకం.

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో 6 జనవరి 1952 రోజున జన్మించిన శ్రీరాముల సత్యనారాయణ బీఎస్సీ అగ్రకల్చర్ పూర్తి చేసి  వ్యవసాయ అధికారి గా  అనేక సంవత్సరాలు విశిష్ట సేవలు అందించారు. వృత్తిని సమర్థవంతంగా నిర్వహిస్తూనే మరోపక్క నాటక రంగానికి ఎనలేని సేవ చేశారు. 1970లో పదవి కోసం అనే నాటికలో నటించి రంగ ప్రవేశం చేసిన సత్యనారాయణ ఆ తర్వాత అనేక నాటకాలలో నటించి రాష్ట్రస్థాయిలో పలు బహుమతులు గెల్చుకున్నారు. పద్మ కళానికేతన్ సంస్థకు కార్యదర్శి గా 1980లోనే రాష్ట్ర స్థాయి నాటక పోటీలు నిర్వహించారు.

1985 మే 1 న ఆయన కునమల్ల రమేష్, బండారి శ్రీరాములు, తిప్పర్తి ప్రభాకర్, బండారి రవీందర్ తదితరులతో కలిసి  చైతన్య కళాభారతి అనే నాటక సంస్థను స్థాపించారు. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే *నటనా జ్యోతి* కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒక నాటిక ప్రదర్శన కరీంనగర్ కళాభారతిలో ఏర్పాటు చేయడం ఆయన ప్రతిభకు తార్కాణం. ప్రతి మాసం నాటకాన్ని రచించి, దర్శకత్వం వహించడం తో పాటు  నటించడం ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. పాటు విజయవంతంగా నిర్వహించిన తర్వాత మరుసటి సంవత్సరం త్రైమాసిక కార్యక్రమం ఏర్పాటు చేసి తన బృందంతో నాటకాలు ప్రదర్శించడమే కాకుండా చైతన్య కళాభారతి కీర్తి పతాకాన్ని రాష్ట్రం నలుదిశలా ఎగరవేశారు.  మొట్టమొదటిసారిగా 1981లో ఈ తరం మారాలి అనే నాటికను విద్యార్థులు విద్యా విధానం ఇతివృత్తంగా తీసుకుని రచించారు. ఇక ఆ తర్వాత పామరులు,శివమెత్తిన సత్యం, ఆకలి వేట, ప్రేమ పిచ్చోళ్ళు, మనిషి, ఆడది అబల కాదు, నిరసన, కాలచక్రం, నేను పట్నం బోతనే, రైతు రాజ్యం, చదవరా, ఆశాపాశం, అగ్ని పరీక్ష, మలిసంద్య లాంటి నాటకాలు రచించి ఉత్తమ రచయితగా వివిధ పరిషత్తు పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు. ఈ నాటకాలన్నీ బీహెచ్ఈఎల్, మంచిర్యాల, సంగారెడ్డి, ఇందూరు,  వర్ధన్నపేట మొదలగు రాష్ట్ర స్థాయి నాటక పోటీలలో ప్రదర్శించబడి ఉత్తమ రచన, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ ప్రదర్శన లాంటి బహుమతులు ఆయన, ఆయన బృందం గెలుచుకున్నారు. అనేక సంవత్సరాలు చైతన్య కళాభారతి పక్షాన తెలంగాణ స్థాయి నాటక పోటీలు నిర్వహించి కరీంనగర్ కళాకారులు పలు ఉత్తమ నాటకాలను చూసే అవకాశాన్ని కల్పించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం- అక్షర ఉజ్వల కోసం చాలా గ్రామాలలో నాటకాలను సంస్థ పక్షాన ప్రదర్శించి నిరక్షరాస్యుల లో చదువుకోవాలనే ఉత్సాహాన్ని కలిగించారు. అక్షర ఉజ్జ్వల కమిటీ నిర్మించిన నవోదయం అనే టెలి ఫిలిం కు కథా రచన సంభాషణలు సమకూర్చడం కాకుండా  ప్రముఖ దర్శకులు స్వర్గీయ  దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో ఒక ప్రముఖ పాత్రను కూడా పోషించి అందరి ప్రశంసలు పొందారు.

 ఊరుమ్మడి బతుకులు, నిమజ్జనం లాంటి అవార్డు చిత్రాలకు దర్శకత్వం వహించిన బిఎస్ నారాయణ దర్శకత్వంలో  నిర్మించబడ్డ మార్గదర్శి సినిమాకు సామాజిక న్యాయం ఇతివృత్తంగా కథ, సంభాషణలు అందించడమే కాకుండా చిత్ర నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ చిత్రంలో ఆయన ఒక  పాత్రను కూడా పోషించారు.  ఆ సినిమా ద్వారా అనేక మంది నటీనటులకు అవకాశాన్ని కల్పించారు. ఈ చిత్రం 1993 లో జాతీయ సమైక్యత నంది పురస్కారాన్ని కూడా గెలుచుకుంది.
వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు గా ఉద్యోగ విరమణ పొందిన అనంతరం పరివర్తన, నేను బ్రతికే ఉన్నా, ష్ ఇలాంటి లఘు చిత్రాలకు కథ మాటలు అందించి వహించారు. ఆయన రాసిన వివిధ నాటకాలు పుస్తకాలుగా కూడా వెలువరించారు.
ఆ మధ్య మిషన్ కాకతీయ లో భాగంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ అధికారుల సమావేశంలో శ్రీరాముల సత్యనారాయణ రైతు సమస్యలపై రూపొందించి నటించిన లఘు చిత్రాన్ని చూసి మంత్రి హరీష్ రావు కంట నీరు పెట్టిన వార్త అన్ని ప్రధాన పత్రికలలో రావడం విశేషం.

కరీంనగర్ జిల్లా కళాకారుల సమాఖ్య తొలి అధ్యక్షుడిగా సేవలందించారు. సమైక్య సాహితీ ప్రతి సంవత్సరం ఉత్తమ నాటక రచయిత కు అందించే తుమ్మల రంగస్థల పురస్కారాన్ని గెలుచుకున్నారు ఆయన స్థాపించిన చైతన్య కళాభారతి సంస్థ ద్వారా నాతో సహా మంచాల రమేష్, తిప్పర్తి ప్రభు, వడ్నాల కిషన్, కునమల్ల రమేష్, బండారి దేవరాజ్, గద్దె ఉదయ్ కుమార్ లాంటి ఆణిముత్యాల వంటి అనేక మంది నటీనటులు ఆవిర్భవించి సంస్థను నంది నాటక పోటీలలో వరకు ఎదిగేలా చేశారు. ఉభయ రాష్ట్రాలలో నలు మూలల ప్రతిష్టాత్మకమైన వేదికల మీద నాటకాలను ప్రదర్శిస్తూ 35 సంవత్సరాలు గా సంస్థను ఎవరెస్టు శిఖరం లాగా నిలబెడుతున్నారు.  రంగస్థల సేవే తన జీవిత ధ్యేయంగా భావిస్తూ చివరివరకు నటన, రచన, దర్శకత్వం, నిర్మాణం బాధ్యతల తో అలుపెరుగని కృషి చేశారు. అనారోగ్యంతో  2020, ఏప్రిల్ 9న మరణించారు.

(మాడిశెట్టి గోపాల్, కరీంనగర్ రాసిన వ్యాసం నుండి)

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవం 2021

మునిపల్లె నాటక పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా నవంబరు నెలలో నిర్వహించటం జరిగింది. 2021 నవం...

ప్రఖ్యాతిగాంచిన పోస్టులు